బడా టౌన్‌షిప్

26 Aug, 2014 03:02 IST|Sakshi
బడా టౌన్‌షిప్
  •  ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌కు ఉడా ప్రతిపాదన
  •   అటవీ భూముల్లో భారీ హౌసింగ్ వెంచర్
  •   ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు
  •   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేత
  •   ఉడా చరిత్రలో ఇదే భారీ ప్రాజెక్టు
  • సాక్షి, విజయవాడ : విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(వీజీటీఎం ఉడా) మరో భారీ ప్రాజెక్టుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈసారి సుమారు 1,400 ఎకరాల్లో ఇంటిగ్రేటెట్ టౌన్‌షిప్ ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. రూ.700 కోట్ల అంచనాతో ఈ మెగా హౌసింగ్ వెంచర్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టును తమకు అనుకూలంగా ఉన్న అటవీ భూమిలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తే ఆ భూములను అటవీ శాఖ చట్టం 1980 సెక్షన్(2) కింద కన్వర్షన్ చేయవచ్చని అధికారులు చెబుతున్నారు.
     
    ప్రతిపాదనలు ఇవీ..
     
    మొత్తం 1,400 ఎకరాల భూమిలో 700 ఎకరాల్లో నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. 350 ఎకరాల విస్తీర్ణంలో ఇళ్ల నిర్మాణం, మిగిలిన 350 ఎకరాల్లో పార్కు, బ్యాంకులు, పోలీసుస్టేషన్ తదితర అన్ని కార్యాలయాలకు అనువుగా భవనాలు నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పటివరకు ఉడా సిద్ధం చేసిన ప్రతిపాదనల్లో ఇదే అత్యంత పెద్దది కావడం విశేషం.
     
    రాజధానితో లింకు..!
     
    ఉడా అధికారులు ప్రతి ప్రతిపాదనకు రాష్ట్ర రాజధానితో ముడిపెడుతున్నారు. ఇప్పటికే విజయవాడను తాత్కాలిక రాజధానిగా ప్రకటించిన క్రమంలో అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. శాశ్వత రాజధాని కూడా ఇక్కడే ఏర్పాటయ్యే అవకాశం ఉండటంతో ప్రభుత్వం కూడా ఉడా ప్రతిపాదనలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో తమ ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని ఉడా అధికారులు రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్రాన్ని కూడా కోరుతున్నారు. ఏక కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదనలు పంపుతున్నారు. ఎక్కడి నుంచి నిధులు వచ్చినా తక్షణమే ప్రతిపాదనలను అచరణలోకి పెట్టాలని భావిస్తున్నారు.
     
    ల్యాండ్ బ్యాంక్ కొరత
     
    ఉడాకు మొదటి నుంచి ల్యాండ్ బ్యాంకు కొరత అధికంగా ఉంది. గతంలోనూ అనేక ప్రాజెక్టులు సిద్ధం చేయడంతోపాటు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు కూడా రూపొందించినా భూమి కొరత వల్ల ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ భూములు కేటాయించాలని ఉడా విస్తరించి ఉన్న రెండు జిల్లాల కలెక్టర్లకు అధికారులు విన్నవించినా ప్రయోజనం లేకపోయింది.
     

మరిన్ని వార్తలు