వీహెచ్పై కేసు నమోదు చేయాలి: చెవిరెడ్డి

18 Aug, 2013 10:14 IST|Sakshi

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పవిత్రతకు భంగం వాటిల్లేలా రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ప్రవర్తించారని వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆరోపించారు. ఆయనపై టీటీడీ నిబంధన ఉల్లంఘన కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని చెవిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.తిరుమలలో ఎలాంటి రాజకీయ ప్రస్థావన తీసుకురాకూడదనే నిబంధన ఉందని చెవిరెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు.

రాజ్యసభ సభ్యుడు వి.హనుమంత రావు శనివారం శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చారు. దైవ దర్శనం అనంతరం ఆయన తిరుమలలో మాట్లాడుతూ... తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీమాంధ్ర ఉద్యోగులు తమ స్వస్థలాలకు వెళ్లిపోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. దీంతో ఆగ్రహాం చెందిన సమైక్యవాదులు ఆలిపిరి వద్ద వి.హనుమంతరావు వాహనాన్ని అడ్డుకుని, పెద్దపెట్టున నినాదాలు చేశారు.

దాంతో పోలీసులు రంగప్రవేశం చేసి సమైక్యవాదుల ప్రయత్నాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అ క్రమంలో పోలీసులకు, సమైక్యవాదుల మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు ఆగ్రహాం వ్యక్తం చేస్తూ లాఠీచార్జీ చేయడంతో సమైక్యవాదులకు స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘటనతో కోపోద్రుక్తులైన సమైక్యవాదులు ఆదివారం సీమాంధ్ర బంద్కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు