ఈ థియేటర్లకు ఏమైంది?

29 Jul, 2018 13:21 IST|Sakshi

సినిమాకు వెళ్తే ప్రేక్షకుడికి తప్పదు భారీ మూల్యం

పెరిగిన టికెట్ల రేట్లు 

అధిక ధరలకు తినుబండారాల విక్రయాలు

నగరవాసిని నిలువు దోపిడీ చేస్తున్న థియేటర్ల యాజమాన్యాలు

నోరు మెదపని అధికారులు 

మధురవాడ ప్రాంతానికి చెందిన రాజేష్‌ తన కుటుంబ సభ్యులతో కలసి సీఎంఆర్‌ సెంట్రల్‌లోని మల్టీప్లెక్స్‌  థియేటర్‌కు వెళ్లాడు. నలుగురు సభ్యులకు రూ.150 చొప్పున ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేశాడు. ట్యాక్స్‌తో కలిపి రూ. 687 అయింది. విరామ సమయంలో బయటకు పిల్లలను తీసుకుని వచ్చి రెండు పాప్‌కార్న్‌లు, రెండు కూల్‌ డ్రింక్‌లు ఇవ్వమన్నాడు. వాస్తవానికి వాటి ధర రూ.200కు మించి ఉండదని రాజేష్‌ ఊహించాడు. కానీ రూ.900 బిల్లు వేసి అతని చేతిలో వాటిని పెట్టారు. ఒక్కసారిగా కంగుతిన్న రాజేష్‌ పిల్లలను బాధపెట్టలేక ఆ సమయానికి డబ్బులు చెల్లించేశాడు. ఇది ఆయన ఒక్కడికే కాదు.. మల్టీప్లెక్స్‌ థియేటర్లకు వినోదం కోసం వెళుతున్న ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ఎదురవుతున్న అనుభవం. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న తనకు వచ్చే జీతంలో 15 శాతం ఒక్క సినిమాకు ఖర్చు అయ్యిందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

జగదాంబ ప్రాంతంలోని ఓ సినిమా థియేటర్‌కు లక్ష్మణ్‌ తన భార్యతో సినిమాకు వెళ్లాడు. సినిమా టికెట్‌ రూ.118( ఇద్దరి రూ.236), బైక్‌ పార్కింగ్‌ రూ.20, కూల్‌ డ్రింక్‌రూ.60 (ఇద్దరికి రూ.120), సమోసాలు రూ.30 (నాలుగు), పాప్‌కార్న్‌ రూ.30 (ఇద్దరికి రూ.60) ఖర్చు అయింది. రూ. 500 నోటుతో వెళ్లిన ఆయనకు తిరిగి వచ్చేటప్పుడు కాస్తా చిల్లర మిగిలింది. సినిమా పూర్తయ్యేలోగా ఆయనకు సినిమా కనిపించింది. 

సినిమా ప్రేక్షకుడి ప్రస్తుత పరిస్థితిని సంఘటనలే తేటతెల్లం చేస్తున్నాయి. టికెట్ల ధరలతో పాటు తినుబండారాల విషయంలో ప్రేక్షకుడు నిలువునా దోపిడీకి గురవుతున్నాడు. పైగా జీఎస్టీ బాధుడు. ఎమ్మార్పీకే తినుబండారాలు విక్రయించాలన్న అధికారుల ఆదేశాలు ఎక్కడా అమలు కావడం లేదు. 

బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): అలసిన మనసుకు సాంత్వన చేకూర్చేది వినోదం. అందులోనూ ప్రతి ఒక్కరినీ రంజింపజేసే మాధ్యమం సినిమా. అలాంటి సినీ వినోదం మరింత ఖరీదైపోయింది. సింగిల్‌ థియేటర్ల స్థానాన్ని మల్టీప్లెక్స్‌లు ఆక్రమిస్తున్న తరుణంలో సగటు ప్రేక్షకుడిని దోపిడీ చేయడమనేది సర్వసాధారణమైపోయింది. పార్కింగ్‌ కష్టాలు మొదలుకొని, టికెట్‌ ధరలు, ఫుడ్‌ అండ్‌ బేవరేజెస్‌ వరకు చుక్కలు కనిపిస్తున్నాయి.

ఐదుగురు సభ్యులున్న ఓ కుటుంబం సినిమాకు సొంత కారులో వెళ్లిరావాలంటేనే రూ.2వేల వరకు ఖర్చవుతున్నాయి. అందులో టికెట్లకు రూ.600 అయితే, మిగిలినదంతా ఫుడ్‌ అండ్‌ బేవరేజెస్‌కే! అలాగని ఇంటి నుంచి బిస్కెట్‌ ప్యాకెట్టో, వాటర్‌ బాటిలో తీసుకువెళ్దామంటే థియేటర్‌ డోర్‌ దగ్గరే ఆపేస్తున్నారు. దాంతో రెండున్నర గంటల వినోదానికి వేలల్లో వదిలించుకోవాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితి నుంచి ఉపశమనం కలిగిస్తూ ముంబై హైకోర్టు మల్టీప్లెక్స్‌ల్లోకి స్నాక్స్‌ తీసుకువెళ్లేందుకు అనుమతించాల్సిందేనని ఆదేశించింది. మార్గదర్శకాలు రూపొందించాలని సూచించడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు ఒకటి నుంచి మల్టీప్లెక్స్‌ల్లో బయట ఫుడ్‌ అనుమతించాలని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో సినీ ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని థియేటర్లలో బయట ఫుడ్‌ అనుమతించాలని ప్రేక్షకులు కోరుతున్నారు. 

నగరంలోని కొన్ని థియేటర్లలో ప్రత్యేకంగా చిప్స్‌ ప్యాకెట్లను రూ.10 నుంచి విక్రయిస్తున్నారు. ఇవి బయట మార్కెట్‌లో కనిపించవు. వాటి నాణ్యతను బట్టి చూస్తే రూ.5 కూడా ఎక్కువే. నాణ్యత లేని తినుబండారాలను నచ్చిన ధరకు అమ్ముతూ ప్రేక్షకుల జేబులను ఖాళీ చేస్తున్నారు. సీఎంఆర్‌ లాంటి అతి పెద్ద మాల్‌లో మనకు నచ్చిన పాప్‌కార్న్‌ ప్లేవర్‌ రూ.25 మాత్రమే. కానీ సినిమా థియేటర్లలో రూ.30(మల్టీప్లెక్స్‌లో రూ.60 నుంచి). నగరంలో ఎక్కడ తీసుకున్న సమోసా ధర రూ.5 నుంచి రూ.7. మల్టీప్లెక్స్‌లో మాత్రం వీటి ధర ఒక్కొక్కటి రూ.50. ఎగ్‌ పఫ్‌ ప్రముఖ ఫుడ్‌ జోన్‌ల్లో రూ.15 దాటదు. కానీ సినిమా థియేటర్లలో రూ. 30. కేఎఫ్‌సీలో రూ.80లకు మీడియం సైజ్‌ కూల్‌ డ్రింక్‌తో పాటు ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ వస్తుంది. కానీ థియేటర్లలో కేవలం ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ రూ.60కు అమ్ముతున్నారు. స్వీట్‌ కార్న్‌ నగరంలోని ఎక్కడైనా రూ.10 నుంచి రూ.20 వరకు ఉంటుంది. కాని సినిమా థియేటర్లలో మాత్రం రూ.50. మిగతా తినుబండారాలు కూడా ఇలానే విక్రయిస్తున్నారు. 

ఫుడ్‌ అండ్‌ బేవరేజెస్‌ మీదే అధికాదాయం 
ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పు మల్టీప్లెక్స్‌లు, థియేటర్లకు పెనుభారంగా పరిణమించే అవకాశముందన్నది మల్టీప్లెక్స్‌ మేనేజర్ల మాట. మల్టీప్లెక్స్‌ల ఆదాయంలో 30 శాతం ఫుడ్‌ అండ్‌ బేవరేజెస్‌ అమ్మకాల ద్వారానే లభిస్తోంది. ఈ కారణం వల్లే ఆదాయం మరింత పెంచుకోవడానికి లైవ్‌ కిచెన్‌ కౌంటర్లు, ఎఫ్‌ అండ్‌ బీ మెనూ వంటి కార్యక్రమాలను చేపడుతు న్నాయి. ఫిక్కీ–కేపీఎంజీ 2017లో విడుదల చేసిన అధ్యయనంలోనూ ఎఫ్‌ అండ్‌ బీ ఆదాయం ద్వారానే మల్టీప్లెక్స్‌లు తమ ఆదాయం స్థిరంగా వృద్ధి చేసుకుంటున్నాయని వెల్లడించింది. 

కోర్టు తీర్పు ఇచ్చినా మారని యాజమన్యాలు 
సినిమా థియేటర్లలో ప్రత్యేక ప్యాకేజీల ధరలతో తినుబండారాలను గతంలో విక్రయించేవారు. దీనిపై వినియోగదారుల కోర్టు గతేడాది నవంబర్‌లో ఆగ్రహం వ్యక్తం చేసింది. 2018 జనవరి నుంచి అన్ని థియేటర్లలో సాధారణ ధరలకే తినుబండారాలను విక్రయించాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్ని థియేటర్ల యాజమాన్యాలను పిలిచి సాధారణ ధరలకే తినుబండారాలు విక్రయించాలని సూచించారు. మొదట్లో వాటర్‌ బాటిల్‌ మాత్రమే ఎమ్మార్పీకి విక్రయించారు. తర్వాత కోర్టు, కలెక్టర్‌ ఆదేశాలకు తమకు వర్తించవు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. కాగా..వాణిజ్య సంస్థల్లో, సినిమా థియేటర్లలో పార్కింగ్‌ ఫీజు వసూళ్లకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు లేవని కోర్టు చెప్పినా.. థియేటర్ల యాజమాన్యాలు మాత్రం విచ్చలవిడిగా పార్కింగ్‌ ఫీజు వసూలు చేస్తున్నాయి. 

ఫిర్యాదులు చేస్తే తనిఖీలు చేస్తారటా.. 
ప్రేక్షకుల నుంచి థియేటర్ల యాజమాన్యాలు అడ్డంగా దోచుకుంటున్నా.. తమకు ఏం సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు ఉన్నతాధికారులు. సినిమా థియేటర్లపై నియంత్రణకు కలెక్టరేట్‌లో సీ సెక్షన్‌ ఉంది. వారు ఎప్పటికప్పుడు సినిమా థియేటర్లను తనిఖీ చేస్తుండాలి. యాజమాన్యాలు తమ కార్యాలయాలకు పిలిపించుకుని మాట్లాడటం తప్పితే.. ఇటీవల కాలంలో థియేటర్లను తనిఖీలు చేసిన దాఖలాలే లేవు. థియేటర్లలో జరుగుతున్న ధరల దోపిడీపై వివరణ అడిగితే.. వారు చెప్పే సమాధానం ‘మాకు ఎవరూ ఫిర్యాదు చేయలేదు’. ఫిర్యాదు చేస్తే అప్పుడు తనిఖీలు చేస్తాం అంటూ సెలవిస్తున్నారు. 

వారు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో థియేటర్ల యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ వ్యాపారుల ఆగడాలను కట్టడి చేయాల్సిన తూనికలు, కొలతల శాఖ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. సినిమా హాళ్లకు వెళ్లి తినుబండరాలను కొనేవారికి కళ్లు బైర్లు కమ్మే పరిస్థితి ఉందని అందరికీ తెలిసినా.. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.

ఇంత ధరలతో వినోదమా.. 
వినోదాన్ని ఎవరు కోరుకోరు. కానీ మరి ఇంత మూల్యానికా.. ధరలు పెంచడం వలనే పైరసీ చూడడానికి జనాలు ఇష్టపడుతున్నారు. సరసమైన ధరలు ఉంటే ప్రతీ ఒక్కరూ సినిమా థియేటర్లకు వచ్చే అవకాశం ఉంటుంది. టికెట్లు, తినుబండారాల ధరలు పెరిగితే సామాన్యుడు థియేటర్ల వైపు చూడడు.          
–దినేష్, ప్రేక్షకుడు

ఫిర్యాదు చేస్తే తనిఖీలు చేస్తాం
ఏ సినిమా థియేటర్లలో అయినా అధిక ధరలకు తినుబండారాలను విక్రయిస్తున్నట్టు 1100, 18004250082, 18004252977 నంబర్లకు ఫిర్యాదు చేస్తే తనిఖీలు చేస్తాం. నిజంగానే అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటాం. అప్పుడప్పుడు తూనికలు– కొలతల అధి కారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.  – ఆర్‌.నరసింహమూర్తి,                  
  సి–సెక్షన్‌ సూపరింటెండెంట్‌

చుక్కలు చూపిస్తున్నారు 
సరదాగా సినిమా కోసం వస్తే ప్రత్యేక ధరలంటూ చుక్కలు చూపిస్తున్నారు. కుటుంబంతో కలసి సినిమాకు రావాలంటే భయం వేస్తుంది. మా నుంచి యాజమాన్యాలు అడ్డగోలుగా దోచుకుంటున్నా.. అధికారులు పట్టించుకోకపోవడం దారుణం. అధికారులు ఎప్పటికప్పుడు సినిమా థియేటర్లను తనిఖీ చేయాలి. 
–కల్యాణ్,ప్రేక్షకుడు 

థియేటర్లను తనిఖీ చేయాలి
సినిమా థియేటర్లలో లభించే ఆహార పదార్థాలు తినాలంటే భయం వేస్తుంది. ఒక వైపు అధికంగా ధరలు ఉంటే మరో వైపు ఎలాంటి నాణ్యత లేకుండా తయారు చేస్తున్నారు. కొన్ని చిప్స్‌ ప్యాకెట్ల థియేటర్లలో తప్పితే.. ఎక్కడా లభించవు. వాటిని తినడం వల్ల రోగాలు వచ్చే అవకాశం ఉంది. అధికారులు ఎప్పటికప్పుడు థియేటర్లను తనిఖీ చేయాలి.                      
–కిశోర్‌ వర్మ, ప్రేక్షకుడు

>
మరిన్ని వార్తలు