‘ఫ్యామిలీ’ ఫంక్షన్

7 Jun, 2015 02:24 IST|Sakshi
‘ఫ్యామిలీ’ ఫంక్షన్

సీఎం కుటుంబ కార్యక్రమంలా భూమిపూజ
* పూజలో సీఎం, సతీమణి, కుమారుడు, వియ్యంకుడు
* హాజరైన మంత్రులు, టీడీపీ నేతలు, అధికారులు
* ప్రతిపక్షపార్టీలను, నేతలను పట్టించుకోని సర్కారు
* భూములిచ్చిన రైతులనూ పక్కనపెట్టేసిన వైనం
* నిరసన తెలిపిన రైతులు, గ్రామపెద్దలు
* ప్రొటోకాల్ పక్కనపెట్టి బాలకృష్ణకు పెద్దపీట


(మందడం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నగర నిర్మాణ భూమి పూజను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంతింటి వ్యవహారంగా, తెలుగుదేశం పార్టీ కార్యక్రమంగా నిర్వహించారు. రాజధాని కోసం శనివారం ఉదయం 8.49 గంటలకు గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడం గ్రామంలో చంద్రబాబు భూమి పూజ చేశారు.

ఈ కార్యక్రమంలో చంద్రబాబు, సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, వియ్యంకుడు బాలకృష్ణ, టీడీపీ నేతలు పాల్గొన్నారు. పేరుకు భూమి పూజ అని చెప్పినప్పటికీ అక్కడ జరిగిన విధానం పరిశీలిస్తే శంకుస్థాపన కార్యాన్నీ పూర్తి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన భార్య భువనేశ్వరి సమక్షంలో పూజా కార్యక్రమం జరగ్గా... అనంతరం ముఖ్యమంత్రితో పాటు వరుసగా మంత్రులు, హాజరైన కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యే బాలకృష్ణ తదితరులు శంకుస్థాపనకు వేసినట్లు సిమెంట్ వేశారు.

ఈ అధికారిక కార్యక్రమంలో శాసనసభ స్పీకర్, కేంద్ర మంత్రులు, డిప్యూటీ సీఎంలకన్నా బాలకృష్ణకు పెద్దపీట వేశారు. పూజ అనంతరం నిర్వహించిన సభా వేదికపై ముఖ్యమంత్రి, ఆయన భార్య ఆ పక్కనే బాలకృష్ణ ఆసీనులయ్యారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎంలు ఇతర మంత్రులకు చోటిచ్చారు. మరోవైపు స్పీకర్ కోడెల శివప్రసాదరావు, కేంద్ర మంత్రులు అశోక గజపతిరాజు, నిర్మలా సీతారామన్‌లకు, ఇతర మంత్రులకు చోటిచ్చారు. శాసనసభ్యుడైన బాలకృష్ణ ప్రొటోకాల్ ప్రకారం వీరెవరికన్నా ఎక్కువ హోదాలో లేనప్పటికీ చంద్రబాబు దంపతుల తర్వాత చోటిచ్చి ప్రొటోకాల్‌ను అతిక్రమించారు.

మరోవైపు ఎలాంటి అధికార హోదాలేని లోకేష్‌కూ వేదికపై చోటు కల్పించడం గమనార్హం. కార్యక్రమంలో జై బాలయ్య, జై జై బాలయ్య నినాదాలు మారుమోగాయి. రాష్ట్రగీతం ‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ’ ఆలపిస్తున్న సమయంలోనూ నినాదాలు చేయడంతో విద్యార్థులు వెంటనే నిలిపివేశారు. ఆ తరువాత పలుమార్లు అభిమానులు నినాదాలు చేసినా చంద్రబాబు పట్టించుకోలేదు.
 
విపక్షాలను, రైతులను పట్టించుకోని సర్కారు
ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి అతిపెద్ద అధికారిక కార్యక్రమంలో ప్రతిపక్షాలను భాగస్వామ్యం చేయాలన్న విషయాన్ని ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. రాష్ట్ర విభజన సమయంలో ఎవరితోనూ చర్చించలేదనీ భాగస్వాములందరినీ ఒప్పించలేదని నిత్యం విమర్శలు చేసే చంద్రబాబు రాజధాని విషయంలో తొలినుంచీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

దానికి కొనసాగింపుగానే అన్నట్లుగా భూమి పూజ విషయంలోనూ ప్రతిపక్ష పార్టీలను గానీ ఆ పార్టీలకు చెందిన శాసనమండలి, శాసనసభల్లో విపక్ష నేతలను గానీ పట్టించుకోలేదు. తమ విలువైన భూములు అప్పగించిన రైతులను సైతం పక్కనపెట్టేశారు. ప్రభుత్వం తీరుపట్ల కినుక  వహించిన రైతులు, వారిని ఒప్పించిన పెద్దలు భూమిపూజ కార్యక్రమం ముగిసిన తరువాత, బహిరంగ సభ సమయంలో నిరసన తెలిపారు.

ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజలకంటే పోలీసులే ఎక్కువగా కనిపించారు. బహిరంగసభ నిర్వహించిన ప్రాంతంలో ముప్పావు వంతు ఖాళీగానే కనిపించింది. వేసిన కుర్చీలు సైతం నిండలేదు. భూమిపూజకు ముందు వీచిన ఈదురుగాలులకు సభాస్థలంలో వేసిన టెంట్లు కూలిపోగా, పచ్చని చెట్లు విరిగిపోయాయి.
 
సీఎం క్యాంపు కార్యాలయం
ప్రారంభం వాయిదా

సాక్షి, విజయవాడ బ్యూరో : విజయవాడలో ఏర్పాటు చేస్తున్న ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ప్రారంభం వాయిదా పడింది. మందడంలో భూమి పూజ కార్యక్రమం ఆలస్యమవడంతో ముహూర్తం సమయానికి సీఎం విజయవాడ చేరుకోవడం కష్టమని భావించి కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి.ఈ నెల 8న ముఖ్యమంత్రి రాజధాని ప్రాంతంలో పర్యటిస్తారని, ఆరోజే క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవం ఉంటుందని తెలిపారు. సమయాన్ని తర్వాత ప్రకటిస్తామన్నారు.
 
వేదపండితుల సమక్షంలో భూమిపూజ
సాక్షి, విజయవాడ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని నగర నిర్మాణానికి శనివారం ఉదయం శాస్త్రోక్తంగా భూమిపూజ జరిగింది. మందడం గ్రామ సర్వే నంబరు 136లో తెల్లవారు జామున మూడు గంటల నుంచే వేదపండితులు పూజాది కార్యక్రమాలను ప్రారంభించారు. సరిగ్గా 8.10 గంటలకు సీఎం చంద్రబాబు భార్యాతనయులతో పూజా కార్యక్రమ ప్రాంగణంలోకి అడుగుపెట్టారు.

ఆయన తనయుడు లోకేష్, బావమరిది నందమూరి బాలకృష్ణ, కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్, పరకాల ప్రభాకర్ దంపతులు కూడా సీఎం దంపతుల పక్కనే కూర్చుని పూజా కార్యక్రమాలను నిర్వహించారు. భూమిపూజకు ముహూర్తంగా నిర్ణయించిన 8.49 గంటలకు సీఎం చంద్రబాబునాయుడు సిమెంటు, ఇసుక కలిపిన మిశ్రమాన్ని పవిత్ర ప్రదేశంలో వేశారు. అనంతరం ముఖ్యమంత్రి దంపతులు హలయజ్ఞంలో పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలను తిలకించేందుకు వీలుగా నిర్వాహకులు భారీ ఎల్‌ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు