అంతర్‌రాష్ట్ర చెక్‌పోస్టులు ప్రారంభం

3 Jun, 2014 00:17 IST|Sakshi
అంతర్‌రాష్ట్ర చెక్‌పోస్టులు ప్రారంభం

దాచేపలి, న్యూస్‌లైన్: ఆంద్రప్రదేశ్- తెలంగాణ రాష్ట్రాల ఏర్పాటు నేపథ్యంలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రవాణశాఖ తనిఖీ కేంద్రా న్ని ఏర్పాటుచేశామని గుంటూరు ఉపరవాణా కమిషనర్ డాక్టర్ వి.సుందర్ తెలిపారు. గామాలపాడు పంచాయతీ పరిధిలోని జేపీ సిమెంట్స్ సమీపంలో రవాణా చెక్‌పోస్టును సోమవారం ఏర్పాటు చేశారు. డీటీసీ సుందర్ ప్రత్యేకంగా పూజలుచేసి ఈ చెక్‌పోస్టును ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీటీసీ సుందర్ మాట్లాడుతూ విభజన నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు సరిహద్దుగా ఇక్కడ చెక్‌పోస్టును ఏర్పాటుచేశామన్నారు. ప్రభుత్వం నుంచి విధివిధానాలు వచ్చిన తరువాత చెక్‌పోస్టు నిర్వహణపై పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తామన్నారు. 24 గంటలపాటు చెక్‌పోస్టులో సిబ్బంది ఉంటారని, పగలు ఏడుగురు, రాత్రి సమయంలో ఇద్దరు విధులు నిర్వహిస్తారని చెప్పారు. ఇన్‌చార్జిగా మాచర్ల ఎంవీఐ సీహెచ్ రాంబాబు వ్యవహరిస్తారని తెలి పారు. ప్రారంభ కార్యక్రమంలో గుంటూరు ఆర్టీవో బి.చందర్, ఎంవీఐలు టి.ఉమామహేశ్వరావు, ఎం.బాలమురళీకృష్ణ, బి.సత్యనారాణప్రసాద్, బి.గోపినాయక్, ఎం.రామచంద్రరావు, ఏఎంవీఐ లు ఎన్.గోపాల్, ఎన్.ప్రసన్నకుమారి తదితరులు పాల్గొన్నారు.
 
 బోర్డుల ఏర్పాటు..
 జేపీ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద రవాణా శాఖకు చెందిన చెక్‌పోస్టును ఏర్పాటు చేయడంతో ఆ శాఖ అధికారులు రోడ్డుపై తగిన చర్యలు తీసుకున్నారు. చెక్‌పోస్టు పరిసరాల్లో రోడ్డుకు ఇరువైపులా చెక్‌పోస్టు ఉన్నట్లు బోర్డులు ఏర్పాటుచేశారు.
 
 మాచర్ల టౌన్: రాష్ట్ర విభజన నేపథ్యంలో మాచర్ల కొత్తపల్లి జంక్షన్ వద్ద సోమవారం ఉదయం అంతర్ రాష్ట్ర చెక్‌పోస్టును రవాణా శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. తెలంగాణ సరిహద్దు అయిన మాచర్ల ప్రాంతంలో తాత్కాలికంగా చెక్‌పోస్టును ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా రవాణా శాఖ అధికారులు కొత్తపల్లి జంక్షన్ నూతన ఆర్టీవో కార్యాలయ సమీపంలో తాత్కాలిక చెక్‌పోస్టు నిర్మాణం చేశారు. నరసరావుపేట ఆర్టీవో రామస్వామి పూజలు జరిపి చెక్‌పోస్టును ప్రారంభించారు. అనంతరం లాంఛనంగా వాహనాలను తనిఖీ చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సందర్భంగా నూతనంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో తాత్కాలికంగా చెక్‌పోస్టు ఏర్పాటుచేసినట్లు రామస్వామి తెలిపారు. మార్చి వరకు ఈ చెక్‌పోస్టును ఇక్కడ కొనసాగించి ప్రభుత్వం భూమి కేటాయించిన ప్రాంతంలో పూర్తిస్థాయి చెక్‌పోస్టును ఏర్పాటు చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇతర రాష్ట్రాల నుంచి ఐదారు వందల వాహనాలు ప్రతిరోజూ వస్తాయని తమ సర్వేలో తేలిందన్నారు. కార్యక్రమంలో ఎంవీఐలు           టి.రాఘవరావు, మల్లేశ్వరి, కేసీపీ రవాణా శాఖ ఇన్‌చార్జి చంద్రశేఖర్, అర్చకులు నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.  
 

మరిన్ని వార్తలు