తహసీల్దార్‌ కార్యాలయాల్లో  దళారీల దందా!

29 Aug, 2018 07:33 IST|Sakshi

ప్రభుత్వ శాఖలన్నింటిలో ఎక్కువ అవినీతి రెవెన్యూ విభాగంలో ఉందని ప్రభుత్వం నిర్వహించిన సర్వేలు తేటతెల్లం చేశాయి. అవినీతి, దళారీ వ్యవస్థను రూపుమాపాలని మీసేవ కేంద్రాలను ఏర్పాటు చేసినా అవినీతి రుచిమరిగిన అధికారులు ఎప్పటికప్పుడు కొత్తదారులు వెతుక్కుంటున్నారు. ఏదైనా ధ్రువ పత్రం కోసం సరైన రికార్డులతో మీసేవలో దరఖాస్తు చేసుకుంటే కొద్ది రోజుల్లో సర్టిఫికెట్‌ వస్తుందని పాలకులు గొప్పలు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం దరఖాస్తుదారులు తహసీల్దార్‌ కార్యాలయంలో చేయి తడిపితే పని వేగంగా పూర్తవుతుంది. లేదంటే దరఖాస్తు తిరస్కరణకు గురవుతుంది. 

కర్నూలు(అగ్రికల్చర్‌): మీసేవ కేంద్రాలు అందుబాటులోకి వచ్చినా ధ్రువ పత్రాల కోసం లబ్ధిదారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఎటవంటి సర్టిఫికెట్‌ కావాలన్నా మీసేవ కేంద్రంలో తగిన పత్రాలు సమర్పించి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయిస్తే నిర్ణీత గడువు తర్వాత మీసేవ కేంద్రం నుంచి సర్టిఫికెట్‌ పొందవచ్చనేది నిబంధన. అయితే ఇది ఎక్కడా అమలు కావడం లేదు. పలువురు తహసీల్దార్లు దళారీలను, ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. విచారణ జరిపి ఇవ్వాల్సిన వాటికి మాత్రం అడిగినంత ఇచ్చుకోక తప్పని  పరిస్థితి.
  
రెవెన్యూలో అడ్డగోలు వసూళ్లు....     
మీసేవ కేంద్రాల్లో రెవెన్యూశాఖకు చెందినవే 70 వరకు సేవలు ఉన్నాయి. మ్యుటేషన్‌ కమ్‌ ప్యామిలి ఈ–పాసు పుస్తకం, ల్యాండ్‌ కన్వర్షన్, ఈబీసీ, ఓబీసీ సర్టిపికెట్లు, వ్యవసాయ ఆదాయపు ధ్రువపత్రం, ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ తదితర వాటి కోసం వీటిల్లో తగిన డాక్యుమెంట్లతో దరఖాస్తు చేయాలి. తహసీల్దారు వాటిపై వీఆర్‌ఓ, ఆర్‌ఐ ద్వారా విచారణ జరిపించి అన్ని సక్రమంగా ఉంటే నిర్ణీత గడువులోపు ఆమోదించి డిజిటల్‌ సిగ్నేచర్‌ ద్వారా సర్టిఫికెట్‌ జారీ చేస్తారు. ఇలా దాదాపు ఏ మండలంలో అమలు కావడం లేదు. మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకుంటే  సర్టిఫికెట్‌ రాదని తహసీల్దార్లే పరోక్షంగా చెబుతున్నారు. మామూళ్లు ముట్టచెప్పకపోవడంతో తిరస్కరణకు గురవుతున్న దరఖాస్తులు అన్ని మండలాల్లో భారీగానే ఉంటున్నాయి.
 
ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ పొందడం గగనమే..  
ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ పొందడం అతి కష్టంగా మారింది. కుటుంబ యజమాని మరణించినపుడు ఆయన భార్యకు వారసత్వ ( ఫ్యామిలీ మెంబర్‌) సర్టిఫికెట్‌ అవసరం. అన్ని డాక్యుమెంట్లతో మీసేవ కేంద్రంలో చేసుకుంటే 15 రోజుల్లో ఆమోదించాలి. ఇందుకు భిన్నంగా అన్ని స్థాయిల వారికి ముడుపులు ఇచ్చుకుంటేనే పని అవుతుంది.   

మ్యుటేషన్‌ కావాలంటే ఇచ్చుకోక తప్పదు... 
భూములు కొనుగోలు చేసినపుడు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిష్టర్‌ చేసిన తర్వాత రెవెన్యూ రికార్డులు, వెబ్‌ల్యాండ్‌లో మార్పులు చేసుకోవాలి. వీటినే మ్యుటేషన్‌గా వ్యవహరిస్తారు. ఇందుకు  మీసేవ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి. తహసీల్దార్‌ కార్యాలయాల్లో ఇచ్చుకున్న వారి మ్యుటేషన్‌లు చేస్తూ మిగిలిన వాటిని తిరస్కరిస్తున్నారనే విమర్శలున్నాయి. మ్యుటేషన్‌ కమ్‌ ఈ–పాసుపుస్తకాలకు 59,500 దరఖాస్తులు మీసేవ కేంద్రాల ద్వారా వచ్చాయి. వీటిని 30 రోజుల్లో పరిష్కరించాల్సి ఉంది. ఇందులో 36,000 దరఖాస్తులను మాత్రమే ఆమోదించారు.13,500  తిరస్కరించారు. ముడుపులు ఇవ్వకపోవడం వల్ల తిరస్కరించినవే ఎక్కువ ఉన్నట్లు సమచారం.

మరిన్ని వార్తలు