ఖైదీ మలుపు తిప్పింది

14 Nov, 2017 09:09 IST|Sakshi

నృత్య దర్శకుడు శివశంకర్‌ ‘సాక్షి’తో చిట్‌చాట్‌ 

తాడేపల్లిగూడెం : ఆయన కనురెప్పలు కదిపితే నృత్యం. ఆయన అభినయం ఆనందమయం. ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేయడంలో ఆయనకు ఆయనే సాటి. ఎన్టీఆర్, ఏఎన్నార్‌తో ఆకట్టుకునే స్టెప్పులేయించారు. ఆనాటి నుంచి నిన్నటి బాహుబలి వరకూ 1,400 సినిమాలకు నృత్య దర్శకత్వం వహించారు. 45ఏళ్ల సినీపయనంలో ఎన్నో అనుభూతులు.. వాటిని ‘సాక్షి’తో పంచుకున్నారు ప్రముఖ నృత్య దర్శకుడు శివశంకర్‌. పట్టణంలో శ్రీ డ్యాన్స్‌ అకాడమీ దశమ వార్షికోత్సవం, బాలల దినోత్సవం కార్యక్రమాలలో పాల్గొనడానికి వచ్చిన ఆయన మంగళవారం నాట్యరత్న బిరుదుతో సత్కారం అందుకోనున్నారు.ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం ‘సాక్షి’తో చిట్‌చాట్‌ చేశారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. 

పుట్టింది మద్రాసులో. నటరాజ్‌ శంకుంతల వద్ద  న్యాట ఆరంగేట్రం. సినీ నృత్యానికి సలీం మాస్టర్‌ గురువు. కురివికుడు అనే తమిళ సినిమాతో సినీ నృత్యదర్శకత్వానికి శ్రీకారం. తెలుగులో ఖైదీతో ఆరంగేట్రం. ఇది నా   తొలి సినీ అడుగులు. ఖైదీలో రగులుతుంది మొగలి పొద పాటకు దర్శకత్వం వహించే అవకాశం అనుకోకుండా దక్కింది. అది నా సినీ నృత్య జీవితాన్ని మలుపు తిప్పింది. ఎన్టీఆర్, ఏఎన్నార్‌ నుంచి నేటితరం నాగశౌర్య వరకూ అందరికీ నృత్య దర్శకత్వం చేసే అవకాశం దక్కింది. పలు భాషల్లో 1,400 సినిమాలు చేశా.  అరుంధతి సినిమాలో కంపోజ్‌ చేసిన డ్రమ్‌ డ్యాన్సుకు డాక్టరేట్‌ వచ్చింది  మగధీరలో ధీర..ధీర.. పాటకు జాతీయ అవార్డు వచ్చింది. 

నటునిగా కూడా గుర్తింపు తెచ్చుకోవాలి
నటునిగా కూడా గుర్తింపు తెచ్చుకోవాలనేది నా కోరిక. తుది శ్వాసనూ నృత్యం చేస్తుండగానే వదలాలి అనేది ఆకాంక్ష. తమిళ సినిమాలలో క్యారెక్టర్స్‌ చేస్తున్నా. సూర్య, రమ్యకృష్ణ, బ్రహ్మానందంతో కలిపి ఫుల్‌లెంగ్త్‌ క్యారెక్టర్‌ చేస్తున్నా. కన్నడలో కురుక్షేత్రం సినిమాలో పాత్రపోషిస్తున్నాను. 15 సినిమాలు చేతిలో ఉన్నాయి. తెలుగులో  ఎక్కువ సినిమాలు చేయాలి. సెమీ క్లాసికల్‌ నృత్యానికి ప్రస్తుతం పెద్దపీట వేస్తున్నారు. 
 

మరిన్ని వార్తలు