రాయితీలపై బండరాయి!

28 Jun, 2018 02:35 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కేంద్ర సంస్థలకు రాయితీలపై రాష్ట్ర ప్రభుత్వం మొండిచెయ్యి

కడప స్టీల్‌ ప్లాంట్‌కూ అంతేనన్న మంత్రి లోకేష్‌ 

బయ్యారం స్టీల్‌ ప్లాంట్‌ కోసం సగం ఖర్చు భరించేందుకూ వెనకాడబోమన్న తెలంగాణ

ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రాని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు

ఆగిన పెట్రోకెమికల్‌ కారిడార్, గెయిల్‌–ఓఎన్‌జీసీ కాంకర్‌ యూనిట్లు

ప్రైవేట్‌ సంస్థలకు మాత్రం భారీగా రాయితీలు ప్రకటిస్తున్న ఏపీ సర్కార్‌

‘కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు రాయితీలు ఇచ్చే ప్రశ్నే లేదు. స్టీలు ప్లాంటు కోసం రాయితీలు కేంద్రానికి ఎందుకివ్వాలి?      
– మీడియాతో ఇష్టాగోష్టిలో మంత్రి లోకేష్‌

‘బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు అన్ని రకాల రాయితీలు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అవసరమైతే సగం ఖర్చు భరిస్తాం. అక్కడ ప్లాంట్‌ ఏర్పాటు వల్ల ఖమ్మం జిల్లా పరిధిలోని గిరిజనులకు 15 వేల ఉద్యోగాలు కల్పించగలుగుతాం. ప్రైవేట్‌ సంస్థలకే అనేక రాయితీలిస్తున్నాం. అలాంటిది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామంటే అవసరమైనవన్నీ సమకూరుస్తాం’
– ప్రధానితో భేటీ అనంతరం తెలంగాణ మంత్రి కేటీఆర్‌

చూశారుగా.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థను రప్పించేందుకు పొరుగు రాష్ట్రం ఎంత సన్నద్ధంగా ఉందో! ఇబ్బడి ముబ్బడిగా ఉపాధి అవకాశాలతోపాటు అభివృద్ధి దిశగా రాష్ట్రం పరుగులు తీసే అవకాశాన్ని ఎవరు మాత్రం కాలదన్నుకుంటారు?.. ఒక్క టీడీపీ సర్కారు మినహా! తాజాగా స్టీల్‌ ప్లాంట్‌ నెలకొల్పే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు రాయితీలు కల్పించబోమంటూ మంత్రి నారా లోకేష్‌ ప్రకటించడం పట్ల పారిశ్రామికవర్గాల్లో, ప్రజల్లో తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఏపీకి రావాల్సిన కేంద్ర సంస్థలను పట్టించుకోకుండా పెట్టుబడుల భాగస్వామ్య సదస్సులు, పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తామంటూ దావోస్‌ తదితర చోట్లకు విదేశీ పర్యటనలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనాన్ని వృథా చేస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సాక్షి, అమరావతి: కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై అధికార టీడీపీ అసలు బండారం బయటపడింది. నాలుగేళ్లు కేంద్రంలో అధికారం పంచుకుని కూడా ఉక్కు కర్మాగారాన్ని సాధించకుండా ఇప్పుడు నిరాహార దీక్షల పేరుతో టీడీపీ ఆడుతున్న నాటకాలు కేంద్ర ప్రభుత్వం చేసిన తాజా ప్రకటనతో తేటతెల్లమయ్యాయి. కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయడానికి కేంద్రం సిద్థంగా ఉందని, కానీ ఈ ప్రాజెక్టుకు ఇచ్చే రాయితీల విషయంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడమే జాప్యానికి అసలు కారణమని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేంద్రసింగ్‌ బుధవారం ఢిల్లీలో తనను కలసిన టీడీపీ ఎంపీలకు స్పష్టం చేయడం గమనార్హం. దీన్నిబట్టి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు ఇచ్చే రాయితీలపై రాష్ట్ర ప్రభుత్వం తేల్చకపోవడమే కడప ఉక్కు కర్మాగారంపై ఆలస్యానికి కారణమని తేలిపోతోంది. మరోవైపు మంత్రి నారా లోకేష్‌ మంగళవారం చేసిన ప్రకటన కూడా ఇదే విషయాన్ని రుజువు చేస్తోంది. కడప ఉక్కు యూనిట్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి రాయితీలు ఇవ్వదని, మొత్తం ఖర్చంతా కేంద్రమే భరించాల్సి ఉంటుందని లోకేష్‌ ప్రకటించారు. దీనికి భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం మాత్రం బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు అయ్యే ఖర్చులో సగం భరించడానికి ముందుకు రావడం గమనార్హం. బుధవారం ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ సందర్భంగా 15,000 మంది గిరిజన కుటుంబాలకు ఉపాధి కల్పించే బయ్యారం ఫ్యాక్టరీకి అయ్యే ఖర్చులో అవసరమైతే సగం భరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ విలేకరులకు వెల్లడించారు. 

వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉండగా...
2009లో దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉండగా బీహెచ్‌ఈఎల్‌– ఎన్‌టీపీసీ యూనిట్‌ను రాష్ట్రంలో నెలకొల్పేందుకు భారీగా రాయితీలు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. చిత్తూరు జిల్లా మన్నవరంలో ఎన్‌టీపీసీ–బీహెచ్‌ఈఎల్‌ యూనిట్‌ ఏర్పాటుకు ఎకరం రూ.100 నామమాత్రపు ధరతో 750 ఎకరాలతో పాటు అనేక రాయితీలను వైఎస్‌ కల్పించారు. నాడు ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో శంకుస్థాపన చేయించడమే కాకుండా పనులు కూడా ప్రారంభించారు. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ సర్కారు దీన్ని పట్టించుకోకపోవడంతో ఈ ప్రాజెక్టు వేరే రాష్ట్రానికి తరలిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వెనుకబడిన రాయలసీమ ప్రజల జీవితాన్ని మార్చే కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటు విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోంది. కనీసం యూనిట్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం భూమి ఎక్కడ కేటాయిస్తుంది? కరెంట్, నీటి సరఫరా లాంటి కీలక అంశాలను కూడా వెల్లడించకుంటే ఫీజిబిలిటీ నివేదిక ఎలా ఇస్తామని మెకాన్‌ సంస్థ ప్రశ్నిస్తోంది.

రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు సిద్ధమైనా
ఆంధ్రప్రదేశ్‌లో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని చమురు రంగ సంస్థలు పలు ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాయి. కానీ ప్రాజెక్టులు ఏర్పాటు కావడానికి అవసరమైన వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో లక్షలాది మందికి ఉపాధి కల్పించే ఈ ప్రాజెక్టులు ఆగిపోయాయి. ఇదే విషయాన్ని చమురు రంగ సంస్థల ప్రతినిధులు అనేకసార్లు స్పష్టం చేశారు. ఓఎన్‌జీసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, గెయిల్‌ వంటి సంస్థలు ఏకంగా రాష్ట్రంలో రూ.రెండు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు చేసుకున్నాయి. వైజాగ్‌–కాకినాడ పెట్రో కెమికల్‌ కారిడార్‌ ఏర్పాటు అయితే సుమారు రూ.3.50 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేశారు. ఇందులో ఒక్క హెచ్‌పీసీఎల్‌ రూ.55,000 కోట్లతో గ్రీన్‌ఫీల్డ్‌ రిఫైనరీ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. హెచ్‌పీసీఎల్, గెయిల్‌తో కలిసి కాకినాడలో మరో రూ.40,000 కోట్లతో క్రాకర్‌ యూనిట్‌ ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. 

