మరోసారి ప్రవాసి

4 Nov, 2023 04:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా బీజేపీ పాలిత రాష్ట్రాల ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు శనివారం నుంచి రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు తరలివెళ్లనున్నారు. పార్టీపరంగా చేపడుతున్న ‘ప్రవాసీ యోజన’లో భాగంగా ఇప్పటికే రెండు, మూడు విడతలుగా వారు ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ సైతం వెలువడి నామినేషన్ల పర్వం కూడా ప్రారంభం కావడంతో..వీరంతా తమకు కేటాయించిన నియోజకవర్గాల పరిధిలో నెలరోజుల పాటు మకాం వేయనున్నారు. అంటే ఎన్నికలు ముగిసే దాకా అక్కడే ఉండనున్నారు. పార్టీ ప్రచారం, నేతల మధ్య సమన్వయం ఇతర అంశాలను అధిష్టానం దూతలుగా పర్యవేక్షించనున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులు, ఇంటింటి ప్రచారం, ప్రధాన పార్టీల బలాబలాలు వంటివి పరిశీలించి నాయకత్వానికి అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు.  

ఇన్‌చార్జీల నియామకం! 
పార్టీ పరంగా రాష్ట్రాన్ని 38 జిల్లాలు, 6 జోన్లుగా విభజించిన సంగతి తెలిసిందే. కాగా ఈ జిల్లాలు, జోన్ల వారీగా ఇతర రాష్ట్రాల నేతలు దృష్టి కేంద్రీకరించనున్నారు. కాగా రాష్ట్రంలో ఇప్పటికే వివిధ రూపాల్లో పనిచేస్తున్న వారితో పాటు కిందిస్థాయిలో పరిస్థితుల అంచనాకు ఈ నేతల సేవలను పార్టీ ఉపయోగించుకోనుంది. ఈ నేతలు థర్డ్‌ పార్టీ మాదిరిగా పనిచేస్తుండడంతో, ఆయా నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు జవాబుదారీతనంతో పనిచేసే వీలుంటుందని నేతలు చెబుతున్నారు. జోన్లకు ఇన్‌చార్జీలుగా కూడా వీరు వ్యవహరిస్తారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయ కులు, ఆంధ్రప్రదేశ్‌ నుంచి కొందరు నేతలు ఇప్పటికే ఇక్కడకు చేరుకున్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో జరిగిన వర్క్‌షాపులో జాతీయ నేతలు ప్రకాశ్‌ జవదేకర్, తరుణ్‌ ఛుగ్, అరి్వంద్‌ మీనన్‌ వారికి దిశానిర్దేశం చేశారు. ఆరుజోన్లు, జిల్లాలు, ఆయా నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జీల నియామకం జరిగినట్టు సమాచారం.  

డబుల్‌ చెక్‌కు దోహదం 
బీజేపీ జాతీయ నాయకత్వం కొంతకాలంగా అనుసరిస్తున్న రాజకీయ విధానంలో భాగంగానే ప్రవాసీ యోజనను   చేపడుతున్నట్టు ఓ ముఖ్యనేత సాక్షికి వెల్లడించారు. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినపుడు కూడా తెలంగాణకు చెందిన నేతలు ఆయా ప్రాంతాలకు వెళ్లి పూర్తిసమయం కేటాయించి పనిచేసిన సందర్భాలున్నాయని గుర్తు చేశారు. నేతల మధ్య సమన్వయం సాధించడంతో పాటు, ఎన్నికలకు సంసిద్ధత, ఇతర అంశాల్లో ఏవైనా లోటుపాట్లు, లోపాలు గుర్తిస్తే వాటిని సరిచేసుకునేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని వివరించారు. స్థానికంగా కార్యకర్తల ఇళ్లల్లోనే భోజనాలు చేయడం ద్వారా వారితో కలిసిపోయేందుకు వీలు కలుగుతుందని, క్షేత్రస్థాయిలో పోలింగ్‌ బూత్‌ కమిటీల సమన్వయం, ఎన్నికల ప్రచారం, ఇతర అంశాలపై దృష్టి సారించడం ద్వారా పార్టీ పరంగా డబుల్‌ చెకింగ్‌కు వీలు కలుగుతుందని తెలిపారు.   

ఇదీ చదవండి: కేసీఆర్‌ ఓటమి ఖాయమైంది 

మరిన్ని వార్తలు