క్యాపిటల్‌ గెయిన్స్ ట్యాక్స్‌ నుంచి ఏపీ రాజధాని రైతులకు మినహాయింపు

2 Feb, 2017 02:47 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ రాజధాని నిర్మాణానికి భూ సమీకరణ పథకం కింద భూములిచ్చిన రైతులకు పరిహారం కింద సీఆర్‌డీఏ ఇచ్చే స్థలాలను (ప్లాట్లను) విక్రయించగా వచ్చే సొమ్ముకు క్యాపిటల్‌ గెయిన్స్  (మూలధన) పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు కేంద్రం బుధవారం ప్రకటించింది. 2014 జూన్  2నాటికి భూములు కలిగి ఉన్నవారికే ఈ ప్రయోజనం వర్తిస్తుందని స్పష్టం చేసింది. అయితే దీనితో రైతులకు పెద్దగా ఒరిగేదేమీ ఉండదని ఆదాయ పన్ను నిపుణులంటున్నారు. దీనివల్ల రాష్ట్రానికి భారీ ప్రయోజనమంటూ టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి సాగు భూముల అమ్మకపు మొత్తానికి క్యాపిటల్‌ గెయిన్స్   పన్నుండదు. వాటిని ఇళ్ల స్థలాలుగా మార్చి విక్రయించడం వల్ల ఇప్పుడు పన్ను పడుతోంది. ప్రభుత్వ అవసరాల కోసం భూమి ఇచ్చినందున కేంద్రం మినహాయింపు ఇచ్చినా, దీనివల్ల రైతులకు లాభముండదు. ఎందుకంటే వారు ఎకరా భూమిని ల్యాండ్‌ పూలింగ్‌ కింద ఇస్తే సీఆర్‌డీఏ 800–1,450 గజాల చొప్పున ప్లాట్లిచ్చింది. ఇప్పుడు ఎకరా భూమిని అమ్మితే వచ్చే ఆదాయం కంటే సీఆర్‌డీఏ ఇచ్చిన ప్లాట్లు విక్రయిస్తే ఎక్కువేమీ రాదు.

మరిన్ని వార్తలు