సినీ నిర్మాత కోసం.. సీసీఎస్‌ వేట! అసలేం జరిగిందంటే?

3 Nov, 2023 07:53 IST|Sakshi

ఎఫ్‌ఎంసీజీ కేసులో వాంటెడ్‌గా అట్లూరి నారాయణరావు

కేసు మాఫీ పేరుతో నిందితుల నుంచి రూ.కోటి వసూలు

ఖమ్మంలో ఓ న్యాయవాది ద్వారా ఐపీ పిటిషన్‌ దాఖలు

విచారణలో వెల్లడించిన ప్రధాన నిందితుడు రాంబాబు

సాక్షి, హైదరాబాద్‌: విజయవాడలో చాక్లెట్ల వ్యాపారంతో మొదలు పెట్టి, హైదరాబాద్‌లో ఫాస్ట్‌ మూవింగ్‌ కంజ్యూమర్‌ గూడ్స్‌ (ఎఫ్‌ఎంసీజీ) దందా స్థాపించి, మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌ (ఎంఎల్‌ఎం) దందాలోకి దిగి, డిపాజిట్ల పేరుతో వందల మంది నుంచి రూ.540 కోట్లు వసూలు చేసిన కేసులో తెలుగు సినీ నిర్మాత అట్లూరి నారాయణ రావు నిందితుడిగా మారారు. ఈ స్కామ్‌ సూత్రధారి రాంబాబు విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా నారాయణరావును మూడో నిందితుడిగా చేర్చిన సీసీఎస్‌ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

బుధవారం ఈ కేసులో అరెస్టు అయిన రాంబాబు, పెనుమత్స కృష్ణం రాజులను తదుపరి విచారణ నిమిత్తం కోర్టు అనుమతితో తమ కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి గురువారం నాంపల్లి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఎఫ్‌ఎంసీజీ దందా చేసేందుకు రాంబాబు రాధారామ్‌ ఏజెన్సీస్‌ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశాడు. ఇద్దరు నిందితులు తమ వ్యాపార విస్తరణ కోసమంటూ ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించారు. వీరికి 6 నుంచి 13 శాతం వడ్డీతో డబ్బు తిరిగి ఇస్తామని హామీ ఇచ్చారు. ఓ దశలో వ్యాపారంలో వచ్చే లాభాలు పంచడానికి, వడ్డీలు చెల్లించడానికి సరిపోలేదు.

దీంతో తమ వద్ద కొత్తగా పెట్టుబడి పెట్టే వారి సొమ్మును పాత ఇన్వెస్టర్లకు చెల్లించడం మొదలెట్టారు. చివరకు చెల్లింపులు చేయలేక డిపాజిటర్లను మోసం చేశారు. తమ కోసం బాధితులు తిరుగుతున్నారని, పోలీసులకు ఫిర్యాదు చేశారనే విషయం తెలియడంతో రాంబాబు తన కంపెనీ చార్టెట్‌ అకౌంటెంట్‌ ద్వారా అట్లూరి నారాయణరావును సంప్రదించాడు. సినీ నిర్మాతగా ఉన్న అతను తనకు రాజకీయాలతో పాటు పోలీసు విభాగంలో చాలా పలుకుబడి ఉందని, అది వినియోగించి కేసు లేకుండా చేస్తానని రాంబాబుకు హామీ ఇచ్చాడు.

ఇందుకుగాను రూ.20 కోట్లు డిమాండ్‌ చేశాడు. బేరసాల తర్వాత రూ.2 కోట్లకు అంగీకరించిన నారాయణ రావు అడ్వాన్స్‌గా రూ.10 లక్షలు తీసుకున్నాడు. ఆపై కొన్ని ప్రయత్నాలు చేసినా నిందితులకు కేసు విషయంలో ఎలాంటి సహాయం చేయలేకపోయాడు. దీంతో ఇన్సాల్వెన్సీ పిటిషన్‌ (ఐపీ) దాఖలు చేసి బయటపడదామని రాంబాబుకు సలహా ఇచ్చాడు. అతడు అంగీకరించడంతో ఎవరికీ ఎలాంటి సమాచారం లేకుండా ఈ కథ నడపాలని నిర్ణయించుకున్నాడు. విజయవాడతో పాటు నగరంలోనే ఈ స్కామ్‌ మొత్తం జరిగింది. బాధితులు సైతం ఇక్కడి వారే ఉన్నారు.

అయితే నారాయణరావు మాత్రం ఖమ్మం కోర్టులో అక్కడి న్యాయవాదితో ఐపీ దాఖలు చేయించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాడు. ఓపక్క ఈ పనులు చేస్తూనే మరోపక్క రాంబాబు నుంచి వీలైనంత మొత్తం వసూలు చేసుకోవాలని భావించాడు. అతడి నుంచి రూ.కోటి విలువైన బంగారు ఆఖరణాలు తీసుకున్న నారాయణరావు వాటిని పాతబస్తీలో కరిగించి, రూ.90 లక్షలకు అమ్మేసి సొమ్ము చేసుకున్నాడు. నిందితులను అరెస్టు చేసిన సీసీఎస్‌ పోలీసులు లోతుగా విచారించడంతో అట్లూరి నారాయణ రావు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ కేసులో ఇతడిని మూడో నిందితుడిగా చేర్చిన అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇందుకుగాను ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు.

మరిన్ని వార్తలు