వి‘భజన’

6 Oct, 2013 06:29 IST|Sakshi

విశాఖపట్నం - సాక్షి ప్రతినిధి
 సమైక్యాంధ్రప్రదేశ్ కోసం విశాఖ జిల్లాలోనూ అన్ని వర్గాల జనం గత రెండు నెలలుగా రోడ్డెక్కారు. జనం ఇబ్బందులు భరిస్తూ కూడా ఉద్యమానికి వెన్ను దన్నుగా నిలుస్తున్నారు. తాము ఓట్లేసి గెలిపించిన ప్రజాప్రతినిధులు పార్టీ హై కమాండ్‌ను ధిక్కరించి జై సమైక్యాంధ్ర అని నినదించాలంటూ జనం మంత్రుల ఇళ్లు ముట్టడిస్తున్నారు. వీధుల్లో వారి బొమ్మలు పెట్టి రకరకాల రీతిలో నిరసనలు తెలియచేస్తున్నారు. ఇంత జరుగుతున్నా కేంద్ర మంత్రి పురంధేశ్వరి కనీసం ఉద్యమ కారుల వద్దకు వచ్చి నైతిక మద్దతు కూడా ప్రకటించలేక పోతున్నారు. సీడబ్ల్యూసీ నిర్ణయం వెలువడిన తర్వాత పదవికి రాజీనామా లేఖను తీసుకుని దిగ్విజయ్ సింగ్‌కు ఇచ్చాననీ, ఆయన వద్దనడంతో దాన్ని వెనక్కు మీడియాకు చెప్పుకున్నారు. కేంద్ర మంత్రి వర్గం తెలంగాణ కేబినెట్ నోట్‌ను ఆమోదించాక కూడా జనం కంటే టికెట్ ఇచ్చిన హై కమాండ్, పదవే ఎక్కువ అనేలా వ్యవహరిస్తున్నారు.
 
  ఈసారి కూడా ఉత్తుత్తి రాజీనామా ప్రకటన చేశారు.  రాష్ట్రాన్ని విడగొడితే ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నామని మంత్రి బాలరాజు సీడబ్ల్యూసీ తీర్మానానికి ముందు పెద్ద స్వరమే వినిపించారు. తీర్మానం జరిగాక మాట మార్చారు. తాను సమైక్య వాదినేని చెప్పుకుంటూ పదవికి రాజీనామా చేస్తే ఉపయోగం లేదని అంటున్నారు. తరచూ ఉద్యమ సెగ తగులుతున్నా బాలరాజు ఉద్యమ కారుల మీద పరోక్షంగా కక్ష సాధించడం తప్ప పదవికి రాజీనామా చేసే ఆలోచనే చేయడం లేదు.
 
 గంటా ‘రాజీ’ నామా
 సమైక్యాంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహిస్తానని చెప్పిన మంత్రి గంటా శ్రీనివాసరావు సీడబ్ల్యూసీ తీర్మానం చేసిన రోజే పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించా రు.  తర్వాత కూడా అధికార హోదాను మాత్రం కొనసాగిస్తున్నారు. మంత్రి హోదాలోనే అధికారులతో సమీక్షలు కూడా జరుపుతున్నారు. తెలంగాణ తీర్మానం శాసనసభకు వ స్తే దాన్ని ఓడించడానికి పదవిలో ఉండక తప్పదనే పల్లవి అందుకుని జనం చెవిలో పువ్వులు పెట్టే రాజకీయం నడుపుతున్నారు. సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి చెప్పారని పదవికి రాజీనామా చేయడానికి ఆయన ఇష్టపడటం లేదు. ఒక వైపు పార్టీ హై కమాండ్ నిర్ణయాన్ని తప్పు పడుతూ తాను సమైక్య వాదినని చెప్పుకుంటూనే మరో వైపు పదవిని వీడటానికి ఆయన ఇష్టపడటం లేదు. తెలంగాణ నోట్ మీద శాసనసభ అభిప్రాయం కోరడం తప్ప తీర్మానం ఏదీ ఉండదని ఢిల్లీ వర్గాలు చెబుతున్నా ఇదే పాట పాడుతున్నారు.
 
  ఒక వేళ ఆయన చెబుతున్నదే నిజమవుతుందనుకున్నా మంత్రి పదవికి రాజీనామా చేసినా ఎమ్మెల్యేగా ఆయన శాసనసభలో ఓటు వే యొచ్చు. దీన్ని బట్టి చూస్తే ఒక వైపు ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ మరో వైపు ప్రజలకు దగ్గరయ్యే రాజకీయం నడుపుతున్నారనే విషయం అర్థమవుతోంది. రాజ్యసభ సభ్యుడు టి. సుబ్బరామిరెడ్డి పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి రాజీనామా లేఖ పంపానని చెప్పుకుంటూ కాలం గడిపేస్తున్నారు. ఉద్యమ సెగ తగిలితే లేఖను చూపి బయటపడే రాజకీయం చేస్తున్నారు.
 
 ఎమ్మెల్యేలదీ అదే దారి
 తెలంగాణ ప్రకటన వెలువడిన వెంటనే  కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల శాసనసభ్యులందరూ తమ పదవులకు రాజీనామా చేసినట్లు ప్రకటించారు.  ఏ ఒక్కరు కూడా స్పీక ర్ ఫార్మెట్‌లో రాజీనామా లేఖ రాసి నేరుగా ఆమోదించుకునే ప్రయత్నం చేయలేదు.  కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎంకు కొందరు, పీసీసీ అధ్యక్షుడికి కొందరు రాజీనామా లే ఖలు ఇవ్వడం ఎవరిని మోసం చేయడాని కో జనానికి తెలుసు.
 
 దేశం పార్టీ ఎమ్మెల్యేల దైతే మరింత దయనీయమైన స్థితి. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కేబినెట్ నోట్ ఆమోదం తర్వాత కూడా సమైక్యాం ధ్రప్రదేశ్ ఉండాలని మాట్లాడలేక పోతున్నారు. దీంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు జనంలోకి వెళ్లే ధైర్యం చేయలేక పోతున్నారు.

మరిన్ని వార్తలు