రెండు, మూడు రోజుల్లో అశోక్‌ బయటకు...

9 Mar, 2019 17:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : డేటా చోరీ కేసులో నిందితుడుగా ఉన్న ఐటీ గ్రిడ్స్‌ సీఈవో అశోక్‌ దాకవరం తమ దగ్గరే ఉన్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరోక్షంగా అంగీకరించారు. శనివారం ఆయన తన నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో అశోక్‌ ఎక్కుడున్నాడన్న మీడియా ప‍్రశ్నకు స్పష్టత ఇచ్చారు. రెండు, మూడు రోజుల్లో అశోక్‌ బయటకు వస్తాడని చంద్రబాబు తెలిపారు. నేరం చేయని వ్యక్తిని అరెస్ట్‌ చేస్తే ఎంత అవమానమని, వారిని ఎంతో మానసిక క్షోభకు గురి చేస్తుందని అన్నారు. దీంతో ఐటీ గ్రిడ్స్‌ సంస్థ సీఈవో ఏపీ ప్రభుత్వ రక్షణలోనే ఉన్నాడన‍్న విషయాన్ని చంద్రబాబు నిర్థారించినట్లు అయింది. మరోవైపు మీడియా సమావేశంలో సీఎం చేసిన వ్యాఖ్యలతో టీడీపీ నేతలు తలలు పట్టుకున్నారు. డేటా చోరీ కేసులో నిందితుడుగా ఉన్న అశోక్‌పై ముఖ్యమంత్రి బహిరంగంగా మాట్లాడటంతో టీడీపీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

కాగా అశోక్‌ తమ దగ్గరే ఉన్నట్లు టీడీపీ నాలెడ్జ్‌ సెంటర్‌ ఇంఛార్జ్‌ మల్యాద్రి పేర్కొన్న విషయం తెలిసిందే. ఇప్పటికే అశోక్‌కు సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు 161 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు. అయితే అశోక్‌ తమ దగ్గరే ఉన్నారని ఓ టీవీ ఛానల్‌ ఇంటర్వ్యూలో మల్యాద్రి వెల్లడించారు. అశోక్‌తో తాము రెగ్యులర్‌గా మాట్లాడుతున్నామని... అంతేకాకుండా తెలంగాణ పోలీసులకు అశోక్‌ను అప్పగించబోమని అన్నారు.

మరోవైపు తనపై మాదాపూర్, సంజీవరెడ్డి నగర్‌ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లను కొట్టేయాలని అశోక్‌ శుక్రవారం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. మాదాపూర్‌ పోలీసులు నమోదు చేసిన కేసును ఏపీకి బదలాయిస్తూ ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఆ మేరకు రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై హైకోర్టు సోమవారం విచారణ జరిపే అవకాశం ఉంది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు