అస్తవ్యస్తం.. అసమగ్రం.. అస్పష్టం

25 May, 2014 01:53 IST|Sakshi
అస్తవ్యస్తం.. అసమగ్రం.. అస్పష్టం

జూన్ 2 ముంచుకొస్తున్నా నత్తనడకన విభజన ప్రక్రియ
మే 15 నాటికి పూర్తవ్వాలన్న గవర్నర్ ఆదేశాలు గాలికి
ఉద్యోగుల కేటాయింపుపై ఇంకా రగడే
స్థానికతను ఉల్లంఘించారంటూ ఆరోపణలు
‘రెండు రాష్ట్రాల ప్రయోగాత్మక పాలన’ ఊసే లేదు
ఐఏఎస్‌ల కేటాయింపే ఇంకా కొలిక్కి రాలేదు
20 సంస్థలను విభజించాలి... పూర్తయింది రెండే
సచివాలయం, అసెంబ్లీల విభజన ఉత్తర్వులే రాలేదు
డిజిటైజ్డ్ ఫైళ్లను ఎవరికి అప్పగించాలో అయోమయం
 
 సాక్షి, హైదరాబాద్: అంతా అయోమయం... గందరగోళం... అసమగ్రం... అసంపూర్ణం. వెరసి... విభజన ప్రక్రియ ఆద్యంతం అస్తవ్యస్తం! ఓ వైపు అపాయింటెడ్ డే అయిన జూన్ 2 ముంచుకొస్తున్నా విభజన ప్రక్రియ మాత్రం ఇంకా నత్త నడకనే సాగుతోంది. దాంతో... మే 26 నుంచి ప్రయోగాత్మకంగా రెండు రాష్ట్రాల పాలన వ్యవస్థలు విడిగా కార్యక్రమాలు ప్రారంభించాలని తొలుత భావించినా అదిప్పుడు సాధ్యం కావడం లేదు. చివరి నిమిషం దాకా ఏదీ తేల్చలేని పరిస్థితి ఏర్పడింది. పాలనకు గుండెకాయగా చెప్పే సచివాలయంలోనే విభజన ఇంకా ఎటూ తేలలేదు. బ్లాకులవారీగా ఇరు రాష్ట్రాలకు కేటాయింపులు జరిపినా ఏ కార్యాలయం ఏ బ్లాకులో పని చేయాలనే విషయమై సాధారణ పరిపాలన శాఖ ఇప్పటిదాకా ఉత్తర్వులే జారీ చేయలేదు. ఉద్యోగుల తాత్కాలిక విభజన ఉత్తర్వులు వెలువడి, వారు ఏ రాష్ట్రంలో పని చేయాలన్న స్పష్టత కూడా ఇంకా రావాల్సే ఉంది. విభజన తరువాత వారు ప్రస్తుత శాఖల్లోనే పని చేయాలా, మరే శాఖకైనా మార్చి సర్వీసు ఆర్డర్ ఇస్తారా అంటూ ఉద్యోగుల్లో నెలకొన్న సంశయాన్ని తీర్చే నాథుడే లేడు! తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ తేదీని జూన్ 2గా పేర్కొంటూ మార్చి 4న కేంద్రం అపాయింటెడ్ తేదీని ప్రకటించడం తెలిసిందే. అప్పటి నుంచి విభజన ప్రక్రియ కోసం 22 రకాల కమిటీల ఏర్పాటు, అధ్యయనాలు, సమావేశాలు, సర్క్యులర్ల జారీ తదితరాలన్నీ జరిగాయి.
 
 కానీ గడువు ముంచుకు వచ్చిన ఈ సమయంలోనూ ప్రక్రియ ఇంకా పూర్తి కావడమే లేదు. దాదాపు ప్రతి రోజూ సమీక్షలు నిర్వహిస్తున్నా విభజన ప్రక్రియలో ఆశించిన వేగం మాత్రం కనిపించడం లేదు. దీనిపై కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కూడా అసంతృప్తి వ్యక్తం చేయడం తెలిసిందే. ఇరు రాష్ట్రాలు ఏర్పాటయ్యాక సీఎంలిద్దరూ దీన్ని సజావుగా పరిష్కరించుకునే అవకాశమున్నా ముందుగానే విభజనను చేపట్టి జటిలం చేశారని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక ఖాతాను ప్రారంభించడం, ట్రెజరీ కార్యాలయాలు, వాణిజ్య పన్నుల శాఖలో టిన్ నంబర్ కేటాయించడం మాత్రం ఇప్పటిదాకా జరిగాయి. ఈ రెండూ జూన్ 1 అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. విభ జనకు సంబంధించి అంశాలవారీగా పరిస్థితిని ఓసారి పరిశీలిస్తే...
 
