దసరా నాటికి ‘రంగనాయక’కు గోదావరి నీళ్లు

28 Jun, 2018 02:32 IST|Sakshi

నీటిపారుదల మంత్రి హరీశ్‌రావురిజర్వాయర్‌ పనుల పరిశీలన

సాక్షి, సిద్దిపేట: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించే రంగనాయక సాగర్‌ రిజర్వాయర్‌కు వచ్చే దసరా నాటికి గోదావరి జలాలు చేరుతాయని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. బుధవారం ఆయన సిద్దిపేట జిల్లాలోని చంద్లాపూర్‌లో నిర్మిస్తున్న రంగనాయక సాగర్‌ రిజర్వాయర్‌ పనులను పరిశీలించారు. టన్నెల్, సర్జ్‌ఫుల్‌ సంప్‌ పనులపై ఇంజనీర్లు, కార్మికులను అడిగి తెలుసుకున్నారు. రిజర్వాయర్‌ కట్ట సుందరీకరణకు చేపట్టాల్సిన చర్యలపై కాంట్రాక్టర్లతో మాట్లాడారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇక్కడి ప్రజలు గోదావరి జలాల కోసం ఎదురు చూస్తున్నారని, వారి చిరకాల వాంఛ దసరా నాటికి తీరుతుందని చెప్పారు. మూడు టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్‌లో ఈ ఏడాది 1.5 టీఎంసీల నీటిని నింపుతామన్నారు. రిజర్వాయర్‌లో నీరు చేరితే కాల్వల ద్వారా రైతుల పొలాలకు నీరు రావడంతో పాటు ఈ ప్రాంతంలో భూగర్భ జలాలకు ఢోకా ఉండదన్నారు.

రిజర్వాయర్‌ నిర్మాణం తర్వాత ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందన్నారు. అదేవిధంగా మత్స్య సంపదతో ఇక్కడ మత్స్యకారులకు సంవత్సరం పొడవునా ఉపాధి దొరుకుతుందని హరీశ్‌రావు పేర్కొన్నారు. మంత్రి వెంట టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాధాకిషన్‌ శర్మ, సిద్దిపేట మున్సిపల్‌ చైర్మన్‌ కడవరుగు రాజనర్సు, సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, డైరెక్టర్‌ మచ్చా వేణుగోపాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.


 

మరిన్ని వార్తలు