జగన్‌ ప్రకటనతో సర్కారులో చలనం

20 Jul, 2017 01:05 IST|Sakshi
జగన్‌ ప్రకటనతో సర్కారులో చలనం
వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి భూమన
 
సాక్షి, హైదరాబాద్‌: ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల పార్టీ ప్లీనరీలో చేసిన నవరత్నాలు ప్రకటన దెబ్బతో వణుకు పుట్టిన చంద్రబాబు ప్రభుత్వం మూడేళ్లుగా తెరమరుగు చేసిన హామీలను నెరవేర్చేందుకు ముందుకు వచ్చిందని, మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశం తీరే అందుకు నిదర్శనమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి చెప్పారు. ఆయన బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... అధికారం చేపట్టాక చేసిన తొలి సంతకాల్లో భాగంగా బెల్ట్‌ షాపులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన చంద్రబాబు మూడేళ్ల తరువాత ఇపుడు బెల్ట్‌ షాపుల తాట తీస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు.

గతంలో సుప్రీంకోర్టు మద్యం దుకాణాలపై కఠినమైన ఆదేశాలు ఇస్తే వాటిని ఉల్లంఘించి రాష్ట్ర రహదారులను జిల్లా రహదార్లుగా మార్చి మరీ బార్‌ షాపులను ఏర్పాటు చేశారని చెప్పారు. జగన్‌ ప్రకటించిన మద్యం విధానం వల్ల భయంతోనే బెల్ట్‌ షాపుల రద్దు నిర్ణయం వచ్చిందని తెలిపారు. గతంలో ఉద్దానం మొదలు రైతుల ఆత్మహత్యలు, తుందుర్రులో ఐదుగురు మరణించిన సంఘటనల వరకూ చంద్రబాబు ప్రభుత్వం తొలుత రూ.5లక్షలు పరిహారంగా ప్రకటించి, ఆ తరువాత ప్రతిపక్ష నేత వెళ్లేటప్పటికి రూ.15 లక్షలకు పెంచిందని గుర్తుచేశారు. 
 
వణుకుతున్న చంద్రబాబు... : ‘అన్న వస్తున్నాడు... నవరత్నాలు తెస్తున్నాడు’ అని చెప్పగానే భయంతో చంద్రబాబు వణికి పోతున్నాడని భూమన ఎద్దేవా చేశారు. ఉద్దానం కిడ్నీ బాధితులకు  ప్రతి నెలా రూ 10 వేలు ఆర్థిక సాయం అందిస్తామని జగన్‌ ప్రకటించడంతో చంద్రబాబు హడావుడిగా ఇపుడు రూ.2500లు పింఛనును ప్రకటించారని తెలిపారు. అన్న వస్తున్నాడనే భయంతోనే ఇసుక రవాణాపై చర్యలు చేపట్టారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల మెస్‌ ఛార్జీలు పెంచారని చెప్పారు. మొత్తం మీద ప్లీనరీ వేదికగా జగన్‌ నవరత్న ఖచిత శంఖారావం పూరించడంతో టీడీపీ నేతలకు నవరత్న తైలంతో మర్ధన చేసుకోవల్సి వస్తోందని ఎద్దెవా చేశారు.
మరిన్ని వార్తలు