రైతు దినోత్సవానికి సన్నాహాలు

5 Jul, 2019 14:24 IST|Sakshi

జమ్మలమడుగు సభకు హాజరు కానున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

వైఎస్సార్‌ పింఛన్‌ పథకాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి 

రైతన్నల సంక్షేమంపై కీలక నిర్ణయాలను ప్రకటించే అవకాశం 

సాక్షి, అమరావతి: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఈ నెల 8 తేదీన(సోమవారం) రాష్ట్రవ్యాప్తంగా రైతు దినోత్సవాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. రైతు సాధికారత కోసం కృషి చేసిన వైఎస్సార్‌ సేవలకు గుర్తింపుగా ఆయన జయంతిని రాష్ట్ర రైతు దినోత్సవంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. రైతు దినోత్సవ సందర్భంగా అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు జరుగనున్నాయి. నియోజకవర్గానికి లక్ష రూపాయలు విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే రైతు దినోత్సవం నిర్వహణకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.

వైఎస్సార్‌ పింఛన్‌ పథకానికి శ్రీకారం 
రైతు దినోత్సవం సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయలో వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం జమ్మలమడుగులో రైతు దినోత్సవ సభలో పాల్గొంటారు. వైఎస్సార్‌ పింఛన్‌ పథకాన్ని ఈ వేదిక నుంచే ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అలాగే మరికొన్ని సంక్షేమ పథకాలను కూడా ఇక్కడి నుంచే ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే ఈ సభలో రైతన్నల సంక్షేమానికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలను ప్రకటించే అవకాశం ఉంది. అన్నదాతల సంక్షేమం కోసం వైఎస్‌ జగన్‌ ఇప్పటికే వైఎస్సార్‌ రైతు భరోసా పథకాన్ని ప్రకటించారు.

పెట్టుబడి సాయం కింద ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ.12,500 చొప్పున అందించనున్నారు. వాస్తవానికి ఈ కార్యక్రమం వచ్చే ఏడాది ఖరీఫ్‌ నుంచి ప్రారంభం కావాల్సి ఉన్నా రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది అక్టోబర్‌లో మొదలయ్యే రబీ నుంచే ప్రారంభిస్తున్నారు. ఉచిత బోర్ల పథకాన్ని, ఉచిత పంటల బీమా, పెట్టుబడి సాయాన్ని (ఇన్‌పుట్‌ సబ్సిడీ) కూడా అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే వైఎస్సార్‌ జిల్లా పులివెందులలో అరటి పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో ఈ మేరకు హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకోబోతున్నారు. 

సభావేదిక ప్రాంతం ఖరారు 
జమ్మలమడుగులో నిర్వహించబోయే రైతు దినోత్సవ సభావేదిక ప్రాంతాన్ని ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, కలెక్టర్‌ హరికిరణ్‌ గురువారం పరిశీలించారు. ముందుగా ముద్దనూరు రోడ్డులో ఉన్న పతంగే రామన్నరావు క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించారు. అయితే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో జమ్మలమడుగు పట్టణానికి మొదటిసారిగా వస్తుండటంతో ఈ సభకు వేలాది మంది ప్రజలు తరలివచ్చే అవకాశం ఉందని, అందువల్ల ఈ ప్రాంగణం సరిపోదని స్థానిక నాయకులు సూచించారు. దీంతో ముద్దనూరు రోడ్డులోని రోజా టవర్స్‌ వెనుక వైపు ఉన్న ఖాళీ ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ ప్రాంతం అందరికీ ఆమోద యోగ్యం కావడంతో అక్కడే ముఖ్యమంత్రి సభావేదికను ఖరారు చేశారు. హెలిప్యాడ్‌ కోసం సభావేదిక ప్రాంతం ఎదురుగా ఉన్న ఖాళీ ప్రాంతాన్ని పరిశీలించారు.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా