రైతు కళ్లలో ఆనందమే లక్ష్యం

9 Jul, 2019 08:18 IST|Sakshi
రైతు సదస్సులో మాట్లాడుతున్న మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి  

60 శాతం రైతులకు పగటి పూట 9 గంటలు ఉచిత విద్యుత్‌

వచ్చే మార్చికల్లా మిగతా 40 శాతం రైతులకు కూడా

రైతు దినోత్సవ సభలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

సాక్షి, ఒంగోలు సబర్బన్‌: రైతు కళ్లలో ఆనందం చూడడమే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. స్థానిక దక్షణ బైపాస్‌లోని పాత జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో సోమవారం రైతు దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ రాష్ట్రంలో 60 శాతంగా ఉన్న రైతులకు ఎంత చేసినా తక్కువేనన్నారు. ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో పొందుపరిచిన రైతు భరోసా పథకాన్ని ఈ ఏడాది అక్టోబర్‌ 15 నుంచి రైతులకు ఏడాదికి రూ.12,500 చొప్పున అందిస్తామన్నారు. రైతుల కష్టాలను పాదయాత్రలో స్వయంగా తెలుసుకున్న జగన్‌మోహన్‌నెడ్డి వడ్డీ లేని రుణాలు ఇచ్చేందుకు నిర్ణయించారన్నారు.

వ్యవసాయానికి పగటి పూట నిరంతరాయంగా 9 గంటల విద్యుత్‌ ఇవ్వాలని నిర్ణయించామని, కానీ విద్యుత్‌ లైన్లు సక్రమంగా లేకపోవటంతో మొదటి విడతగా 60 శాతం రైతులకు ఇస్తున్నామని, మిగిలిన 40 శాతం మంది రైతులకు వచ్చే ఏడాది మార్చికల్లా లైన్లు మరమ్మత్తులు చేసి పూర్తి స్థాయిలో అందిస్తామన్నారు. విద్యుత్‌ లైన్ల మరమ్మత్తులకు మొత్తం రూ.1,500 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. అయినా ముఖ్యమంత్రి వెనకాడకుండా ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. ఆక్వా రైతులను ఆదుకునేందుకు యూనిట్‌ను రూ.1.50 ఇచ్చేందుకు నిర్ణయించి ప్రకటించారన్నారు. దీంతో ప్రభుత్వంపై రూ.720 కోట్ల అదనపు భారం పడుతుందన్నారు. కలెక్టర్‌ పోలా భాస్కర్‌ మాట్లాడుతూ రైతులను ఆదుకోవటంలో ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు.

రైతులు పండించిన పంటను నిల్వ చేసుకోవటానికి కోల్డ్‌ స్టోరేజీలు, గోదాముల నిర్మాణానికి కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వివరించారు. జిల్లాలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ప్లాంట్‌ నెలకొల్పేందుకు ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌ రూపొందిస్తున్నామన్నారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పోలవరం ప్రాజెక్టుపై ప్రత్యేకంగా దృష్టి సారించమని చెప్పారని, అది త్వరగా పూర్తయితే జిల్లాలో సాగు, తాగు నీటికి ఇబ్బందులు తొలుగుతాయన్నారు. 2020 జూన్‌ నాటికి మొదటి టన్నెల్‌ పూర్తి చేసి నీటి విడుదలకు రంగం సిద్ధం  చేస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పీవీ రామమూర్తి మాట్లాడుతూ సాధారణ పంటల్లో అంతర పంటల సాగు ఎంతో మేలు చేస్తుందన్నారు. కార్యక్రమానికి జిల్లా పరిశ్రమల శాఖ జీఎం జి.గోపాల్‌ అధ్యక్షత వహించారు. సమావేశంలో జిల్లా అధికారులు వి.రవీంద్రనాథ్‌ ఠాగూర్, ఏఎంసీఝేడీ రాఘవేంద్ర కుమార్, ఏపీఎంఐపీ పీడీ రవీంద్రబాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


రైతులను సన్మానిస్తున్న మంత్రి, కలెక్టర్‌ తదితరులు 
 
ఉత్తమ రైతులకు సన్మానం
ఉత్తమ రైతులను మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఘనంగా సన్మానించారు. వ్యవసాయ అనుబంధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నలుగురు రైతులను మెమోంటో, ప్రసంశాపత్రంతో పాటు శాలువాతో సత్కరించారు. పశుసంవర్ధక శాఖ తరుఫున పశుపోషణలో, పాడి అభివృద్ధిలో ప్రతిభ కనబరిచిన పశుపోషకుడు కోటా వెంకట్రామిరెడ్డి, వ్యవసాయంలో ప్రతిభ కనబరిచిన బత్తుల చంద్రశేఖర రెడ్డి, ఉద్యాన పంటల్లో ప్రతిభ కనబరిచిన బలగాని బ్రహ్మయ్య, రొయ్యలు, చేపల పెంపకంలో ప్రతిభ కనబరిచిన మున్నంగి రాజశేఖర్‌లు ఉన్నారు. అనంతరం వైఎస్‌ఆర్‌ పింఛన్ల కానుక సందర్భంగా పింఛన్లు పంపిణీ చేశారు. రైతులకు భూసార పరీక్షల కార్డులను పంపిణీ చేశారు. ఉన్నత పాఠశాలల విద్యార్థినులకు సైకిళ్లు అందజేశారు. అనంతరం ఆక్వా రైతులు మంత్రి బాలినేని సన్మానించారు. ఆక్వా రైతులకు ప్రభుత్వం యూనిట్‌ ధరను తగ్గించినందుకుగాను కృతజ్ఞతగా శాలువా కప్పి సన్మానించారు.  కలెక్టర్‌ పోలా భాస్కర్‌ను కూడా ఆక్వా రైతులు సన్మానించారు.

మరిన్ని వార్తలు