పెట్టుబడులకు ఏపీ స్వర్గధామం

14 Nov, 2014 01:35 IST|Sakshi
సింగపూర్‌లో టాటా ఫియా, సెమెబ్ కార్ప్ ప్రతినిధులతో చర్చిస్తున్న సీఎం చంద్రబాబు

* సింగపూర్‌లో వాణిజ్యవేత్తల భేటీలో సీఎం చంద్రబాబు  
* రెండో రోజు పలువురు ప్రముఖులతో వరుసగా సమావేశాలు
* ఉప ప్రధాని, విదేశాంగ మంత్రులతోనూ చర్చలు
* నేడు రాత్రి లేదా రేపు ఉదయానికి హైదరాబాద్‌కు తిరిగి రాక

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ‘మేక్ ఇన్ ఇండియా’ అని పిలుపునిస్తే తాను ‘మేకిన్ ఇండియా, మేడిన్ ఆంధ్రప్రదేశ్ ’ అని అన్నానని చెప్పారు. సింగపూర్ పర్యటనలో భాగంగా రెండో రోజైన గురువారం చంద్రబాబు ప్రముఖ వాణిజ్యవేత్తలు, పారిశ్రామికవేత్తలకు అల్పాహార విందు ఇచ్చి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా బాబు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్‌కు ముగ్ధులై న పారిశ్రామికవేత్తలు స్టాండింగ్ ఒవేషన్(గౌరవ పూర్వకంగా నిలబడి కరతాళధ్వనులతో అభినందించటం) ఇచ్చినట్లు ప్రభుత్వ సమాచార సలహాదారు కార్యాలయం ఒక ప్రకటనలో  తెలిపింది. ఆ వివరాల ప్రకారం.. చంద్రబాబు ఉదయం టాటా ఫియా, సెమెబ్ కార్ప్ తదితర సంస్థల ప్రతినిధులతో సమావేశమై ఏపీలో విమానయాన రంగ అభివృద్ధిపై చర్చించారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా తీర్చిదిద్దటంతోపాటు 13 జిల్లాల్లో విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తామని వివరించారు.

రవాణా, గృహ నిర్మాణంపై చర్చలు..
చంద్రబాబుతో వాణిజ్యవేత్తలు, పారిశ్రామికవేత్తల సమావేశంలో ఎస్ సెండాస్, సెంబ్ కార్బో డిజైన్ అండ్ కన్‌స్ట్రక్షన్, జూరాంగ్ ఇంటర్నేషనల్, సుర్బానా, మెయిన్ హార్ట్, లీ కిమ్ టా,  నేషనల్ కంప్యూటర్ సిస్టమ్స్, గ్లోబల్ స్కూల్స్ ఫౌండేషన్, చాంగి ఇంటర్నేషనల్, శాట్స్, ఐఎస్‌ఏఎస్, సింగపూర్ కార్పొరేషన్ ఎంటర్‌ప్రైస్, వైబ్రెంట్ గ్రూప్ తదితర సంస్థల సీఈవోలు పాల్గొన్నారు. కొత్త రాజధానితో పాటు ఇతర నగరాల్లో భూ ఉపరితల రవాణా ప్రణాళికపై సింగపూర్ సెంటర్ ఫర్ లివబుల్ సిటీస్ సంస్థ బృందంతో సీఎం చంద్రబాబు చర్చించారు.

రోడ్లు, ప్రైవేట్ కార్లు, బస్సులు, మెట్రో నెట్‌వర్క్, ఇంకా నూతన ఆవిష్కరణలు, ఈ రంగంలో సింగపూర్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల గురించి తెలుసుకున్నారు. సింగపూర్ ల్యాండ్ ట్రాన్స్‌పోర్ట్ అకాడమీ కన్సల్టెన్సీ సేవలపై చర్చించారు. జైపూర్‌లో రవాణా రంగానికి ఈ సంస్థ కన్సల్టెన్సీ సేవలు అందించినట్లు తెలుసుకున్న చంద్రబాబు ఏపీకి కూడా ఇదే రకమైన సేవలు అందించాలని కోరారు. ఐఐఎం పూర్వ విద్యార్థుల సంఘం ప్రపంచ అధ్యక్షుడు సంజీవ్‌కపూర్‌తో కూడా చంద్రబాబు భేటీ అయ్యారు.

