ఉద్యోగుల ఆరోగ్యంపై రాజీ ప్రసక్తే లేదు.. ఈనాడు కథనాన్ని ఖండించిన ఏపీఎస్‌ఆర్టీసీ

14 Nov, 2023 18:46 IST|Sakshi

సాక్షి, ఎన్టీఆర్‌: ఆర్టీసీ ఉద్యోగులకు మెరుగైన ఆరోగ్య సదుపాయలు కల్పించే విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని.. ప్రభుత్వ ఉద్యోగులతో ఆర్టీసీ ఉద్యోగుల్ని సమానంగా చూస్తోందని..  పైగా వైద్య సదుపాయాలు అందించే విషయంలో ప్రత్యేక చొరవ కనబరుస్తోందని ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణ సంస్థ చెబుతోంది.  ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్యంతో సర్కార్‌ చెలగాటం పేరిట ఇవాళ ఈనాడులో ప్రచురితమైన కథనాన్ని మంగళవారం ఏపీఎస్‌ఆర్టీసీ ఖండిస్తూ.. పూర్తి వివరాలను తెలియజేసింది. 

‘‘ప్రభుత్వంలో విలీనం తర్వాత ఆర్టీసీ ఉద్యోగులు అనేక సదుపాయాలు పొందుతున్నారు. ఆర్టీసీ ఉద్యోగులందరికీ  ప్రభుత్వ ఉద్యోగులతో పాటుగా హెల్త్‌ కార్డులు జారీ అయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగులకు రిఫర్ చేయబడిన ఆసుపత్రులలోనే ఆర్టీసీ ఉద్యోగులకు కూడా మెరుగైన వైద్యం అందుతోంది. ఈహెచ్ఎస్ ఆసుపత్రుల్లో చికిత్స, ఓపీ విషయంలో సమస్యలు తలెత్తకుండా జిల్లాకొక లైజనింగ్ అధికారిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది కూడా..

.. ఇటీవల కాలంలో ఉద్యోగులకు తలెత్తుతున్న అనారోగ్య సమస్యలపై ప్రభుత్వం  అనేక చర్యలు తీసుకుంటోంది. ఉద్యోగులందరికీ మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తోంది. కార్డియాక్ కేర్ Try-cog మెషీన్ల ద్వారా ఉద్యోగులకు ఏర్పడే హృద్రోగ సమస్యలను ముందుగానే పసిగట్టి వైద్యం అందిస్తున్నాం. అలా ఇప్పటి వరకూ 149 మంది ఆర్టీసీ ఉద్యోగులకు ముందస్తు పరీక్షల ద్వారా ఆరోగ్య భద్రత కల్పించాం’’ అని తెలిపింది. 

వైద్య సేవల విషయానికొస్తే.. 
అనారోగ్యం బారినపడిన ఆర్టీసీ ఉద్యోగులకు వైద్యపరీక్షలు క్రమం తప్పకుండా  నిర్వహిస్తున్నారు. తద్వారా సకాలంలో చికిత్స అందేలా చూస్తున్నారు.  ఆర్టీసీకి సంబంధించిన అన్నిడిస్పెన్సరీలలో నిరంతరం వైద్యం.. ఔషధాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నారు. 2021లో సూపర్ స్పెషాలిటీ సౌకర్యాలతో వైఎస్సార్‌ జిల్లాలో డా.వైఎస్సార్ ఏరియా ఆర్టీసీ ఆసుపత్రి ఏర్పాటైంది. తిరుపతి, నరసరావుపేట, మచిలీపట్నంలో ఉద్యోగుల కోసం శరవేగంగా ఆర్టీసీ ఆస్పత్రుల నిర్మాణాలు జరుగుతున్నాయి.

మరిన్ని వార్తలు