ఇరు రాష్ట్రాల్లో ధ్రువపత్రాల పరిశీలన

5 Aug, 2014 02:06 IST|Sakshi
ఇరు రాష్ట్రాల్లో ధ్రువపత్రాల పరిశీలన

* 7 నుంచి 23 వరకూ నిర్వహిస్తాం: ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్

సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం గురువారం (7వ తేదీ) నుంచి విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన చేపడతామని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి చైర్మన్ వేణుగోపాలరెడ్డి తెలిపారు. ప్రవేశాల కౌన్సెలింగ్‌ను 31 నాటికి పూర్తి చేసి, వచ్చే నెల మొదటి వారంలో తరగతులు ప్రారంభించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో.. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ముందుకు సాగుతామని చెప్పారు.

ఈ నెల 7 నుంచి 23వ తేదీ వరకూ రెండు రాష్ట్రాల్లో ఉమ్మడిగా ధ్రువపత్రాల పరిశీలన చేపడతామని వెల్లడించారు. విద్యార్థులు ర్యాంకుల వారీగా ఏయే తేదీల్లో కౌన్సెలింగ్‌కు హాజరుకావాలో జూలై 30న జారీ చేసిన నోటిఫికేషన్‌లో వివరంగా ప్రకటించామని, ఆ షెడ్యూల్ ప్రకారం ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. అయితే.. ఈ నెల 11న సుప్రీంకోర్టు ఇచ్చే తుది తీర్పును బట్టి తదుపరి చర్యలు చేపడతామని పేర్కొన్నారు.

నేడు ఎంసెట్ ప్రవేశాల కమిటీ భేటీ?
సుప్రీంకోర్టు తీర్పు పరిస్థితులపై చర్చించేందుకు అవసరమైతే మంగళవారం (5వ తేదీన) ఎంసెట్ ప్రవేశాల కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తామని వేణుగోపాలరెడ్డి తెలిపారు. అయితే.. ధ్రువపత్రాల పరిశీలనకు తెలంగాణలో 23, ఆంధ్రప్రదేశ్‌లో 34 సహాయక కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. కానీ కౌన్సెలింగ్ ప్రక్రియకు సహకరించబోమని తెలంగాణలో పాలిటెక్నిక్ లెక్చరర్ల సంఘం ప్రకటించిన నేపథ్యంలో సహాయక కేంద్రాల ఏర్పాటు, ధ్రువపత్రాల పరిశీలనపై మళ్లీ చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇందుకోసం ఎంసెట్ ప్రవేశాల కమిటీ సమావేశం కావాల్సిందేనని అధికారులు పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు