ఈనాడు రామోజీతో ఏబీఎన్‌ రాధాకృష్ణ పోటీ పడుతున్నాడా?

14 Nov, 2023 11:42 IST|Sakshi

తెలుగుదేశం పార్టీ తరపున పవర్ బ్రోకరిజం చేసే ఆంధ్రజ్యోతి యజమాని వి.రాధాకృష్ణ ప్రజలకు నీతులు చెబుతున్నారు. పచ్చి అబద్దాలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు. నిత్యం ఆంధ్రప్రదేశ్‌పై విషం చిమ్ముతున్న ఈనాడు రామోజీరావుతో ఈయన పోటీ పడుతున్నారు. కాకపోతే తాము బట్టలు లేకుండా తిరుగుతున్నారన్న సంగతి వారికి తెలియడం లేదు కాని, ఏపీ ప్రజలకు ఎప్పుడో తెలిసిపోయింది. జగన్ పరిపాలన వల్ల ఆంధ్రప్రదేశ్ పరువు పోయిందని హైదరాబాద్‌లో కూర్చుని ఈయన శాపనార్దాలు పెడుతున్నారు.

✍️ఈయన నెత్తిన పెట్టుకుని మోసే చంద్రబాబు నాయుడి ప్రభుత్వం చెత్తగా పాలిస్తోందని జపాన్‌కు చెందిన మాకి అనే సంస్థ ఏకంగా దేశ ప్రధానమంత్రికి లేఖ రాసిందే. దానిని కదా పరువు పోవడం అనాల్సింది. ఒకవైపు కేంద్రం నుంచి ఏపీకి అనేక ర్యాంకులు వస్తుంటే, ఈయనకు మాత్రం వెనుకబడి పోయినట్లు, అక్కడ ఏమీ జరుగుతున్నట్లు కనిపించడం లేదు. నిజమే చంద్రబాబు టైమ్‌లో వందల కోట్లు అప్పనంగా సంపాదించుకున్నారని చెబుతారు. అలాంటి వ్యక్తికి ఇప్పుడు గిట్టుబాటు కాకపోతే రాష్ట్రం వెనుకబడిపోయినట్లు అనిపిస్తుంది. అధికారులు గంగిరెద్దుల్లా పనిచేస్తున్నారని ఈయన ఆరోపించారు. అంటే ఈయన ఆడమన్నట్లు ఆడితే మంచి ఎద్దు అవుతుందేమో!

✍️చంద్రబాబు టైమ్‌లో ఆనాటి ఇంటెలిజిన్స్ ఉన్నతాధికారి నేతృత్వంలో తెలుగు యువత అధ్యక్ష పదవికి ఎంపిక చేసినప్పుడు ఆ అధికారి గంగిరెద్దు కాదన్నమాట! తనతో కలిసి కొందరు ఐపీఎస్ అధికారులు ఆనాడు ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యేలను బేరసారాలాడి కొనుగోలు చేసినప్పుడు వారంతా బ్రహ్మాండంగా పనిచేశారని ఈయన సర్టిఫికెట్ ఇచ్చారు. టీడీపీ ఎంపి, ఒక ఎమ్మెల్యే మరికొందరు నేతలు రవాణా శాఖ కార్యదర్శిపై ఆ రోజుల్లో దౌర్జన్యం చేసినప్పుడు ఈయన గుడ్డి గుర్రం పళ్లుతోముతున్నారా?. తన పార్టీ వారిపై చర్య తీసుకోకుండా రాజీ చేసిన ఆనాటి చంద్రబాబు గంగిరెడ్లను ఆడించే వ్యక్తిలా ఆయనకు కనిపించలేదు.

