మాఫీ పేరుతో రైతులను నిండా ముంచిన బాబు

30 Jan, 2015 01:42 IST|Sakshi

 అమలాపురం : రుణమాఫీ పేరుతో చంద్రబాబు రైతును నిండా ముంచారని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యులు కుడుపూడి చిట్టబ్బాయి, పినిపే విశ్వరూప్ విమర్శించారు. బాబు రుణ మాఫీ మోసాలపై ఈనెల 31న, ఫిబ్రవరి ఒకటో తేదీన పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తణుకులో నిర్వహిస్తున్న దీక్షను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అమలాపురంలో గురువారం పార్టీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం జరిగింది. దీనిలో ముఖ్యఅతిథులుగా చిట్టబ్బాయి, విశ్వరూప్ మాట్లాడుతూ ఎన్నికల ముందు రైతుల రుణాలన్నీ తానే చెల్లిస్తానని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు పూర్తయినా రుణమాఫీ సక్రమంగా అమలు చేయకుండా బాబు రైతులను అష్టకష్టాల పాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
 
 సమావేశానంతరం వారిద్దరూ విలేకరులతో మాట్లాడుతూ రైతు రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేయాలంటే రూ.84 వేల కోట్లు అవసరమని, కేవలం రూ. అయిదు వేల కోట్లు మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకున్నారని పేర్కొన్నారు. డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికుల రుణమాపీ ఎలాంటి ప్రకటనా చేయకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇంటికో ఉద్యోగం ఇస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని, ప్రతి కుటుంబానికీ ఇల్లు ఇస్తామని బూటకపు హామీలు ఇచ్చి బాబు దగా చేశారని పేర్కొన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి రుణమాఫీ సాధ్యం కాదని ఎన్నికలకు ముందే వాస్తవ పరిస్థితిని చెప్పినా బాబు సాధ్యం కాని హామీలు ఇచ్చారని ధ్వజమెత్తారు.  బాబు బూటకపు హామీలపై జగన్‌మోహన్‌రెడ్డి రైతు పక్షాన పోరాడుతున్నారని చెప్పారు.  సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా కో-ఆర్డినేటర్ మిండగుదిటి మోహన్,  లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ మట్టపర్తి మురళీకృష్ణ, పట్టణ, రూరల్ కన్వీనర్లు మట్టపర్తి నాగేంద్ర, జంపన రమేష్‌రాజు తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు