సేవాపన్ను ఎగవేతదారులు తప్పించుకోలేరు | Sakshi
Sakshi News home page

సేవాపన్ను ఎగవేతదారులు తప్పించుకోలేరు

Published Thu, Dec 5 2013 1:36 AM

సేవాపన్ను ఎగవేతదారులు తప్పించుకోలేరు

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సేవా పన్ను చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్న వారిని గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉందనీ, ఇవాళ కాకపోయినా రేపైనా సేవా పన్ను చెల్లించాల్సిందేననీ, దీన్ని నుంచి ఎవరూ తప్పించుకోలేరని కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం హెచ్చరించారు. ఇవాళ్టికి తప్పించుకోగలరు, మహా అయితే ఒక నెలా లేదా ఇంకో సంవత్సరం ఉండగలరు,  ఆ తర్వాతైనా సేవా పన్ను పరిధిలోకి రావాల్సిందేనన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛంద సేవా పన్ను ప్రోత్సాహక పథకం (వీసీఈఎస్)పై అవగాహన పెంచేందుకు బుధవారం ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిదంబరం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2007 నుంచి ఇప్పటి వరకు సేవా పన్ను చెల్లించనివారు ఎటువంటి పెనాల్టీలు లేకుండా కట్టడానికి ఇదొక చక్కటి అవకాశామని, ఇలా స్వచ్ఛందంగా ప్రకటించిన వారిపై ఎటువంటి వేధింపులు, కేసులు ఉండవని ఆయన హామీ ఇచ్చారు.
 
 డిసెంబర్ 31లోగా వీసీఈఎస్ కింద నమోదు చేసుకొని ఎలాంటి పెనాల్టీలు, అధిక రుసుములు లేకుండా పాత బకాయిలను కిస్తీలలో చెల్లించుకునే వెసులుబాటును కేంద్రం కల్పిస్తోంది. చెల్లించాల్సిన మొత్తంలో సగం డిసెంబర్ 31లోగా మిగిలిన మొత్తం జూన్ 30లోగా ఎలాంటి పెనాల్టీ లేకుండా చెల్లించవచ్చన్నారు. అదే వడ్డీతో అయితే డిసెంబర్ 31, 2014 వరకు గడువు ఉంది. ఈ స్కీం కింద ఇప్పటి వరకు 9,000 మంది దరఖాస్తు చేసుకున్నారని, ఇందులో కేవలం 107 కేసులు మాత్రమే తిరస్కరించడం జరిగిందన్నారు. దాదాపు 17 ఏళ్ళ తర్వాత ఇటువంటి పథకాన్ని ప్రవేశపెట్టామని దీన్ని అందరూ వినియోగించుకోవాలని చిదంబరం పేర్కొన్నారు. సేవా పన్ను వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లించకుండా ఉన్న 15 మందిపై న్యాయపరంగా చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం సేవా పన్నుకింద 17 లక్షల మంది అసెస్సీలు నమోదై ఉంటే అందులో కేవలం ఏడు లక్షల మంది మాత్రమే పన్ను చెల్లిస్తున్నట్లు చిదంబరం పేర్కొన్నారు.
 

Advertisement
Advertisement