ప్రజల సొమ్ము సమీక్షల పాలు

4 Nov, 2015 23:20 IST|Sakshi
ప్రజల సొమ్ము సమీక్షల పాలు

గంటా కుమారుని వివాహ రిసెప్షన్‌కు తరలివచ్చిన ప్రముఖులు
సర్కారు సొమ్ముతో మంత్రులు, ఉన్నతాధికారుల పర్యటన
విభాగాల వారీగా సమీక్షలు, సమావేశాలు
ఉక్కిరిబిక్కిరైన ఉద్యోగులు, పోలీసులు

 
ఇన్నాళ్లూ తమ శాఖలను కనీసం కన్నెత్తి చూడనివారు నగరంపై వరదలా విరుచుకుపడ్డారు. సమీక్షలు నిర్వహించారు. స్థానిక అధికారులపై చిందులేశారు. ‘పెళ్లి కొచ్చాడు.. భోజనం చేసి వెళ్లిపోతాడులే అనుకున్నారా’ అని భుజాలు తడుముకుంటూ మరోపక్క మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. ఇంతమంది మంత్రులు, ఉన్నతాధికారుల తాకిడి ఒకేరోజు నగరాన్ని చుట్టుముట్టడంతో స్థానిక అధికారులు, పోలీసులు ఉక్కిరిబిక్కిరయ్యారు. గంటా వారి ఇంట పెళ్లి సందడికి హాజరైన పెద్దల హడావుడి ఇది. ఒక్క రోజు సమీక్షలకే స్టార్ హోటళ్లు, గెస్ట్ హౌస్‌లకు రూ.లక్షలు ఖర్చయ్యాయి.
 
విశాఖపట్నం: రాష్ర్ట మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడు రవితేజ వివాహ రిసెప్షన్ బుధవారం రాత్రి వైభవంగా జరి గింది. ప్రముఖులంతా హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అంతవరకు ఎవరికీ అభ్యంతరం లేకపోయినా.. రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు సమీక్షలు నిర్వహించేందుకు పోటీ పడటమే ప్రహసనంగా మారింది. దీంతో జిల్లా అధికారులకు ఊపిరాడలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వారి వెంట పరుగులు దీశారు. ఒక్క రోజే సమీక్షల పేరుతో స్టార్ హోటళ్లకు రూ.లక్షలు ఖర్చు చేశారు. ఇప్పటి వరకూ చేసిన ఖర్చులకు సంబంధించిన బిల్లులే ప్రభుత్వం క్లియర్ చేయలేదు, తాజా ఖర్చుతో ఆయా శాఖలకు దిగులుపట్టుకుంది. మామూ లు రోజుల్లో అయితే ప్రభుత్వ అతిధి గృహాల్లోనో, కార్యలయాల్లోనో సమావేశాలు నిర్వహించి ఖర్చు తగ్గించుకునేవారు. మరోవైపు ఇంతమంది వీవీఐపీ లు ఒకేసారి నగరానికి రావడం, వారు నగరమంతా కలియతిరగడంతో పోలీ సులకు ముచ్చెమటలు పట్టాయి. ప్ర ముఖులకు రక్షణగా వందలాదిమంది పోలీసు అధికారులు, సిబ్బంది క్షణం తీరిక లేకుండా కాపలా కాశారు. ఎలాగూ వస్తున్నాం కదా అని తమ శాఖకు చెందిన అధికారులతో సమీక్షలు జరిపారు. రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, అయ్యన్న పాత్రుడు, కామినేని శ్రీనివాస్, సిద్ధా రాఘవరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, పరిటాల సునీ త, పీతల సుజాత, కొల్లు రవీంద్రలు తమ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. సునీత నగరంలోని రేషన్ డిపోలు, వాణిజ్య దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు చేశారు. శాసనసభ ఎస్యూరెన్స్ కమిటీ చైర్మన్ చెంగళరాయుడు ‘వుడా’లో సమీక్ష జరిపారు. ప్రజా ప్రతినిధులే కాదు ఉన్నతాధికారులు సైతం సమీక్షలతో బిజీబిజీగా గడిపారు. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూపై చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు చర్చించారు. ప్రధానమంత్రి మోదీతో కూడా విశాఖ నుంచే వీడియో కాన్ఫరెన్స్‌లో కృష్ణారావు పాల్గొన్నారు. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్‌పీ సిసోడియా, ఆ శాఖ కమిషనర్ సంధ్యారాణి, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి బి.రామాంజనేయులు, కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ బి.శ్యామలరావు, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాలరెడ్డి, వివిధ విశ్వ విద్యాలయాల ఉపకులపతులు తమ తమ శాఖల పనితీరును సమీక్షించారు.
 
 

మరిన్ని వార్తలు