జనాన్ని తోలండి...

5 Dec, 2013 01:42 IST|Sakshi

 =సీఎం పర్యటనకు అధికారుల హైరానా
 =డ్వాక్రా సంఘాలు,విద్యార్థులపై గురి
 =బలవంతంగా బస్సుల స్వాధీనం
 =ప్రైవేటు పాఠశాలలకు సెలవులు
 =జనసమీకరణలో ఉద్యోగులు

 
విజయవాడ సిటీ, న్యూస్‌లై న్ : ‘పులిచింతల’ అధికారులకు చింతలే మిగులుస్తోంది. ఈ నెల ఏడున పులిచింతల ప్రాజెక్టును జాతికి అంకితం చేసేందుకు నగరంలో ఏర్పాటుచేసిన ముఖ్యమంత్రి బహిరంగసభను విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగం నానా హైరానా పడుతోంది. జిల్లాలోని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు దాదాపు లక్షమందిని సమీకరించి సభను జయప్రదం చేసే భారాన్ని అధికార యంత్రాంగంపై మోపారు. ఇటు ప్రొటోకాల్ ఏర్పాట్లతోపాటు అటు జనాన్ని తోలే కార్యక్రమం కూడా జిల్లా యంత్రాంగంపై పడింది. దీంతో వారు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు స్వయంగా రంగంలోకి దిగారు. ఆయన పర్యవేక్షణలో  రవాణా, విద్యాశాఖ, ఐకేపీ సిబ్బంది, వ్యవసాయాధికారులు, సిబ్బంది సభకు జనాన్ని తరలించే బాధ్యతను తమ భుజాలకెత్తుకున్నారు. జిల్లాలో రెండు వేల ప్రైవేటు పాఠశాలల బస్సులను బలవంతంగా లాక్కునే పనిలో రవాణా, విద్యాశాఖ అధికారులు ఉన్నారు. బుధవారం జిల్లా విద్యాశాఖ నుంచి వచ్చిన మౌఖిక ఆదేశాల మేరకు.. ఎంఈవోలు అన్ని మండలాల్లోని ప్రైవేటు పాఠశాలలకు నోటీసులు జారీ చేశారు.

శనివారం విజయవాడలో జరగనున్న సీఎం సభకు బస్సులు పంపాలని హుకుం వేశారు. ఆ రోజు పాఠశాలలన్నింటికీ సెలవలు ఇచ్చి  టీచర్లు, విద్యార్థులను కూడా తరలించాలని ఆదేశించారు. దీనికి సంబంధించి జిల్లాలోని అన్ని రెవెన్యూ డివిజన్లలో ఉప విద్యాశాఖాధికారులు మంగళ, బుధవారాల్లో ప్రైవేటు పాఠ శాలల ప్రిన్సిపాల్స్‌తో  సమావేశాలు కూడా నిర్వహించారు. విద్యాశాఖ అధికారులు మండలానికి ఇద్దరు చొప్పున ఉపాధ్యాయులను నియమించి బస్సుల నంబర్లతోపాటు హాజరయ్యే వారి సంఖ్యను కూడా నమోదు చేయాలని ఆదేశించారు.
 
 డ్వాక్వా సంఘాలపై ఆశలు
 జిల్లాలో పంటలు మునిగి పుట్టెడు కష్టంలో ఉన్న రైతులు ఈ సభకు పెద్దగా వచ్చే అవకాశం లేకపోవడంతో డ్వాక్వా సంఘాలపై అధికార యంత్రాంగం అశలు పెట్టుకుంది. డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో ఐకేపీ సిబ్బంది గ్రామగ్రామాన తిరిగి మహిళలను సమీకరించాలని ఆదేశాలందాయి. ఎంపీడీవోలు కూడా తమ వంతు ప్రయత్నాన్ని గ్రామ కార్యదర్శులతో చేస్తున్నారు.  వ్యవసాయ అధికారులు గ్రామాల్లో తిరిగి ఆదర్శ రైతులు, రైతు సంఘాల ద్వారా జనాన్ని సమీకరించేపనిలో పడ్డారు.
 
 సర్వత్రా నిరసన
 సీఎం సభకు అధికారులు బలవంతంగా జనాన్ని తరలించే కార్యక్రమంపై ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. సమైక్యాంధ్ర ఉద్యమం ప్రభావంతో ఈ విద్యాసంవత్సరంలో పాఠశాలలు సరిగా జరగలేదని, అనవసరంగా సెలవు ఇవ్వడం తమ వల్ల కాదని విద్యాసంస్థల ప్రతినిధులు అంటున్నారు. తమ బస్సులను కూడా పంపబోమని కొందరు ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు మొండికేస్తున్నట్లు సమాచారం.  
 

మరిన్ని వార్తలు