 అసెంబ్లీ, శాసనమండలి
 
 ఇబ్బంది: వీటి కేటాయింపుపై కూడా ఇంకా స్పష్టత లేదు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బాధ్యత స్వీకరించాక గాని దీనిపై స్పష్టత వచ్చే అవకాశం లేదు. వారిని సంప్రదించకుండా వీటిని కేటాయిస్తే అనవసర రాద్ధాంతం తప్పకపోవచ్చు. ప్రస్తుత అసెంబ్లీని తెలంగాణకు, పాత అసెంబ్లీ భవనాన్ని సీమాంధ్రకు; ప్రస్తుత శాసనమండలిని తెలంగాణకు, జూబ్లీ హాల్‌ను సీమాంధ్ర మండలికి అని గవర్నర్ వద్ద జరిగిన సమావేశంలో భావించారు. కాని ఎందుకో గానీ ఆ తరవాత దీనిపై అధికారులకే  స్పష్టత లేకుండా పోయింది!
 
 కేంద్ర సర్వీసు అధికారుల కేటాయింపు
 
 ఇబ్బంది: దీనికోసం ఏర్పాటైన ప్రత్యూష్ సిన్హా కమిటీ తుది నివేదిక ఇంకా ఇవ్వనే లేదు. నివేదిక ఆధారంగానే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ వంటి కేంద్ర సర్వీసు అధికారుల కేటాయింపు ఉంటుంది. వారికి ఆప్షన్లుండవని తెలిసి కూడా ‘ఏ రాష్ట్రంలో పని చేయడానికి ఆసక్తి ఉందో తెలపండి’ అంటూ అధికారుల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలు తీసుకున్నారు. వారికి పోస్టింగులు ఎలా, ఎప్పుడిస్తారో తెలియని పరిస్థితి. వారికి పోస్టింగులిస్తే తప్ప పాలన సాధ్యమే కాదు. ఈ మార్గదర్శకాలకు నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక ఆయన ఆమోదం తెలపాల్సి ఉంది. జూన్ 1 అర్ధరాత్రి వారి పోస్టింగులపై స్పష్టత ఇస్తారంటున్నా, ఆ మర్నాటి నుంచే రెండు రాష్ట్రాలూ విడిగా కార్యకలాపాలు ప్రారంభించడం కష్టసాధ్యంగానే కన్పిస్తోంది.
 
 ఉద్యోగుల తాత్కాలిక కేటాయింపు
 
 ఇబ్బంది: ఇది మే 25 నాటికి పూర్తయి 26 నుంచి రెండు రాష్ట్రాలు ప్రయోగాత్మకంగా విడిగా పని చేయాలన్నది నిర్ణయం. కానీ అది అమలు కావడం లేదు. ఉద్యోగుల తాత్కాలిక కేటాయింపుల్లో స్థానికత వివాదం తలెత్తింది. పైగా ఈ జాబితాను కేంద్రానికి పంపాలి. వారు అన్నీ సమగ్రంగా ఉన్నాయో, లేదో పరిశీలించాలి. కేంద్రం ఆమోదం పొందితే తప్ప ఉద్యోగుల కేటాయింపు కొలిక్కి రాదు. పైగా కేటాయింపులో స్థానికతను సరిగా పాటించలేదు. ఇంకా పలు అభ్యంతరాలను ఉద్యోగులు లేవనెత్తుతున్నారు. వారి మధ్య ఇంకా మరెన్నో సమస్యలున్నాయి. అవన్నీ ఎప్పటికి పరిష్కారమవుతాయో తెలియదు.
 
  కార్పొరేషన్లు/సంస్థల విభజన
 
 ఇబ్బంది: జూన్ 2 నాటికి 20 ప్రభుత్వ రంగ సంస్థలు/సహకార సంస్థలను విడదీయాలన్నది లక్ష్యం. కానీ ఇప్పటికి కేవలం ఆర్టీసీ, జెన్‌కోలను మాత్రమే విభజించారు. మిగతా సంస్థల విభజన ఇప్పట్లో పూర్తయ్యేలా లేదు. తాజాగా మరో 38 సంస్థలను ప్రస్తుతానికి విభజనకు దూరంగా ఉంచుతూ పదో షెడ్యూల్‌లో పొందుపరిచారు. విద్యా సంస్థల్లో ఉమ్మడి ప్రవేశాలు, ఉన్నత విద్యామండలి విభజనపై సైతం సందిగ్ధతే కొనసాగుతోంది. ఏపీపీఎస్‌సీ స్థానంలో తెలంగాణకు టీపీఎస్‌సీ ఏర్పాటుపై అధికార వర్గాల్లోనే స్పష్టత లేదు. రవాణా శాఖ రిజిస్ట్రేషన్లు, నంబర్లపై సైతం ఇప్పటికీ ఆ శాఖ అధికార వర్గాల్లో కూడా అయోమయమే నెలకొని ఉంది!
 
