వైఎస్సార్‌ సీపీ జెండా కట్టినందుకు..

11 Jan, 2019 09:13 IST|Sakshi
ఇంటి స్థలంలో రహదారి వేస్తున్న దృశ్యం

దళితులపై చింతమనేని కక్ష సాధింపు

అడ్డుకున్న వారిపై పోలీసులతో దౌర్జన్యం

తీవ్రంగా గాయపడిన మహిళ

సాక్షి, పెదపాడు: దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ఆగడాలకు అడ్డు లేకుండా పోతోంది. వైఎస్సార్‌ సీపీ జెండాను ఇంటిపై కట్టినందుకు ఓ వ్యక్తిపై కక్ష సాధింపునకు దిగారు. ప్రభుత్వ భూమిగా సాకు చూపి, ఆ వ్యక్తి ఇంటి స్థలంలో నుంచి రోడ్డు వేయించే పనికి పూనుకున్నారు. అడ్డుపడిన మహిళను పోలీసులు దౌర్జన్యంగా తోసివేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. 

వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం నాయుడుగూడెం గ్రామానికి చెందిన పిట్టా విజయ్‌కుమార్, పిట్టా స్టీఫెన్‌కు తాతల కాలం నుంచి సంక్రమించిన స్థలంలో ఇల్లు కట్టుకున్నారు. వారు వైఎస్సార్‌ సీపీపై అభిమానంతో ఇంటిపై వైసీపీ జెండా కట్టారు. దీంతో  భగ్గుమన్న ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అనుచరవర్గం.. ఆ స్థలం ప్రభుత్వానిదంటూ.. అధికారులపై ఒత్తిడి తెచ్చి  రహదారి నిర్మించేందుకు పూనుకున్నారు.  అందుకోసం అధికారులు ఇంటిని తొలగించేందుకు సిద్ధం కావడంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కొఠారు రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే మరడాని రంగారావు తదితరులు  ఘటనా స్థలానికి వెళ్లి ఎమ్మార్వోతో చర్చలు జరిపారు. రెండురోజులు గడువు ఇచ్చిన అధికారులు గురువారం తెల్లవారుజామున భారీ పోలీసు బందోబస్తుతో రంగంలోకి దిగి ఇంటి తొలగింపునకు చర్యలు చేపట్టారు.

తొలగింపు పనులను అడ్డుకున్న విజయకుమార్‌ భార్య విజయకుమారిని పోలీసులు నెట్టివేయడంతో కిందపడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఏలూరు పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి కోటగిరి శ్రీధర్, దెందులూరు నియోజకవర్గ ఇన్‌చార్జి కొఠారు అబ్బయ్య చౌదరి, అప్పనప్రసాద్, నియోజకవర్గ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు మొండెం ఆనంద్, రాష్ట్ర ఎస్‌సీ సెల్‌ నాయకుడు పల్లెం ప్రసాద్‌ ఆమెను పరామర్శించారు.  అనంతరం వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ దళితులపై ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడటం హేయమైన చర్య అని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని కక్షసాధింపు చర్యలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు.

>
మరిన్ని వార్తలు