రాజధానిపై ఏకపక్ష ప్రకటనకు చంద్రబాబు సిద్ధం!

3 Sep, 2014 20:48 IST|Sakshi
ఏపి మ్యాప్ - చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడనే విషయం ఏక పక్షంగా ప్రకటించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధమయ్యారు. ఈ విషయంలో శాసనసభలో ఏకైక ప్రతిపక్షమైన వైఎస్ఆర్ సిపి సభ్యులను ఎదుర్కొనేందుకు తమ మంత్రులకు, ఎమ్మెల్యేలకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. రాజధాని విషయంలో మంత్రులంతా ఏకతాటిపై ఉండాలని ఆదేశించారు. సభలో  ప్రతిపక్షం చర్చకు పట్టుబడితే ఎదురుదాడికి సిద్ధంగా ఉండాలని సూచనలు ఇచ్చారు. చర్చకు ప్రతిపక్షం పట్టుబడితే ఏకపక్షంగా ప్రకటించి, ఆమోదింపచేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు.  

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై బుధవారం శాసనసభ దద్దరిల్లింది. సభలో ఎలాంటి చర్చా లేకుండానే రాజధానిపై ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారన్న అంశంపై ప్రధాన ప్రతిపక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంపై ఇప్పటికే 304 నిబంధన కింద నోటీసు ఇచ్చామని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి గుర్తు చేశారు.  రాజధానిపై ముందుగా చర్చ జరగాలని, ఆ తర్వాతే రాజధానిపై ప్రకటన చేయాలని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు.  రాజధానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన తర్వాతే సభలో చర్చ ఉంటుందని మంత్రి అచ్చెన్నాయుడు ప్రభుత్వం తరపున ప్రకటించారు. ముఖ్యమంత్రి  సభలోనే ప్రకటన చేస్తారని చెప్పారు.

ముఖ్యమంత్రి  ప్రకటన చేసిన తర్వాత ఇంకా చర్చించేదేముందని జగన్ ప్రశ్నించారు. సభలో ఎలాంటి చర్చ జరగకుండా రాజధానిపై ఎలా నిర్ణయం తీసుకుంటారని  అడిగారు.  రాజధానిపై అధికారపక్షం ఇష్టం వచ్చినట్లు ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటే ఈ సభ దేనికని ఆయన ప్రశ్నించారు. రాజధాని ఎక్కడైనా పెట్టండి, తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన స్పష్టం చేశారు.  అయితే కనీస సౌకర్యాలున్న ప్రాంతంలో రాజధాని ఉండాలని  వైఎస్ జగన్ అన్నారు. తాము ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదన్నారు. తమకు అన్ని ప్రాంతాలు ఒకటేనని చెప్పారు. కృష్ణా అయినా గుంటూరు అయినా తమకు అభ్యంతరం లేదన్నారు. అయితే రాజధానిపై ఏకపక్ష నిర్ణయం ఒప్పుకునేది లేదని చెప్పారు.  శివరామకృష్ణన్ కమిటీ నివేదికపై ముందు చర్చ, ఆ తరువాత ఓటింగ్ జరగాలని డిమాండ్ చేశారు. అప్పుడే  నిర్ణయం ప్రకటించాలన్నారు.  ఇదే పరిస్థితి 1953లో ఉత్పన్నమైనప్పుడు సభలో అయిదు రోజులపాటు చర్చ జరిగిందని గుర్తు చేశారు.

అధికార పక్షం ఓ పక్క ఏకపక్షంగా నిర్ణయం ప్రకటించడానికి ప్రయత్నిస్తుండగా,  మరోపక్క చర్చ, ఓటింగ్ జరగాలని ప్రతిపక్షం పట్టుపడుతోంది. ఈ నేపథ్యంలో రేపు శాసనసభలో ఈ అంశంపై వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది.
**

మరిన్ని వార్తలు