నేతలకు చంద్రబాబు బెదిరింపు!

3 Apr, 2017 09:57 IST|Sakshi
నేతలకు చంద్రబాబు బెదిరింపు!

మంత్రివర్గ విస్తరణ పుణ్యమాని తెలుగుదేశం పార్టీలో తీవ్రస్థాయిలో అసంతృప్తి జ్వాలలు చెలరేగాయి. దాంతో ముఖ్యమంత్రి, పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సొంత నేతల మీద బెదిరింపులకు దిగారు. మొత్తం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరినీ ఉద్దేశించి ఓ లేఖ విడుదల చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొద్దిసంఖ్యలో పదవులు ఉన్నప్పుడే పార్టీలో అసంతృప్తి రాలేదని, అలాంటిది ఇప్పుడు అధికారంలో ఉండి, ఇంత భారీ సంఖ్యలో పదవులు ఇస్తున్నా అసంతృప్తి అనడం కరెక్ట్ కాదని ఆ లేఖలో అన్నారు. కాబట్టి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎలాంటి నిరాశా నిస్పృహలకు తావివ్వని రీతిలో వ్యవహరించాలని సూచించారు. పార్టీకి సంబంధించిన అంశాలను అంతర్గత వేదికల్లో చర్చించాలే తప్ప పత్రికలకు ఎక్కడం కరెక్ట్ కాదన్నారు. పార్టీ సిద్ధాంతాల ప్రకారం అందరూ ఏకతాటిపై పనిచేయాలే తప్ప క్రమశిక్షణకు భంగం కలిగించేలా చేయకూడదని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి, పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా ఎవరూ ప్రవర్తించకూడదని, క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

అయితే, అసమ్మతి సెగ గట్టిగా తగలడం వల్లే చంద్రబాబు ఇలా వ్యవహరిస్తున్నారన్నది పార్టీ అంతర్గత వర్గాల సమాచారం. సీనియర్ నాయకులంతా ఇప్పటికే రాజీనామాల బాట పట్టారు. పార్టీ ఆవిర్భావ సమయం నుంచి ఉన్న నాయకులకు కూడా మొండిచేయి ఎదురైంది. కాగిత వెంకట్రావు, బండారు సత్యానారాయణమూర్తి, పతివాడ నారాయణ స్వామి లాంటి సీనియర్ నాయకులకు చంద్రబాబు వైఖరి నచ్చడం లేదు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటివాళ్లు సీఎంకు లేఖ రాయడమే కాక, దాన్ని బహిరంగంగా విడుదల చేశారు. లేఖలో సీఎంను ఏకిపారేశారు. రావెల కిషోర్ బాబు తన అనుచరులతో సమావేశమయ్యారు. వాళ్లంతా రాజీనామా చేస్తామని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. బీకే పార్థసారథి అనుచరులు అప్పటికే రాజీనామాలు చేశారు. పల్లె రఘునాథరెడ్డి చీఫ్ విప్ పదవి తీసుకోవాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారు. ఆయన అనుచరులు కూడా రాజీనామాల బాటలో ఉన్నారు. ఆరోగ్య సమస్యల పేరు చెప్పి తన మంత్రి పదవి తొలగిస్తే.. ఎమ్మెల్యేగా కూడా అనారోగ్యంతో చేయలేనని బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అంటున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి బండారు సత్యనారాయణ మూర్తి, గౌతు శ్యామసుందర శివాజీ, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటివాళ్లు ఉన్నారు. బుచ్చయ్య లాంటి వాళ్లయితే అసెంబ్లీలో ప్రతిపక్షం మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడుతుంటారు. అంత చేసినా, ఇంత సీనియర్ అయినా తనకు గుర్తింపు రాకపోవడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఇక వైఎస్ఆర్‌సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన జ్యోతుల నెహ్రూ కూడా తనకు మంత్రిపదవి కచ్చితంగా వస్తుందని ఆశించారు. ప్రమాణస్వీకారానికి వెళ్లేందుకు కూడా ఆయన ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఆయన ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు.

అయితే.. చంద్రబాబు మాత్రం అసంతృప్త నేతలను బుజ్జగించే పని పక్కన పెట్టి.. నేరుగా బెదిరింపులతోనే పని కానిస్తున్నట్లు తెలుస్తోంది. విజయవాడ ఎంపీ కేశినేని నాని ద్వారా బోండా ఉమాను రప్పించిన చంద్రబాబు.. కబ్జాల పేరు చెప్పి తీవ్రంగా బెదిరించినట్లు సమాచారం. దాంతో బయటకు వచ్చిన తర్వాత.. తాను పూర్తిగా సర్దుమణిగానని, ఇక మీదట తాను టీవీ చర్చలలో పాల్గొనబోయేది లేదని, టీడీపీ వాయిస్ వినిపించనని బోండా ఉమా అన్నారు. అలాగే చింతమనేని ప్రభాకర్‌ను కూడా పిలిపించి ఇసుక కేసు, అధికారుల మీద దాడులు తదితర కేసులు ప్రస్తావించి బెదిరించారని అంటున్నారు. దాంతో అవసరమైతే కొత్త పార్టీ పెడతానని కూడా చెప్పిన చింతమనేని.. విప్ పదవికి మాత్రం రాజీనామా చేసి ఊరుకున్నారు. గంటా శ్రీనివాసరావు టీడీపీని వదిలి వేర్వేరు పార్టీలకు వెళ్లి మళ్లీ వచ్చినా వాళ్ల పదవులు కొనసాగిస్తున్నారని, కొందరు మంత్రులపై తీవ్రంగా ఆరోపణలున్నా పట్టించుకోవట్లేదని అంటున్నారు.

>
మరిన్ని వార్తలు