కలత చెంది.. కన్నీరు మిగిల్చావా!

20 May, 2017 11:26 IST|Sakshi

► నవ వధువు అనుమానాస్పద మృతి
► సారె తక్కువని అత్తింటివారు రాద్ధాంతం
► కలత చెంది ఆత్మహత్య?


తలపై పెట్టిన జీలకర్ర, బెల్లం గురుతులు చెదిరిపోనేలేదు.. నిండు నూరేళ్లు పిల్లాపాపలతో హాయిగా జీవించాలని పెద్దల ఆశీర్వచనాల అక్షింతలూ అలానే ఉన్నాయి. చేతికి అంటుకున్న పసుపు.. కాలికి పెట్టిన పారాణి వదలనే లేదు. ఆ ఇంట పెళ్లిసందడికి శుభసూచికగా ముందర వేసిన పందిరి ఇంకా పచ్చగానే ఉంది. ఇంతలోనే విషాదం. ఎన్నో ఆశలతో.. భవిష్యత్‌పై కలలతో అత్తారింట అడుగుపెట్టిన నవ వధువు.. పెళ్లి ముచ్చట తీరకముందనే కట్టెగా మారింది. అత్తింటి వారి కట్నం దాహానికి కలత చెందిన ఆ బంగారు తల్లి.. తన నిండు జీవితాన్నే త్యాగం చేసింది.

నరసన్నపేట: ఈ నెల 17వ తేదీన పెళ్లి పీటలెక్కిన వధువు.. ఒక్క రోజైనా గడవక ముందే శుక్రవారం ఉదయం అనుమానాస్పదంగా మృతి చెందింది. ఈ సంఘటన నరసన్నపేట మండలం ముషిడిగట్టు గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ముషిడిగట్టు గ్రామానికి చెందిన రమణ, గన్నెమ్మల కుమార్తె వానపల్లి కుమారి  (24) బీఎస్సీ, బీఈడీ చదివింది. అదే గ్రామానికి చెందిన రాజాపు ఉపేంద్రతో ఈ నెల 17న నరసన్నపేట సీతారామ కల్యాణ మండపంలో ఆమెకు వివాహం చేశారు. వరుడికి లక్ష రూపాయల విలువ కలిగిన సారె, కట్నంగా 50 సెంట్ల భూమి ఇచ్చేందుకు పెళ్లికి ముందు పెద్దమనుషుల మధ్య ఒప్పందం కుదిరింది.

కుమారి తల్లిదండ్రులు నిరుపేదలు. తమ తాహతకు మించినా.. కుమార్తె సంతోషం కోసం అడిగినంత ఇచ్చేందుకు అంగీకరించారు. ఒప్పందం ప్రకారం భూమి ఇచ్చారు. పెళ్లిని ఘనంగా చేశారు. వధువు కుమారి అత్తవారింట్లోనే గురువారం ఉంది.  పెళ్లికి ఇవ్వాల్సిన సారె సామగ్రి ఇచ్చి, కుమార్తెను తమ ఇంటికి తీసుకువెళ్లేందుకు శుక్రవారం ఉదయం కుమారి తల్లిదండ్రులు వరుడు ఇంటికి వచ్చారు. వారికి గడపలోనే చేదు అనుభవం ఎదురైంది. సారె సామగ్రి తక్కువగా తీసుకువచ్చారు.. అవి తేలేదు, ఇవి తేలేదంటూ పెళ్లి కుమారుడు అన్న, వదినలైన మురళి, అనూష ఘర్షణకు దిగారు. ‘వీలున్నంత వరకూ అన్నీ తెచ్చాం. ఇంకా ఇవ్వాల్సినవి ఉంటే కొద్ది రోజుల్లో సమకూర్చుతాం.’ అని వధువు తల్లిదండ్రులు నచ్చజెప్పిందుకే ప్రయత్నించినా ఎవరూ వినలేదు.

ఈ నేపథ్యంలో గొడవ పెరిగింది. దీనిని ఇంట్లో నుంచి గమనిస్తున్న కుమారి ఆందోళనకు గురైంది. కలత చెంది పై అంతస్తుకు వెళ్లిపోయింది. ఉదయం 9 గంటల సమయంలో పెళ్లి కుమార్తె కోసం వరుడు పై అంతస్తుకు వెళ్లాడు. అక్కడ అచేతనంగా పడి ఉన్న కుమారి కనిపించింది. పక్కన పురుగు మందు డబ్బా పడి ఉంది. దీంతో హుటాహుటిన ఆమెను నరసన్నపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పురుగు మందు సేవించి, ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. అయితే, ఆమె శరీరంపై పురుగు మందు పడిన ఆనవాలు ఏమీ కనిపించలేదు. దీంతో మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం తెలుసుకున్న బంధువుల ఆస్పత్రికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు.

నా చెల్లిని చంపేశారు..
తన చెల్లి కుమారి బాగా చదువుకుందని, ఉపాధ్యాయినిగా పిల్లలకు పాఠాలు చెప్పడం అంటే ఆమె ఎంతో ఇష్టమని, అందుకే బీఈడీ చేసిందని మృతురాలి సోదరి హేమలత వాపోయింది. పెళ్లయి రెండు రోజులూ కాలేదని, అంతా సంతోషంగా ఉన్న సమయంలో ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేసింది. అత్తింటి వారే ఆమెను చంపేశారని ఆరోపించింది. ముఖ్యంగా పెళ్లికుమారుడు అన్న మురళి, భార్య అ నూషలే ఇందుకు కారణమని, వారిని కఠినంగా శిక్షించాలని కంటతడి పెట్టి పోలీసులకు విజ్ఞప్తి చేసింది. మృతురాలి తల్లి గన్నెమ్మ, తండ్రి రమణలు కూడా ఇదే విధంగా పెళ్లి కుమారుడు, ఇతర బంధువులపై ఆరోపణలు చేశారు.

సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఐ, ఎస్సై
సమాచారం తెలుసుకున్న నరసన్నపేట సీఐ పైడిపునాయుడు, ఎస్సై ఎన్‌.లక్ష్మణలు ముషిడిగట్టులోని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. వివరాలు సేకరించారు. పెళ్లి కుమారుడితోపాటు, అనుమానితులను అదుపులోకి విచారణ జరుపుతున్నారు.

డీఎస్పీ పరిశీలన
నవవధువు అనుమానాస్పద మృతి సంఘటనపై శ్రీకాకుళం డీఎస్పీ భార్గవరావు నాయుడు శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. పోలీసులు కట్నం వేధింపుల కేసుగా నమోదు చేయడంతో నరసన్నపేట తహసీల్దార్‌ జల్లేపల్లి రామారావు ఆధ్వర్యంలో ఎస్సై ఎన్‌.లక్ష్మణ పంచనామా నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు.

మరిన్ని వార్తలు