సమరోత్సాహం

20 Sep, 2014 00:45 IST|Sakshi
సమరోత్సాహం
  • బాక్సైట్‌పై మావోయిస్టుల యుద్ధం
  •  గ్రామాలలో చైతన్య సదస్సులు
  •  పెద్ద ఎత్తున తరలి వస్తున్న ఆదివాసీలు
  • పాడేరు : ప్రభుత్వం బాక్సైట్ తుట్టె ను కదపడం ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో మావోయిస్టులకు కలిసొచ్చింది. విశాఖ ఏజెన్సీలో విలువైన ఈ ఖనిజాన్ని వెలికితీసి ఆర్థికంగా లాభపడాలనుకున్న టీడీపీ ప్రభు త్వ చర్యలు దళసభ్యులకు అనుకూలమయ్యాయి. బాక్సైట్ తవ్వకాలను వ్యతి రేకిస్తున్న ఆదివాసీలు మావోయిస్టులకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారు. కొంతకాలంగా మన్యంలో స్తబ్దుగా ఉన్న మావోయిస్టులు బాక్సైట్ వ్యతిరేక ఉద్యమంతో తమ కార్యకలాపాలను విస్తృతం చేస్తున్నారు.

    కొయ్యూరు, జీకేవీధి, చింతపల్లి, జి.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల మారుమూల ప్రాంతాలతోపాటు ఒడిశా సరిహద్దుల్లోనూ బాక్సైట్ వ్యతిరేక ఉద్యమాలకు మావోయిస్టు పార్టీ ఇటీవల శ్రీకారం చుట్టింది. కాకులు దూరని కారడవుల్లో గిరిజనులతో సమావేశాలు నిర్వహిస్తూ గిరిజనుల మద్దతును కూడగడుతున్నది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని నాయకులు కూడా విశాఖ ఏజెన్సీలోని మారుమూల ప్రాంతాల్లో పర్యటిస్తూ బాక్సైట్ వ్యతిరేక ఉద్యమానికి గిరిజనులను మరింత చైతన్య పరుస్తున్నట్లు తెలిసింది.

    దీంతో విశాఖ ఏజెన్సీ, ఏఓబీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మారుమూల గూడేలు, ఒడిశాకు చెందిన గిరిజనులు కూడా మావోయిస్టుల పిలుపునకు స్పందించి బాక్సైట్ వ్యతిరేక సదస్సులకు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. అడవినే నమ్ముకుని జీవిస్తున్న ఆదివాసీలను అడవి నుంచి తరమికొట్టే ప్రభుత్వ చర్యలను అడ్డుకోవాలనే మావోయిస్టుల పిలుపునకు మారుమూల గిరిజనులు స్పందిస్తున్నారని చెప్పడానికి ఇటీవల మావోయిస్టులు నిర్వహించిన సదస్సులే నిదర్శనం.

    ఈ పరిస్థితితో పోలీసుశాఖ అప్రమత్తమైంది. పెద్ద ఎత్తున కూంబింగ్‌కు సమాయత్తం అవుతుంది. ఇప్పటికే చింతపల్లి, జీకేవీధి, జి.మాడుగుల ప్రాంతాల్లో పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు, మావోయిస్టుల బూటు చప్పుళ్లతో అటవీ ప్రాంతాలు మారు మోగుతున్నాయి. ఏ క్షణానికి ఏం జరుగుతుందోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.

మరిన్ని వార్తలు