ప్రజల్ని మోసగించేందుకే ఈవీఎంలు

8 Apr, 2019 10:27 IST|Sakshi

సాక్షి, కాకినాడ సిటీ: రాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకుకే ప్రధాని నరేంద్ర మోదీ ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు (ఈవీఎం) వాడుతున్నారని హైటెక్‌ సీఎంగా పేరొందిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. కాకినాడ కల్పనా సెంటర్‌లో ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. అభివృద్ధి చెందిన అమెరికా, చైనా, జపాన్‌ వంటి దేశాల్లో ఇప్పటికీ బ్యాలెట్‌ విధానంలోనే ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. ఈవీఎంలు కాకుండా బ్యాలెట్‌ విధానం ద్వారా ఎన్నికలు నిర్వహించాలని 21 జాతీయ పార్టీలు సంతకాలు చేసి ఇస్తే మోదీ పట్టించుకోలేదని ఆరోపించారు. ఇప్పుడు అధికారులను బదిలీలు చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నారని అన్నారు.

ఈవీఎంలు, వీవీ ప్యాట్‌ల్లో ఓట్లు వేసేటప్పుడు తెలుగు తమ్ముళ్లు జాగ్రత్త వహించాలన్నారు. మోదీ, కేసీఆర్‌లు రాష్ట్ర ప్రజలను మోసం చేసి అరవయ్యేళ్ల అభివృద్ధిని లాక్కొని కట్టుబట్టలతో మనల్ని బయటకు నెట్టారని అన్నారు. మోదీకి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. రాష్ట్రానికి రావాల్సిన రూ.లక్ష కోట్లు ఇవ్వకుండా కేసీఆర్‌ ఇబ్బంది పెట్టారని, ట్యాంకుబండ్‌పై తెలుగుతల్లి విగ్రహాన్ని, తెలుగు కవుల విగ్రహాలను కూల్చివేసి తెలుగు ప్రజలను అవమానించారని అన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అరాచకం సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. జాబు రావాలంటే మళ్లీ బాబు రావాలని, నిరుద్యోగ భృతి రూ.2 వేల నుంచి రూ.3 వేలకు పెంచుతానని చెప్పారు. ఇంటర్‌ విద్యార్థులకు లాప్‌టాప్‌లు ఇస్తానని ప్రకటించారు. ఈ బహిరంగ సభలో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావు, ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్‌ పాల్గొన్నారు.


నిరాశగా చంద్రబాబు రోడ్‌షో
కాకినాడ రూరల్‌: చంద్రబాబునాయుడు కాకినాడ రూరల్‌ అచ్చంపేట మీదుగా కాకినాడ వరకూ ఆదివారం నిర్వహించిన రోడ్‌షో నిరాశను మిగిల్చింది. ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొంటారని ఊహించిన తెలుగు తమ్ముళ్లకు ఆశించిన జనం రాకపోవడంతో షాక్‌ తగిలింది. రోడ్‌షోలో చంద్రబాబు మాట్లాడుతూ హైదరాబాద్‌కు దీటుగా కాకినాడను అభివృద్ధి చేస్తానని చెప్పారు. తెలంగాణలో రూ.వెయ్యి పింఛను ఇస్తున్న తరుణంలో రూ.2 వేల పింఛను ఇచ్చిన ఘనత తమకే దక్కుతుందన్నారు. పసుపు – కుంకుమ చెక్కులు మారతాయా అని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారని, ఇప్పుడు లబ్ధిదారులందరికీ డబ్బు అందడంతో ఏంచేయాలో తెలియక తికమకపడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్, ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు