కొండా.. కోనల్లో.. లోయల్లో..

27 Aug, 2019 13:03 IST|Sakshi

అరకును తలపించే ప్రకృతి సౌందర్యం పశ్చిమ ఏజెన్సీ సొంతం

ఎన్నెన్నో ప్రాంతాలు.. అన్నింటా అందాలు

పర్యాటక అభివృద్ధికి నిరీక్షణ  

‘అందని మిన్నే ఆనందం.. 
అందే మన్నే ఆనందం... 
అరె భూమిని చీల్చుకు పుట్టే పసిరిక ఆనందం..
మంచుకు ఎండే ఆనందం.. వాటికి వానే ఆనందం.. అరె ఎండకి వానకి రంగులు మార్చే ప్రకృతి ఆనందం..’ అని ఓ సినీకవి ప్రకృతి విశిష్టతను ఎంతో గొప్పగా వర్ణించారు. అలాంటి అందమైన అరకు ప్రాంతానికి ఏమాత్రం తక్కువ కాకుండా పశ్చిమ ఏజెన్సీ ప్రాంతం ప్రకృతి సొబగులతో కనువిందు చేస్తోంది.

సాక్షి, బుట్టాయగూడెం:  కొండా.. కోనా.. వాగు.. వంక.. ప్రకృతి రమణీయతతో కట్టిపడేస్తున్నాయి. తొలకరి జల్లుల తర్వాత కురిసే వర్షాలతో పచ్చని చీరను కప్పుకున్న అటవీ అందాలు మైమరపింపజేస్తున్నాయి. కొండవాగుల్లో జలపాతాలను తలపించే నీటి ప్రవాహాలు అబ్బురపరుస్తున్నాయి. బుట్టాయగూడెం మండలంలోని గోగుమిల్లి నుంచి గుబ్బల మంగమ్మ ఆలయం వరకు అటవీ ప్రాంతంలో ఎన్నెన్నో అందాలు. ప్రధానంగా పులిరామన్నగూడెం నుంచి గోగుమిల్లి వరకూ దట్టమైన అటవీ ప్రాంతంలో తారురోడ్డుపై ప్రయాణం వెన్నెల్లో హాయ్‌ హాయ్‌ అన్నట్టు సాగుతుంది. రోడ్డుకు రెండువైపులా పొడవైన చెట్లు, ఎతైన కొండల మధ్య ప్రయాణం ఆహ్లాదంగా ఉంటుంది.

రెండు కొండల మధ్య నిర్మించిన జల్లేరు జలాశయం నిండు కుండలా కళకళలాడుతున్నప్పుడు చుట్టూ కొండలతో మరింత సుందరంగా కనిపిస్తుంది. దట్టమైన అటవీ ప్రాంతం, ఎత్తయిన కొండల నడుమ కోడెవాగు కళ్లు తిప్పుకోకుండా చేస్తుంది. జూలై తర్వాత కురిసే వర్షాలతో మోడు బారిన చెట్లు సైతం చిగురించి అడవి తల్లి సరికొత్త అందాలను సంతరించుకుంటోంది. ఇలా పశ్చిమ ఏజెన్సీలో ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. గతంతో పోలిస్తే ప్రయాణ సౌకర్యాలు బాగున్నాయి. ఈ ప్రాంతంలో పర్యాటకంపై అధికారులు దృష్టి సారిస్తే పశ్చిమ ఏజెన్సీలో అభివృద్ధి సవ్వడులు మార్మోగుతాయి.
కొండల నడుమ కోడెవాగు కనువిందు 

పచ్చదనంతో నిండిన అటవీ ప్రాంతం 

పులిరామన్నగూడెం నుంచి గోగుమిల్లి వెళ్లే మార్గం 

బుట్టాయగూడెం మండలం ముంజులూరులో ఏనుగుల జలపాతం , గుబ్బల మంగమ్మతల్లి సన్నిధానంలో జలపాతం 

గుబ్బల మంగమ్మ గుడి వద్ద జలపాతం  

కొండ ప్రాంతంలో రాళ్ల మధ్య నీటి సవ్వడి 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా