సామాజిక సాధికారతకు బాట

7 Nov, 2023 04:25 IST|Sakshi

ప్రజా సంకల్ప పాదయాత్రకు ఆరేళ్లు 

రాష్ట్రంలో సామాజిక సాధికారత సాధించడానికి సరిగ్గా ఆరేళ్ల క్రితం తొలి అడుగు పడింది. ప్రజల కష్టాలు తెలుసుకుని... కన్నీళ్లు తుడిచి... నేనున్నా అంటూ భరోసా ఇచ్చేందుకు వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో ప్రజాసంకల్ప యాత్ర పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టి ఆరేళ్లు పూర్తయ్యాయి. దేశ రాజకీయాల్లోనే ఈ పాదయాత్ర ఓ సంచలనం. 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాలతో రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో జనం విజయం అందించిన తర్వాత, వైఎస్పార్‌సీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు పాలనలో పెద్దపీట వేసింది. సామాజిక న్యాయమంటే నినాదం కాదు విధానమని సీఎం వైఎస్‌ జగన్  చాటి చెబుతున్నారు.


మళ్లీ రాజన్న రాజ్యాన్ని తేవాలన్న సంకల్పంతో వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయలోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సమాధి వద్ద 2017 నవంబర్‌ 6న వేసిన తొలి అడుగు కోట్లాది హృదయాలను స్పృశిస్తూ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో 2019 జనవరి 9న ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 134 శాసనసభ నియోజక వర్గాలు, 231 మండలాలు, 2,516 గ్రామాల మీదుగా 341 రోజులపాటు 3,648 కిలోమీటర్ల మేర ప్రజాసంకల్ప పాదయాత్ర సాగింది. ఈ యాత్రలో 124 చోట్ల సభలు, 55 ఆత్మీయ సమ్మేళనాల్లో వైఎస్‌ జగన్  ప్రసంగించారు. పాదయాత్ర ఆద్యంతం జననేతను నిరుపేద మహిళలు, చేయూతకు నోచుకోని వృద్ధులు, ఉపాధి లేని యువత, రైతులు, రైతు కూలీలు సహా కలుసుకోని వర్గం
అంటూ లేదు. కావాలి జగన్ ... రావాలి జగన్ అంటూ నినదిస్తూ అన్ని వర్గాల ప్రజలు పూలబాట పరచి అపూర్వ స్వాగతం పలికారు. అన్ని వర్గాల ప్రజల సమస్యలు విని, వాటిని పరిష్కరించి... జీవితాల్లో వెలుగులు నింపుతానని జగన్  భరోసా ఇచ్చారు. 

రెండే రెండు పేజీల మేనిఫెస్టో
పాదయాత్రలో కోట్లాది మందితో మమేక మైనప్పుడు వారు తన దృష్టికి తెచ్చిన, తాను గుర్తించిన సమస్యల పరిష్కారమే అజెండాగా కేవలం రెండే రెండు పేజీలతో 2019 ఎన్నికల మేనిఫెస్టోను జగన్  విడుదల చేశారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో 50 శాతం ఓట్లు, 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాల్లో గెలిపించడం ద్వారా వైఎస్సార్‌సీపీకి చారిత్రక విజయాన్ని ప్రజలు అందించారు. జగన్  ముఖ్యమంత్రిగా 2019 మే 30న ప్రమాణస్వీకారం చేసిన మరుక్షణమే మేనిఫెస్టో అమలుకు శ్రీకారం చుట్టడం ద్వారా సామాజిక విప్లవానికి నాంది పలికారు. సామాజిక న్యాయం నినాదం కాదు అమలు చేయాల్సిన విధానామని అధికారం చేపట్టిన రోజే చాటిచెప్పారు. 

సీఎం వైఎస్‌ జగన్  2019 జూన్  8న 25 మందితో ఏర్పాటుచేసిన తొలి మంత్రివర్గం ద్వారా సామాజిక న్యాయాన్ని ఎలా చేయాలో దేశానికి చాటిచెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన 14 మందికి (56 శాతం) మంత్రి వర్గంలో స్థానం కల్పించారు. ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమిస్తే, అందులో నలుగురు (80 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారే. 2022 ఏప్రిల్‌ 11న పునర్‌వ్యవస్థీకరణ ద్వారా ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో మరో అడుగు ముందుకేసి ఆ వర్గాల వారికి ఏకంగా 17 మందికి(70 శాతం) స్థానం కల్పించారు. శాసనసభ స్పీకర్‌గా బీసీ, శాసనమండలి ఛైర్మన్గా తొలిసారిగా ఎస్సీ, వైస్‌ ఛైర్‌పర్సన్ గా తొలి సారిగా మైనార్టీ మహిళను నియమించారు.

దేశ చరిత్రలో తొలిసారిగా హోంశాఖ మంత్రిగా ఎస్సీ మహిళను నియమించారు. వైఎస్సార్‌సీపీకి ఎనిమిది రాజ్యసభ స్థానాలు దక్కితే అందులో నాలుగు ఆ వర్గాలకే ఇచ్చారు. ఎమ్మెల్సీ పదవుల్లో 68 శాతం(29 మంది) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికే అవకాశం ఇచ్చారు. స్థానిక సంస్థల్లోనూ అదే ప్రాధాన్యం ఇచ్చారు. దేశ చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో నామినేటెడ్‌ పదవులు, పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, మహిళలకు రిజర్వేషన్‌  కల్పిస్తూ చట్టం చేసి మరీ ఆ వర్గాలకు పదవులు ఇచ్చి పరిపాలనలో భాగస్వామ్యం కల్పించడం ద్వారా రాజకీయ సాధికారతకు బాటలు వేశారు. సామాజిక న్యాయం నినాదంతో అధికారంలోకి వచ్చిన మాయవతి వంటి వారు కూడా ఈ స్థాయిలో ఆ వర్గాలకు పరిపాలనలో భాగస్వామ్యం ఇచ్చిన దాఖలాలు లేవు.

సామాజిక న్యాయాన్ని దేశానికి చాటిన నేత
మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 95 శాతం అమలు చేసిన సీఎం వైఎస్‌ జగన్ ... ఇప్పటికి 99 శాతం అమలు చేశారు. దేశ చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో నవ రత్నాల్లోని సంక్షేమ పథకాల ద్వారా పేదల ఖాతాల్లోకి రూ. 2.40 లక్షల కోట్లను డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) ద్వారా జమా చేశారు.

ఇందులో 75 శాతం నిధులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే చేరాయి. దీని ద్వారా ఆ వర్గాల ప్రజలు పేదరికం నుంచి గట్టెక్కి, ఆర్థిక సాధికారత సాధించడానికి బాటలు వేశారు. నాన్  డీబీటీ రూపంలో మరో రూ.1.67 లక్షల కోట్ల మేర లబ్ధి చేకూర్చారు. సుమారు 30 లక్షల మందికిపైగా ఇంటి స్థలాలను ఇచ్చి, పక్కా గృహాలను నిర్మిస్తూ పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నారు.

ప్రభుత్వ పాఠశాలలను నాడు–నేడు ద్వారా కార్పొరేట్‌ స్కూళ్ల స్థాయికి అభివృద్ధి చేసి... ఇంగ్లీషు మీడియం భోదనను ప్రవేశపెట్టి... అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన వంటి పథకాల ద్వారా నాణ్యమైన విద్యను అందిస్తూ ఆ వర్గాలు విద్యా సాధికారత సాధించడానికి బాటలు వేశారు. ఆసరా, చేయూత వంటి పథకాల ద్వారా ఆర్థికంగా ఊతమిచ్చి, పరిపాలనలో భాగస్వామ్యం కల్పించడం ద్వారా మహిళా సాధికారతకు మార్గం సుగమం చేశారు. దేశానికి స్వతంత్రం వచ్చిననాటి నుంచి ఇప్పటి దాకా రాష్ట్రంలో 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తే, అందులో గత 53 నెలల్లో భర్తీ చేసినవే 2.07 లక్షలు.

సామాజిక సాధికారత సాధించడానికి బాటలు వేసిన సీఎం వైఎస్‌ జగన్కు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతోపాటు అగ్రవర్ణ పేదల్లోనూ నానాటికీ ఆదరణ పెరుగుతోంది. రాష్ట్రంలో 2019 ఎన్నికల తర్వాత జరిగిన గ్రామ పంచాయతీ,మండల పరిషత్, జిల్లా పరిషత్, పురపాలక, నగరపాలక వంటి స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు తిరుపతి లోక్‌సభ... బద్వేలు, ఆత్మకూరు శాసన సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు రికార్డు మెజారిటీతో విజయం సాధించడమే అందుకు నిదర్శనం. గత 53 నెలలుగా జగన్‌ చేసిన మేలును వివరించడానికి అక్టోబర్‌ 26 నుంచి వైఎస్సార్‌సీపీ ప్రారంభించిన సామాజిక సాధికార యాత్రకు అన్ని వర్గాల పేదలు బ్రహ్మరథం పడుతూ, 2024 ఎన్నికల్లోనూ సామాజిక న్యాయ నిర్మాత జగనే కావాలి జగనే రావాలి అంటూ ఒక్కటై నినదిస్తున్నారు.
– రామగోపాల్‌ ఆలమూరు‘సాక్షి’ స్పెషల్‌ కరెస్పాండెంట్‌

మరిన్ని వార్తలు