ప్రైవేట్‌కు పెద్దపీట..
పూర్తిగా వ్యాపార ప్రయోజనాల కోసం పనిచేసే ప్రైవేట్‌ సంస్థలకు రాయితీలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తుండటం గమనార్హం. అనంతపురం జిల్లాలో కియా మోటార్స్‌కు ఉచితంగా భూములు కేటాయించడమే కాకుండా పలు రాయితీలను ప్రకటించింది. రాజధానిలోని మల్లవరం వద్ద అశోక్‌ లేలాండ్‌కు, ఎమ్మెల్యే బాలకృష్ణ బంధువు ఎంవీవీఎస్‌ మూర్తి కుటుంబానికి చెందిన వీబీసీ పెట్రో కెమికల్స్‌కు జగ్గయ్యపేటలో, నాచు కార్పొరేషన్‌కు కర్నూలు జిల్లాలో ప్రభుత్వం భూములు కేటాయించింది. విశాఖ నడిబొడ్డున దుబాయ్‌కి చెందిన లూలూ గ్రూపు వాణిజ్య భవన సముదాయం నిర్మాణానికి తక్కువ ధరకు భూములు కేటాయించడమే కాకుండా రూ.వేల కోట్లలో ప్రయోజనం కల్పించింది. ప్రైవేట్‌ సంస్థలకు రాయితీలు కల్పిస్తే కమీషన్లు దండుకోవచ్చని, అదే కేంద్ర సంస్థలకు రాయితీలు ఇస్తే కమీషన్లు ఉండవనే ఉద్దేశంతోనే వీటిని పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

ప్రైవేట్‌కు కారుచౌకగా భూములు
రాజధాని అమరావతిలో కూడా కేంద్ర సంస్థలకు భూములను రూ.కోట్ల ధరకు కేటాయిస్తూ ప్రైవేట్‌ సంస్థలకు మాత్రం చౌకగా రూ.లక్షల ధరకు అప్పగించడాన్ని తప్పుపడుతున్నారు. ఎస్‌బీఐ, సిండికేట్‌ బ్యాంక్, ఎల్‌ఐసీ వంటి సంస్థలకు ఎకరం స్థలాన్ని రూ.4 కోట్ల ధరతో కేటాయిస్తే ఆర్‌బీఐ, నేవీ సంస్థలకు ఎకరం కోటి రూపాయలకు కేటాయించారు. మరోవైపు ప్రైవేట్‌ విద్య, వైద్య సంస్థలకు ఎకరం స్థలాన్ని రూ.10 లక్షలకే ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

రాయితీలపై స్పష్టత ఇవ్వాల్సింది ఏపీనే
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్‌ జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు సంబంధించిన రాయితీల విషయంలో ఏపీ ప్రభుత్వం నుంచే ఇంకా స్పష్టత రావాల్సి ఉందని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్‌ స్పష్టం చేశారు. ప్లాంట్‌ ఏర్పాటుపై టీడీపీ ఎంపీలు కొణకళ్ల నారాయణ, మాగంటి బాబు, దివాకర్‌రెడ్డి, రవీంద్రబాబు, మాల్యాద్రి శ్రీరామ్, మురళీమోహన్‌ తదితరులు బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని ఆయన కార్యాలయంలో కలసి చర్చించారు. అనంతరం కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. కడప స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు భూమి, ముడిసరుకు సరఫరా (లింకేజ్‌)పై కూడా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి స్పష్టత ఇవ్వాల్సి ఉందన్నారు. ప్రభుత్వం ఈ వివరాలు ఇవ్వగానే మెకాన్‌ సంస్థ అధ్యయనం అనంతరం ప్లాంట్‌ ఏర్పాటుకు నిర్దిష్ట కాలపరిమితిని వెల్లడించగలుగుతామని స్పష్టం చేశారు. 

గడువు చెప్పమంటే ఎలా!
కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతుండగా టీడీపీ ఎంపీలు మధ్యలో కలుగజేసుకొని అసలు ఎప్పట్లోగా స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తారో నిర్దిష్ట గడువును చెప్పాలని కోరారు. దీనిపై కేంద్ర మంత్రి స్పందిస్తూ అసలు రాయితీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్పష్టత ఇవ్వకుండానే ప్లాంట్‌ ఏర్పాటుకు నిర్దిష్ట గడువు చెప్పమంటే ఎలా! అంటూ అసహనం వ్యక్తం చేశారు.  కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై పార్టీ ఎంపీలు, నేతలతో సీఎం చంద్రబాబు బుధవారం టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

మరిన్ని వార్తలు