✍️ఇప్పుడు అలాంటి ఘటనలు ఏమైనా జరుగుతున్నాయా?. అంతెందుకు అప్పటి టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు తమ ఇసుక దోపిడీని అడ్డుకున్న ముసునూరు ఎమ్మార్యో వనజాక్షిని జుట్టుపట్టుకుని ఈడ్చినప్పుడు  ఈయనకు చాలా కమ్మగా ఉందన్నమాట. పైగా తన ఎమ్మెల్యేని కాకుండా మహిళా అధికారిని మందలించిన ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు వల్ల రాష్ట్రం పరువు పోలేదని ఈయన చెబుతున్నారు. చంద్రబాబుపై కేసులు పెట్టి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారట. అది అసలు ఏడుపు! అంటే అవినీతికి పాల్పడి వందల కోట్లు అప్పనంగా తిన్నారన్న అభియోగాలు వచ్చినా చర్యలు తీసుకోరాదట.

✍️మరో వైపు తనను ఎవరూ ఏమీ పీకలేరని చంద్రబాబు సవాల్ చేసినప్పుడు అవునవును అని భాజాలు వాయించినప్పుడు ఈయనకు సమ్మగా ఉంది. అదే కేసులో చర్య తీసుకోగానే ఆయనతో పాటు ఈయన, రామోజీ నానా గగ్గోలు పెడుతూ, అవినీతికి తాము ఎలా కొమ్ము కాస్తున్నది ప్రజలకు తెలిసేలా చేశారు. గ్రామ సచివాలయాల వద్ద సంక్షేమ కార్యక్రమాల బోర్డులు పెడుతుంటే పెద్ద తప్పు జరిగిపోతున్నట్లు ప్రభుత్వ సిబ్బందిని దుర్వినియోగం చేస్తున్నట్లు తెగ ఏడ్చేస్తున్నారు. కేంద్రం ఇచ్చే నిధులతో నిర్మించే రోడ్లు ఉన్న చోట ఒక బోర్డు పెట్టి అది ప్రధాని ఇచ్చిన నిధులతో అని ఎందుకు చెబుతున్నారు?.

✍️ఆ విషయాన్ని ఏనాడైనా ఈయన తప్పు పట్టారా? పూర్తికాని పోలవరం ప్రాజెక్టు వద్దకు కోట్ల రూపాయల వ్యయంతో జనాన్ని బస్‌లలో తరలించి జయము, జయము చంద్రన్న అని పాటలు పాడించి జనంలో నవ్వులపాలైనా, రాధాకృష్ణ, రామోజీ వంటివారికి మాత్రం తియ్యని పాటల్లా వినిపించాయి. మరో పెద్ద అబద్దం అలవోకగా చెప్పేశారు. జగన్ ప్రభుత్వం ఏడు లక్షల కోట్లు అప్పుచేసిందట. అందులో రెండు లక్షల కోట్లు పంచారట. మిగిలిన ఐదు లక్షల కోట్లు ఏమయ్యాయని, అచ్చం టీడీపీ అధికార ప్రతినిధి మాదిరి ఆయన చండాలపు అసత్యాలు చెబుతున్నారు. ఇలా రాయడానికి ఏ మాత్రం సిగ్గుపడకపోవడం ఆయన విలక్షణ శైలి అని అనాలి.

✍️చంద్రబాబు టైమ్‌లో చేసిన అప్పుల గురించి ఎన్నడైనా వార్తలు ఇచ్చారా?పైగా చంద్రబాబు కాబట్టి అప్పులు వస్తున్నాయని డబ్బా కొట్టారే!. కేంద్రం ఏపీ అప్పు ఐదు లక్షల కోట్లకు చేరిందని పలుమార్లు చెప్పినా, ఈ రకంగా అసత్యాలు వెల్లె వేయడానికి వెనుకాడడం లేదంటే వీరు ఎంత గుండెలు తీసిన బంటో అర్ధం అవుతుంది. ఆ ఐదు లక్షల కోట్లలో చంద్రబాబు పాలన చేసిన రెండున్నర లక్షల కోట్లు, విభజన సమయంలో ఏపీకి కేటాయించిన లక్ష కోట్లు ఉన్నాయన్న సంగతిని కూడా దాచేస్తూ ఉండే వీరి నైజాన్ని ఏమనాలి?. నాసిరకం మద్యం అంటూ తప్పుడు ఆరోపణలు.. ఆ మద్యం బ్రాండ్లన్నీ చంద్రబాబు టైమ్ లో వచ్చినవే కదా!

