ప్రజలు సంతృప్తి చెందేలా పనిచేయండి

21 Sep, 2016 03:45 IST|Sakshi
ప్రజలు సంతృప్తి చెందేలా పనిచేయండి

ఆర్డీఓలు, డీఎస్పీల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
సాక్షి, అమరావతి: ప్రజలంతా ప్రభుత్వం పట్ల సంతృప్తి చెందే విధంగా పరిపాలన సాగించాలని సీఎం చంద్రబాబు ఆర్డీఓలు, డీఎస్పీలకు సూచించారు. వినూత్న ఆలోచనలతో పరిపాలనను ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. విజయవాడలో మంగళవారం సబ్ కలెక్టర్లు, రెవెన్యూ డివిజన్ అధికారులు, డీఎస్పీల సమావేశంలో చంద్రబాబు ప్రసంగించారు. ప్రజలు విజ్ఞానం, ఆరోగ్యం, సంపద, సంతోషం పొందేలా అధికారులు పని చేయాలన్నారు. ఇందుకు అవసరమైన పాలనా పరమైన సంస్కరణలను సూచించాలని కోరారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం నెలకు రూ.10 వేలు సంపాదించేలా ఆర్డీఓలు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ.. పట్టాదారు పాస్ పుస్తకాలను రద్దు చేయలేదన్నారు. వాటిని అవసరమైన వారు ఉపయోగించుకోవచ్చని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ.. పోలీసు అధికారులు శాంతి భద్రతలను పరిరక్షిస్తూ రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని అన్నారు. కాగా, ప్రభుత్వాసుపత్రుల్లో జన్మించే శిశువులకు ఎన్టీఆర్ సురక్ష కిట్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకాన్ని చంద్రబాబు ఆర్డీఓలు, డీఎస్సీల సమావేశంలో ప్రారంభించారు.

మరిన్ని వార్తలు