 భవనాలు, హెచ్‌ఓడీ కార్యాలయాలు
 
 ఇబ్బంది: భవనాల కేటాయింపునకు సంబంధించి ఇప్పటిదాకా ఎలాంటి ఉత్తర్వులూ వెలువడలేదు. కేవలం లీకులతోనే కాలం గడుపుతున్నారు. సచివాలయంలోని నాలుగు బ్లాకులను తెలంగాణకు, ఐదింటిని సీమాంధ్రకు కేటాయించినట్టు బయటకొచ్చినా.. వాటిపై ఇంకా తుది ఉత్తర్వులు రాలేదు. ఈ బ్లాకుల కేటాయింపు పూర్తయితే తప్ప ఆయా బ్లాకుల్లో ఏ ఫ్లోర్ ఏ శాఖకు కేటాయించాలన్నది సాధారణ పరిపాలన శాఖ నిర్ణయించలేదు. పలు విభాగాల అధిపతుల కార్యాలయాల్లోనూ ఇరు రాష్ట్రాలకు వసతి సౌకర్యాలు ఏ మేరకు ఇవ్వాలన్న దానిపై ఇంకా ఉత్తర్వులు జారీ చేయలేదు.
 
 మంత్రుల నివాసాలు
 
 ఇబ్బంది: దీనిపైనా అధికారులు ఇంకా దృష్టి సారించలేదు. బంజారాహిల్స్, కుందన్‌బాగ్‌లో మంత్రుల నివాసాలున్నాయి. వాటిలో వేటిని ఎవరికివ్వాలి, ఒక రాష్ట్ర మంత్రులకు పూర్తిగా ఒకవైపు ఇవ్వాలా, లేక వారు కోరే విధంగా కేటాయించాలా వంటి పలు అంశాలపై ఇంకా సందిగ్ధమే నెలకొని ఉంది. తనకు కేటాయించిన తెలంగాణ సీఎం క్యాంపు కార్యాలయం వద్దని, దాన్ని కుందన్‌బాగ్‌లో ఏర్పాటు చేయాలని కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. చంద్రబాబు కూడా తనకు క్యాంపు కార్యాలయంగా కేటాయించిన లేక్‌వ్యూ అతిథి గృహం అక్కర్లేదని, ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తానని చెబుతున్నారు. ఆయన కోసం సచివాలయంలో ముస్తాబు చేస్తున్న ‘హెచ్ ’ బ్లాక్ వాస్తుపరంగా బాలేదని ఆయన మనుషులు తాజాగా శనివారం తేల్చారు. ఇప్పుడు కొత్తగా ‘ఎల్’ బ్లాక్‌ను పరిశీలించారు!
 
 ఫైళ్ల డిజిటైజేషన్
 
 ఇబ్బంది: ఈ ప్రక్రియ దాదాపు పూర్తయింది. కానీ ఈ ఫైళ్లను ఎవరికి అప్పగించాలి, ఆ సందర్భంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న మార్గదర్శకాలేవీ ఇవ్వలేదు. సిబ్బందిని కొత్త రాష్ట్రానికి పంపిణీ చేశాక ఈ కంప్యూటర్లను ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది తీసుకెళ్లాలో లేదో కూడా తెలియని పరిస్థితి!
 
 ఉద్యోగుల విభజనపై కసరత్తు మళ్లీ మొదటికి
 
 రాష్ట్ర విభజనలో కీలకాంశమైన ఉద్యోగుల విభజనపై ఇప్పటి వరకూ జరిగిన కసరత్తు మళ్లీ మొదటికి వచ్చింది. ఉద్యోగుల విభజనలో సీనియారిటీ, స్థానికత అంశాలు అసమగ్రంగా ఉన్నాయని తెలంగాణ ఉద్యోగ సంఘాలు అభ్యంతరం చెబుతుండగా.. సీమాంధ్ర ఉద్యోగ సంఘాలు మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా చెబుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్ ఆదివారం ఉదయం 10.30 గంటలకు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి(ఎంసీహెచ్‌ఆర్‌డీ) కేంద్రంలో రెండు ప్రాంతాలకు చెందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఇరు ప్రాంతాలకు చెందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధుల అనుమానాలు, సందేహాలను తెలుసుకుని రమేశ్ నివృత్తి చేయనున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా