‘తొలి సంతకం కూడా అమలుకాలేదు’

4 Feb, 2017 17:17 IST|Sakshi
‘తొలి సంతకం కూడా అమలుకాలేదు’

హైదరాబాద్‌: ఎన్నికల హామీల అమలును విస్మరించి టీడీపీ, బీజేపీలు అబద్ధాలు చెప్పడంలో పోటీపడుతున్నాయని పీసీసీ అధ్యక్షుడు ఎన్‌. రఘువీరారెడ్డి విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘టీడీపీ ఇచ్చిన 600 హామీల్లో ఒక్కటికూడా అమలు చేయలేదు. తొలి సంతకం అయిన బెల్ట్ షాపుల తొలగింపు కూడా అమలు కాలేదు. హుద్‌హుద్‌ తుఫాన్ సహాయంగా వెయ్యి కోట్లు ప్రకటించిన ప్రధాని మోడీ నేటికి ఇచ్చింది మాత్రం 400 కోట్లు మాత్రమే. రెవిన్యూ లోటు భర్తీ, దుగ్గరాజు పట్నం ఓడరేవు, కడప ఉక్కు ఫ్యాక్టరీ, వెనుకబడిన జిల్లాలకి ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ వంటి విభజన చట్ట హామీలు అమలుకు నోచుకోవడం లేదు’ అని అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ క్యాబినెట్ లో సామజిక న్యాయం లోపించిందని రఘువీరారెడ్డి విమర్శించారు. క్యాబినెట్ లో మైనారిటీ, గిరిజనులకు స్థానం కల్పించకపోవడం నేరమని అన్నారు. ‘లోకేశ్ మంత్రి కాకపోయినా తెరవెనుక ప్రభుత్వ వ్యవహారాలలో జోక్యం చేసుకుంటున్నారు. లోకేశ్ అవును అంటేనే ఫైళ్లు కదులుతున్నాయి. చంద్రబాబు కు తన మంత్రులు, ఎమ్మెల్యే లపై నమ్మకం లేదు.. అందుకే లోకేశ్ కి మంత్రి పదవి ఇవ్వాలి అనుకుంటున్నారు’ అని రఘువీరారెడ్డి విమర్శించారు.

రెండున్నరేళ్లుగా అబద్ధపు ప్రచారంతోనే రాజకీయాలు చేస్తున్న బీజేపీ టీడీపీలను ఎండగట్టె ఎజెండాతో ఈ నెల 10న గుంటూరులో ఏపీ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు రఘువీరారెడ్డి వెల్లడించారు. ఈ సమావేశంలో మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రెండువేల మంది ప్రతినిధులు పాల్గొంటారన్నారు. విభజన హామీల అమలు, టీడీపీ ఎన్నికల హామీలు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అవకతవకలు తదితర అంశాలను ఈ సమావేశంలో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. అన్ని నియోజకవర్గం లలో మోటార్ సైకిల్ యాత్రల నిర్వహణ పై కసరత్తు చేస్తున్నామన్నారు.