చిత్ర విశాఖ

21 Jan, 2014 02:44 IST|Sakshi
  • విస్తరిస్తున్న శిక్షణ తరగతులు
  •  నటన, దర్శకత్వ శాఖల్లో  నిపుణత కోరుతున్న ఔత్సాహికులు
  •  
     ఏయూ క్యాంపస్, న్యూస్‌లైన్: లఘు చిత్రాల హవా.. టీవీ సీరియల్స్ జోరు.. సినీ నిర్మాణ కేంద్రంగా విశాఖ ఎదుగుతున్న తీరు.. ఇవీ ప్రస్తుతం ఔత్సాహిక కళాకారులను ఊరిస్తున్న అంశాలు. ఇటీవల కాలంలో నగరంలో శిక్షణ తరగతులు విరివిగా జరుగుతున్నాయి. తమలో దాగివున్న కళాకారుడిని బయటి ప్రపంచానికి పరిచయం చెయ్యాలని, సృజనాత్మకతను ప్రదర్శించాలని, వెండి తెరపై వెలిగిపోవాలని ఎందరో తపన పడుతున్నారు.

    ఈ కలలు నెరవేరాలంటే ఒక్క చాన్స్ కావాలి. ఇందుకోసం ఎంతో నిపుణత, పరిణతి సాధించాలి. బంగారానికి మెరుగుపెట్టినట్టు వీరి ప్రతిభకు శిక్షణ కూడా తోడైతే మరింతగా రాణించడానికి అవకాశం ఉంటుంది. సహజసిద్ధమైన ప్రకృతి సోయగాలు, ఎత్తయిన పచ్చని కొండలు, లోయలు, అందాలొలికే అనంత సాగరం.. విశాఖ జిల్లాకు దేవుడిచ్చిన వరాలు. చూడచక్కని లొకేషన్లతో అనేక ప్రాంతాలు చిత్ర నిర్మాణానికి అనువుగా ఉంటాయి.

    చిత్ర పరిశ్రమకు రాజధానిగా ఎదుగుతున్న ఈ సుందర నగరంపై వర్ధమాన నటీనటుల ఆశలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. అందుకే ఇటీవలి కాలంలో దర్శకత్వం, నటన తదితర అంశాలలో శిక్షణ అందించే ప్రత్యేక శిబిరాలు ఏర్పాటవుతున్నాయి. నగరం నుంచే కాకుండా గిరిజన ప్రాంతమైన పాడేరు, శ్రీకాకుళం, విజయనగరం, ఉభయ గోదావరి జిల్లాలవాసులు సైతం ఇక్కడ జరుగుతున్న శిక్షణ తరగతులకు హాజరవుతున్నారు.
     
     కాలానుగుణంగా కోర్సులు ప్రారంభిస్తాం
     పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నిపుణులను తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే డిజిటల్ ఫిల్మ్ మేకింగ్‌పై సర్టిఫికేట్ కోర్సును అందిస్తున్నాము. త్వరలో దర్శకత్వం, నటన అంశాలపై కూడా కోర్సులను ప్రారంభించే ఆలోచన ఉంది.
     - ఆచార్య జి.ఎస్.ఎన్.రాజు, ఉప కులపతి
     
     ప్రొడక్షన్ రంగంలో అడుగుపెడతా..
     భవిష్యత్తులో ప్రొడక్షన్ రంగంలో రాణిం చాలని ఆశిస్తున్నాను. ప్రస్తుతం ఏయూలో ఇంజనీరింగ్ చదువుతున్నాను. అవగాహన కోసం శిక్షణ శిబిరానికి హాజరయ్యాను. ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటున్నాయి.
     - ఎం.చేతన్
     
     వారధిగా నిలిచే సంస్థలు కావాలి
     విశాఖ కేంద్రంగా నిపుణులను తీర్చిదిద్దే కేంద్రాలు ఏర్పాటు చేయాలి. సినీ అవకాశాల గురించి ఆర్టిస్టులకు, స్థానిక కళాకారుల ప్రతిభ గురించి చిత్ర పరిశ్రమకు సమాచారం అందిస్తూ వారధిగా నిలిచే సంస్థలు ఏర్పాటు కావాలి.  
     - మీగడ శివశ్రీ, దర్శకుడు
     
     అవగాహన మాత్రమే అందించగలుగుతున్నాం..
     భాగ్యనగరంలో మూడు సంవత్సరాల శిక్షణలో చెప్పే విషయాలను ఇలాంటి శిబిరాల్లో కేవలం ఐదారు రోజులలో వివరించాల్సి వస్తోం ది. దీంతో వీరికి స్థూలంగా అవగాహన మాత్రమే అందించగలుగుతున్నాం. ఇది పునాదిగా ప్రతిభను మెరుగుపరచుకోవాలి.
     - నటరాజమూర్తి, ప్రిన్సిపాల్, మధు ఫిలిం ఇనిస్టిట్యూట్, హైదరాబాద్
     
     నటన, దర్శకత్వ శాఖల్లో శిక్షణ
     ఈ శిబిరాల్లో పాల్గొంటున్న ఔత్సాహికులు నటన, దర్శకత్వ శాఖల్లో శిక్షణ తీసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి శిబిరాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగడానికి, లోతైన అధ్యయనానికి శిక్షణ సంస్థలు శాస్వత ప్రాతిపదికన ఏర్పాటైతే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రముఖ శిక్షకుడు సత్యానంద్ ఒక్కరే చాలాకాలంగా విశాఖలో నటులను తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విధంగా పూర్తిస్థాయిలో శిక్షణ అందించే కేంద్రాలు నగరంలో ఏర్పడలేదు.
     
     మినీ థియేటర్ నిర్మించాలి
     ప్రభుత్వం తరపున లఘు చిత్రాలను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకోవాలి. మినీ థియేటర్ నిర్మించి, నగరంలో చిత్రీకరించిన షార్ట్ ఫిల్మ్స్‌ను ప్రదర్శించాలి. తద్వారా మంచి చిత్రాలకు ఆదరణ లభిస్తుంది.
     - ఆచార్య పి.బాబీవర్ధన్, ఏయూ జర్నలిజం విభాగం
     

మరిన్ని వార్తలు