సింగపూర్ హౌసింగ్ డెవలప్‌మెంట్ బోర్డు అధికారులతో గృహ వసతి కల్పనకు అనుసరించాల్సిన ప్రణాళిక గురించి చర్చించారు. సింగపూర్‌లో గృహ నిర్మాణం, రుణ సదుపాయాలు, సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ సేవింగ్స్,  అద్దెకు ప్లాట్లు, కమ్యూనిటీ సెంటర్లు, వివిధ గృహాల్లో వసతుల గురించి వివరించటంతో పాటు ది వరల్డ్ ఆఫ్ హెచ్‌డీబీ పేరుతో రూపొందించిన పవర్ పాయింట్ ప్రజంటేషన్‌ను ఏపీ బృందానికి బోర్డు సభ్యులు ఇచ్చారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్‌ను సందర్శించిన చంద్రబాబు రాష్ట్రంలో సాంకేతిక విద్యారంగంలో చేపట్టాల్సిన మార్పులపై చర్చించారు.

సీఎం బృందానికి ఉపప్రధాని విందు
సింగపూర్‌లో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు గౌరవార్థం ఆ దేశ  ఉపప్రధాని తర్మగ షణ్ముగరత్నం విందు ఇచ్చారు. సీఎం వెంట వెళ్లిన ప్రతి నిధి బృందం సభ్యులందరూ ఇందులో పాల్గొన్నారు. పుష్కలంగా ఖనిజ సంపద కలిగిన ఏపీ ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయటమే తన లక్ష్యమనిచంద్రబాబు తెలిపారు. చెన్నై-బెంగళూరు, చెన్నై- విశాఖ పారిశ్రామిక కారిడార్‌లకు మధ్య ఏపీ ఉండటంతో పారిశ్రామిక  హబ్‌గా రూపొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నా రు. భారత్‌లో జరుగుతున్న మార్పులను ఆసక్తిగా గమనిస్తున్నట్లు తర్మగ షణ్ముగరత్నం తెలిపారు. చంద్రబాబుపై ఉన్న నమ్మకంతో తాము ఆంధ్రప్రదేశ్‌పై దృష్టి సారిస్తామని చెప్పారు.

రాష్ర్టంలో ఉన్న వనరులు, శక్తి సామర్థ్యాలు, పారిశ్రామికాభిరుచి తనకు తెలుసని వివరించా రు. విదేశాంగ మంత్రి  షణ్ముగంతో కూడా బా బు మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. రాజకీయంగా పలుకుబడి కలిగిన వీరిద్దరికీ సింగపూర్ బడా పారిశ్రామికవేత్తలతో సన్నిహిత సంబంధాలున్నాయని, ఏపీలో పెట్టుబడులు పెట్టే విషయంలో వారి ప్రభావం ఉంటుందని సమాచార సలహాదారు కార్యాలయం తెలిపిం ది. మాజీ ప్రధాని గోచోటాంగ్‌తో కూడా చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రంలో స్మార్ట్ నగరాల అభివృద్ధికి చేయూతనివ్వాలని కోరారు.

నేడు ‘ఐఎస్‌ఏఎస్’లో చంద్రబాబు ప్రసంగం
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సౌత్ ఏషియన్ స్టడీస్(ఐఎస్‌ఏఎస్) శుక్రవారం నిర్వహించే అంతర్జాతీయ సదస్సులో ‘దక్షిణాసియాలో రాష్ట్రాల పాత్ర’ అనే అంశంపై చంద్రబాబు కీలకోపన్యాసం చేయనున్నారు. మూడు రోజుల సింగపూర్ పర్యటన ముగించుకుని శుక్రవారం రాత్రికి లేదా శనివారం ఉదయానికి చంద్రబాబు తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.

ఆయన వెంట పర్యటనలో మంత్రులు యనమల రామకృష్ణుడు, డాక్టర్ పి.నారాయణ, కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు, ప్రభుత్వ సమాచార సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, సాంకేతిక సలహాదారు జె.సత్యనారాయణ, ఎంపీలు  సీఎం రమేష్, గల్లా జయదేవ్, ఐఏఎస్ అధికారులు డి.సాంబశివరావు, జేఎస్‌వీ ప్రసాద్, ఎ.గిరిధర్, మాజీ  ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ ఏఆర్ అనూరాధ తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు