ఏపీ యూత్‌ పవర్‌.. పడిపోయిన బీజేపీ రేటింగ్

5 Feb, 2018 09:25 IST|Sakshi
బీజేపీ ఫేస్‌బుక్‌ పేజీ

కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని రాష్ట్ర యువత, నెట్‌జన్లు సోషల్‌మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. విభజన సమయంలో పార్లమెంట్‌లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం పట్ల తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు తమ ఆవేదన వ్యక్తం చేయడానికి సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. సోషల్‌ మీడియాలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను డిమాండ్‌ చేస్తూ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

తమక ప్రత్యేక హోదా కావాలంటూనే కేంద్ర ప్రభుత్వంపై తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఫేస్‌బుక్‌ పేజీని లక్ష్యంగా చేసుకొని తమ ఆవేదనని నిరసన రూపంలో తెలియచేస్తున్నారు. బీజేపీ ఫేస్‌బుక్‌ పేజీపై రేటింగ్‌ క్యాంపెయిన్‌ నిర్వహిస్తున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని గుర్తించాలంటూ బీజీపీ పేస్‌బుక్‌ పేజీకీ తక్కువ రేటింగ్‌ ఇస్తున్నారు. దీంతో బీజేపీ పేజీలో రేటింగ్‌ ఆప్షన్‌ను డిజేబుల్‌ చేశారు.

దీంతో పేజీ రేటింగ్‌ ఒక్కసారిగా 1.1కి పడిపోయింది. ఈ పేజీకీ దాదాపు 35 వేలకు పైగా 1పాయింట్‌ రేటింగ్‌ ఇచ్చారు. గతంలో 17వేల మందికి పైగా 5స్టార్‌ రేటింగ్‌ ఇచ్చారు. కానీ ఆంధ్రప్రదేశ్‌ యువత కాంపెయిన్‌తో కేవలం రెండు రోజుల్లోనే ఒక్కసారిగా బీజేపీ పేజీ రేటింగ్‌ 1.1కి పడిపోయింది. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రధానికి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అవసరం గురించి తెలిసేలా యువత, నెట్‌జన్లు ట్రెండింగ్‌ క్యాంపెయిన్లు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక హాష్‌ ట్యాగ్‌లను రూపొందించి ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో పోస్టులు పెడుతున్నారు.

మరిన్ని వార్తలు