'సింహాలను తరలిస్తాం, ఏడు కోట్లు ఇవ్వండి'

18 Aug, 2013 09:55 IST|Sakshi
'సింహాలను తరలిస్తాం, ఏడు కోట్లు ఇవ్వండి'
ఆసియా ఖండానికి చెందిన జాతి సింహాలను తరలించేందుకు ఏడు కోట్ల రూపాయల సహాయాన్ని అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మధ్య ప్రదేశ్ ప్రభుత్వం కోరింది. గుజరాత్ నుంచి మధ్య ప్రదేశ్ లో గ్వాలియర్ డివిజన్ లోని షియోపూర్ జిల్లాలోని పాల్పర్ కునో వన్యప్రాణ సంరక్షణ కేంద్రానికి తరలించాలని ఏప్రిల్ 15 తేదిన సుప్రీం కోర్టు ఆదేశాలు జారీచేసింది. జాతి సింహాలు అంతరించే ప్రమాదం ఉందనే భయాందోళనలు తలెత్తడంతో వేరే ప్రాంతానికి తరలించాలని నిర్ణయం తీసుకున్నారు. 
 
దాంతో గుజరాత్ నుంచి మధ్యప్రదేశ్ కు  సింహాలను తరలించాలని సుప్రీం కోర్టు తీసుకున్న తుది నిర్ణయానికి అనుగుణంగా కేంద్ర పర్యావరణ, అడవుల శాఖ ఆదేశాల్ని జారీ చేసింది. సింహాల తరలింపుకు సుప్రీం ఆరునెలల గడువు విధించిందని, అయితే ఈ కార్యక్రమం చాలా రిస్క్ తో కూడిన పని అని.. ఆరునెలల గడువు చాలా తక్కువ అని..గడువు పొడిగించాలని పర్యావరణ శాఖను అధికారులు కోరారు. ఇప్పటికే నాలుగు నెలల కాలం ముగిసిందని.. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదన్నారు. 
 
సింహాల సంరక్షణతోపాటు మౌళిక సదుపాయాలు, ఇతర పనుల కోసం ఏడు కోట్ల 37 లక్షల రూపాయలను కేంద్రాన్ని కోరామని అధికారులు తెలిపారు. సింహాల తరలింపు కార్యక్రమం కోసం సంబంధింత కేంద్ర మంత్రిత్వ శాఖకు, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడికి లేఖ రాయనున్నట్టు అధికారి తెలిపారు. పులుల సంరక్షణ కేంద్రంలో టూరిజంను ఆపివేయాలని పర్యావరణ కార్యకర్త ఒకరు ఇటీవల సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 
మరిన్ని వార్తలు