కొండెక్కిన కోడి

12 May, 2020 12:32 IST|Sakshi

తూర్పుగోదావరి, అమలాపురం: కోళ్ల పరిశ్రమ పుంజుకుంటోంది.. మార్చి నెలలో వరుస సంక్షోభాలతో ఈ పరిశ్రమ అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంది. ఈ మాంసం తింటే వ్యాధులు వస్తాయనే అపోహలు.. తరువాత కరోనా లాక్‌డౌన్‌తో తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెట్టింది. వ్య వసాయ, ఆ అనుబంధ రంగాల విషయంలో రైతులకు మేలు చేసే లా ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫలించడంతో కోళ్ల పరిశ్రమ కోలుకుంటోంది. మార్చి రెండో వారంలో కనిష్ట స్థాయికి పడిపోయిన బ్రాయిలర్, లేయర్‌ కోళ్ల ధరలు ఇప్పుడు ఆకాశాన్నంటుతున్నాయి. ఆదివారం మార్కెట్‌లో బ్రాయిలర్‌ లైవ్‌ కేజీ రూ.130, లేయర్‌ కేజీ రూ.85 పలికింది. కేజీ బ్రాయిలర్‌ మాంసం రిటైల్‌ ధర రూ.220 నుంచి రూ.240 వరకు ఉంది.

లేయర్‌ మాంసం కేజీ రూ.200 వరకు చేరడం విశేషం. గత మార్చిలో బ్రాయిలర్‌ లైవ్‌ ధర రైతు వారీ కేజీ రూ.16 వరకు ఉండగా, రిటైల్‌ ధర కేజీ రూ.38 మాత్రమే. లేయర్‌ ధర కేజీ రూ.పదికి పడిపోయింది. రైతులు చాలాచోట్ల కోళ్లను ఉచితంగా పంపిణీ చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. లాక్‌డౌన్‌ సమయంలో ఎగుమతులు లేకపోవడం, కోళ్లకు మేత అందని పరిస్థితుల్లో పౌల్ట్రీ రైతులు ఉక్కిరిబిక్కిరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం కలగజేసుకుని రైతు అనుబంధ పరిశ్రమలను కాపాడేందుకు పలు చర్యలు తీసుకుంది. ఎగుమతులకు అనుమతులు ఇవ్వడంతో పాటు మేత అమ్మకాలకు పచ్చజెండా ఊపడంతో పరిశ్రమలు కోలుకున్నాయి. పెరిగిన కోడి మాంసం ధరలు వినియోగదారులకు భారంగా మారినా, వరుస సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతున్న రైతులకు మాత్రం ఊరటనిచ్చే అంశమని పలువురు అంటున్నారు.  

మరిన్ని వార్తలు