నమ్మించి నిండా ముంచారు

18 Dec, 2013 03:18 IST|Sakshi

హిందూపురం అర్బన్, న్యూస్‌లైన్ :  సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఏపీ ఎన్‌జీఓ సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు జనాన్ని నమ్మించి మోసం చేశారని, వారు సమైక్య ద్రోహులని అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఎన్నికల పరిశీలకుడు, కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. హిందూపురంలో మంగళవారం నిర్వహించిన సమైక్య శంఖారావం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
 
 సమైక్యాంధ్ర కోసం పోరాటం చేస్తామని, బిల్లును అడ్డుకుంటామని కల్లబొల్లి మాటలు చెప్పిన ముఖ్యమంత్రి చివరికి టీబిల్లు వచ్చిన తొలిరోజు అసెంబ్లీకి గైర్హాజరయ్యారని అన్నారు. రాజకీయ పార్టీలను కలుపుకొని ఉద్యమించాలని వైఎస్సార్ సీపీ సూచించినా.. పెడచెవిన పెట్టి ఏకపక్షంగా వ్యవహరించి అశోక్‌బాబు సమైక్య ఉద్యమాన్ని నీరుగార్చారన్నారు.
 
 టీడీపీ అధినేత చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంతో ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి దిక్సూచిలా వ్యవహరిస్తున్నారని అన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే కాంక్షతో విభజన ప్రకటన వెలువడినప్పటి నుంచి అలుపెరగకుండా వైఎస్సార్ సీపీ పోరాటం సాగిస్తూనే ఉందన్నారు. టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ ఏకమై వైఎస్సార్ సీపీని దెబ్బతీయాలని చూస్తున్నాయన్నారు. ప్రజల మనసుల్లో నుంచి జననేత జగన్‌మోహన్‌రెడ్డిని దూరం చేయడానికి ఎత్తులు వేస్తున్నారని, ఎన్ని కుట్రలు పన్నినా వారి ఆటలు సాగవన్నారు. మోసం చేస్తున్న కాంగ్రెస్, టీడీపీలను బంగాళాఖాతంలో ముంచాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. హిందూపురం పట్టణానికి తాగునీటిని అందించడానికి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి రూ.660 కోట్లు వెచ్చించి శ్రీరామిరెడ్డి తాగునీటి పథకాన్ని చేపట్టారన్నారు. ఈ పనుల్లో కూడా మంత్రి రఘువీరారెడ్డి కమీషన్లకు కక్కుర్తిపడటంతో ఇంకా చాలా గ్రామాలకు నీరు సరిగా అందడం లేదన్నారు.
 
 పార్టీ జిల్లా కన్వీనర్ శంకరనారాయణ మాట్లాడుతూ హిందూపురంలో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో మహానేత వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి తాగునీరిచ్చి అపర భగీరథుడిగా నిలిచారన్నారు. ఇప్పుడు ప్రజలకు వైఎస్ రుణం తీర్చుకునే సమయం అసన్నమైందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్తలు కొండూరు వేణుగోపాల్‌రెడ్డి, చౌళూరు రామకృష్ణారెడ్డి, పార్టీ నేతలు నవీన్‌నిశ్చల్, ఇనాయతుల్లా, మీసాల రంగన్న తదితరులు మాట్లాడారు. సభలో టీ బిల్లు ప్రతులు చింపివేసి నిరసన తెలిపారు.
 

మరిన్ని వార్తలు