✍️నిరుద్యోగులకు ఉపాధి లేదట. దేశంలో ఏ ప్రభుత్వం అయినా ఒక టరమ్‌లో రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇచ్చిందా?. అయినా దానిని కప్పిపుచ్చి ప్రజలను చీట్ చేయాలనుకునే చీటింగ్ మనస్తత్వం గురించి ప్రజలు ఆలోచించలేరనా వీరి ధైర్యం?. కాని ఆ రోజులు పోయాయి. ప్రతి ఒక్కరు వాస్తవాలు తెలుసుకుంటున్నారు. ఎవరు ముఖ్యమంత్రి అన్నది ముఖ్యం కాదట. చంద్రబాబా, పవన్ కళ్యాణ్ అన్నది కాదట. రాష్ట్రం గౌరవం నిలబడాలట. అంటే పవన్ కళ్యాణ్ పిచ్చోడు.. ఆయనకు సీఎం పదవి అవసరం లేదని చెప్పడమే రాధాకృష్ణ లక్ష్యం అన్న సంగతి తెలుస్తూనే ఉంది. ఏదో రకంగా పవన్ కళ్యాణ్‌ను వాడుకుని, పొరపాటున అధికారం వస్తే, ఆయనను పక్కకు తోసేయడమే వీరి కుట్ర అని పవన్ అభిమానులు అర్ధం చేసుకోకపోతే వారి ఖర్మ అనుకోవాల్సిందే.

✍️ఆంధ్రజ్యోతి, ఈనాడు వంటి మీడియా సంస్థలు ఎంత ఏడుస్తున్నా, ఎన్ని రకాలుగా అడ్డు తగులుతున్నా, కోర్టులను అడ్డం పెట్టుకుని ఎన్ని డ్రామాలు ఆడుతున్నా ముఖ్యమంత్రి జగన్ ఎక్కడా వెనక్కి తగ్గకుండా, తన మానిఫెస్టో ప్రకారం, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చిన విషయం జనంలోకి వెళ్లకూడదన్నది వీరి తపన. చంద్రబాబు లక్ష కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేసినా, 400 హామీలతో ఎన్నికల మానిఫెస్టో ఇచ్చి, ఆ తర్వాత వెబ్ సైట్ నుంచి దానిని తొలగించిన చంద్రబాబు వీరి దృష్టిలో గొప్పవాడు. 99 శాతం హామీలు అమలు చేసిన జగన్ ఏమో రాష్ట్రం పరువు తీసినవాడట!

✍️రాధాకృష్ణ నీచపు ఆలోచనకు ఇంతకన్నా వేరే ఉదాహరణ ఉంటుందా?. డబ్బు పంచడంతో రాష్ట్రం నాశనం అయిందని ప్రచారం చేసిన రాధాకృష్ణ, టీడీపీ వారు మిని మానిఫెస్టో పేరుతో అంతకు ఐదు రెట్లు పంచుతామని చెప్పినప్పుడు ఏమి రాశారు? జగన్‌పై శరాలు సిద్దం చేశారని కదా?. ఇక జగన్ ప్రభుత్వం పని అయిపోయిందని కదా! దీనిని బట్టే ఆంధ్రజ్యోతి, ఈనాడులు ఎంత నీచంగా మారింది. జర్నలిజాన్ని ఏ వ్యాపారంగా మార్చిందన్న దానిపై వస్తున్న విశ్లేషణలు వింటే వీరు సిగ్గుపడాలి. కాకపోతే వాటిని వదలివేసిన వారికి ఏమి చెబుతాం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి, రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్ నాయుడు వంటివారు ఎంత ఏడ్చినా, ఎన్ని కుట్రలు చేసినా ఎదుర్కొని హీరోగా నిలబడుతున్న జగన్‌కు హాట్సాఫ్‌ చెప్పాలి.


:::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్

మరిన్ని వార్తలు