నీళ్లిచ్చానని వరి జోలికెళ్లొద్దు

30 Jan, 2019 12:47 IST|Sakshi
చెర్లోపల్లి రిజర్వాయర్‌ వద్ద పూజలు చేస్తున్న చంద్రబాబు

 రైతులను హెచ్చరించిన సీఎం చంద్రబాబు

అనంతపురం , కదిరి: ‘హంద్రీనీవా జలాలు వచ్చాయని రైతులెవరూ వరి పంట జోలికెళ్లద్దు. వరి సాగు లాభం కన్నా... నష్టమే ఎక్కువ. పండ్లతోటలు, కూరగాయలు సాగుచేసుకోండి. వీటికి తక్కువ నీరు సరిపోతుంది. బిందు, తుంపర్ల ద్వారా సాగుచేస్తే నీరు మరింత ఆదా అవుతుంది. పొరపాటున కూడా వరి సాగుచేయద్దు..’ అనిముఖ్యమంత్రి చంద్రబాబు రైతులను హెచ్చరించారు. మంగళవారం ఆయన కదిరి మండలంలోని చెర్లోపల్లి రిజర్వాయర్‌ నుంచి పుంగనూరు బ్రాంచ్‌ కెనాల్‌ ద్వారా కుప్పంకు నీటిని విడుదల చేశారు. అంతకుముందు జలహారతి ఇచ్చి, పైలాన్‌ను ఆవిష్కరించారు. తర్వాత ఆదరణ–2 పథకం కింద పలువురికి పనిముట్లు, వ్యవసాయ పరికరాలు పంపిణీ చేశారు. అనంతరం బహిరంగ సభలో గంటకు పైగా ప్రసంగించారు. రాయలసీమను రతనాల సీమగా మారుస్తానన్నారు. 1.5 టీఎంసీల కెపాసిటీతో నిర్మించిన చెర్లోపల్లి రిజర్వాయర్‌ సామర్థ్యాన్ని భవిష్యత్‌లో పెంచడమే కాకుండా ఈ జలాశయం ద్వారా ఈ ప్రాంతంలోని అన్ని చెరువులను నింపుతామని హామీ ఇచ్చారు. అనంతపురం అనగానే కరువు జిల్లాగా పేరుందని, ఇక్కడి ప్రజలు ఇతర ప్రాంతాలకు వలసలు కూడా వెళ్తున్నారన్నారు. అయితే రానున్న రోజుల్లో ఇతర ప్రాంతాల వారే ‘అనంత’కు వలసలు రావడం ఖాయమన్నారు.

చిత్రావతి రిజర్వాయర్‌తో అనుసంధానం చేస్తాం
హంద్రీనీవా ప్రాజెక్టును చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌తో అనుసంధానం చేస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నదుల అనుసంధానంతో రాయలసీమకు సరిపడ నీటిని అందిస్తామని తెలిపారు. ప్రధాని మోదీ రాష్ట్రాభివృద్ధికి సహకరించడం లేదని, అయినా సంక్షోభంలో అవకాశాలను వెదక్కోవడం తనకు బాగా తెలుసన్నారు. ఏపీ నుంచి భారీగా పన్నులు కడుతున్నా...నిధులిచ్చేందుకు ఆయన మనసు రావడం లేదన్నారు.

పోస్టుడేటెడ్‌ చెక్కులు ఇస్తున్నాం
డ్వాక్రా గ్రూపులను ప్రారంభించిదే టీడీపీ అని, డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు ఫిబ్రవరి 2, 3, 4వ తేదీల్లో ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున 3 పోస్టుడేటెడ్‌ చెక్కులు పంపిణీ చేస్తామన్నారు. వీటిని మార్చి, ఏప్రిల్‌ నెలల్లో డ్రా చేసుకోవచ్చాన్నారు. దీని ద్వారా 95 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరుతుందన్నారు. ‘జయహో బీసీ’ సభ ద్వారా 22 కార్పొరేషన్‌లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపామనీ, ఆయా వర్గాలకు వాటి ద్వారా నిధులిచ్చి ఆదుకుంటామన్నారు. ‘‘నేను మీ కోసం ఐదేళ్లుగా కష్టపడుతున్నాను..మీరు నాకోసం 75 రోజులు కష్టపడి గెలిపించండి’’ అని కోరారు. కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమ, పరిటాల సునీత, కాలువ శ్రీనివాసులు, ప్రభుత్వ చీఫ్‌విప్‌ పల్లె రఘునాథరెడ్డి, ఎమ్మెల్యే వరదాపురం సూరి, విప్‌ చాంద్‌బాషా, టీడీపీ కదిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కందికుంట వెంకట ప్రసాద్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు