రైతు ఆత్మహత్యలు ప్రభుత్వానికి పట్టవు

17 Dec, 2018 11:41 IST|Sakshi
వైఎస్సార్‌సీపీలో చేరిన బోయపేట కాలనీవాసులు

పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

వైఎస్సార్‌ భరోసాతో మేలు

పేదల జీవితాల్లో వెలుగులు నింపడానికే నవరత్నాలు

కర్నూలు ,బేతంచెర్ల: దేశానికి అన్నం పెట్టే రైతన్న కరువుతో అల్లాడుతూ.. నష్టాల్లో ఊబి నుంచి బయట పడలేక ఆత్మహత్య చేసుకుంటున్నా.. రాష్ట్ర ప్రభు త్వం పట్టించుకోవడం లేదని పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం వైఎస్సార్‌సీపీ నంద్యాల పార్లమెంట్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి మూర్తుజావలీ, మండల కన్వీనర్‌ సీహెచ్‌ లక్ష్మీరెడ్డి, కాలనీ వాసులు మురళీకృష్ణ, ఆకుల రమణ, రామకృష్ణ ఆధ్వర్యంలో బేతంచెర్లలోని గొల్లపేట, బోయపేట కాలనీల్లో ‘రావాలి జగన్‌.. కావాలి జగన్‌’ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే.. అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. అనంతరం బుగ్గన మాట్లాడుతూ నాల్గున్నరేళ్ల పాలనలో ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన టీడీపీ నాయకులు  ప్రతి పనికీ ఓ రేటు కట్టి దోచుకుతిన్నారని ఆరోపించారు. టీడీపీ నాయకుల దోపిడీని రాష్ట్ర ప్రజ లు గమనిస్తున్నారని, వారికి తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాలను రూపొందించారన్నారు. ప్రజల ఆశీర్వాదంతో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే కులమతాలకతీతంగా సుపరిపాలన అందిస్తామన్నారు. కాలనీల్లో సీసీరోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలని, పింఛన్లు ఇవ్వాలని మహిళలు విన్నవించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని బుగ్గన వారికి హామీ ఇచ్చారు.

వైఎస్సార్‌సీపీలో చేరిక: బోయపేట కాలనీకి చెందిన పుసులూరు మధు, శీను, ఎద్దుల గోపి, సుబ్బరాయు డు, విష్ణు, మనోహర్, బజార్, భూపాల్, లక్ష్మణ్, రఘురాం, మురళీ కృష్ణ తదితరులు బుగ్గన సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా యువకులందరూ కలిసికట్టుగా పార్టీ గెలుపునకు తోడ్పాటు అందించాలని బుగ్గన సూచించారు.

మరిన్ని వార్తలు