ఒంగోలుకు యూనివర్సిటీ

16 Oct, 2018 11:44 IST|Sakshi

త్వరలోనే జీఓ

పర్చూరులో మెగా ఫుడ్‌ పార్క్‌

కోర్టు గొడవలు తీరగానే వాన్‌ పిక్‌

జనవరికి వెలిగొండ టన్నెల్‌ 1 పూర్తి

గుండ్లకమ్మ, కొరిశపాడు, రాళ్లపాడు ప్రాజెక్టులు పూర్తి చేస్తాం

దొనకొండ, కనిగిరిలో పరిశ్రమలు 

కనిగిరిలో రూ. 6వేల కోట్లతో ఇంటింటికి కుళాయి నీరు

ఒంగోలులో సీఎం చంద్రబాబు హామీల మూట 

సాక్షి ప్రతినిధి ఒంగోలు: ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో జిల్లాకు ఇచ్చి నెరవేర్చని పలు హామీల చిట్టాను మరోమారు చదివి వినిపించారు. సోమవారం స్థానిక మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రతిభా అవార్డుల పంపిణీ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఒంగోలులో యూనివర్శిటీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు యూనివర్శిటీకి సంబంధించి జీఓను వెంటనే విడుదల చేస్తారని, తాను వచ్చి త్వరలోనే యూనివర్శిటీని ప్రారంభిస్తానని చెప్పారు. పర్చూరులో మెగా ఫుడ్‌ పార్కు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కోర్టు వివాదాలు పరిష్కారమైన వెంటనే వాన్‌ పిక్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. వెలిగొండ టన్నెల్‌ 1 పనులను జనవరి నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. గుండ్లకమ్మ సిద్ధంగా ఉందన్నారు. కొరిశపాడు, రాళ్లపాడు కూడా సిద్ధం అవుతున్నాయన్నారు. దొనకొండ, కనిగిరిలో పరిశ్రమలు నెలకొల్పుతామని చెప్పారు. వెటర్నరీ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. రామాయపట్నం పోర్టుకు త్వరలోనే శంకుస్థాపన చేస్తామన్నారు. కనిగిరి ప్రాంతంలో ఫ్లోరైడ్‌ నివారణకు రూ. 6 వేల కోట్లతో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా మంచినీటిని సరఫరా చేస్తామన్నారు. నాగార్జున సాగర్‌ కాలువల ఆధునీకరణ పనులను పూర్తి చేస్తామన్నారు. 

కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన 7,010 మంది విద్యార్థులకు ముఖ్యమంత్రి ప్రతిభా అవార్డులు అందచేశారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సైతం కార్యక్రమానికి తరలివచ్చారు.  కార్యక్రమంలో మంత్రులు, గంటా శ్రీనివాసరావు, సిద్దా రాఘవరావు, బాపట్ల ఎంపీ శ్రీరామ్‌ మాల్యాద్రి, ఎమ్మెల్యేలు ముత్తుముల అశోక్‌రెడ్డి, ఏలూరు సాంబశివరావు, డేవిడ్‌రాజు, బాబూరావు, బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్, ఆమంచి కృష్ణమోహన్, దామచర్ల జనార్దన్, ఎమ్మెల్సీలు కరణంబలరాం, మాగుంట శ్రీనివాసులురెడ్డి, పోతుల సునీత, యండపల్లి శ్రీనివాసులురెడ్డి, కత్తి నర్సింహారెడ్డి, అటవీ అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ దివి శివరాం, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ జూపూడి ప్రభాకర్‌రావు, లిడ్‌ క్యాప్‌ చైర్మన్‌ ఎరిక్సన్‌ బాబు, విద్యాశాఖ కమిషనర్‌ సంధ్యారాణి, సుజాత శర్మ, ఉదయలక్ష్మి, కలెక్టర్‌ వినయ్‌ చంద్, కరణం వెంకటేష్, సిద్దా సుధీర్,   తదితరులు పాల్గొన్నారు.  

విద్యాకుసుమాల మనోగతం
ఒంగోలు సబర్బన్‌: రాష్ట్ర స్థాయి ప్రతిభ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం సందర్భంగా పలువురు విద్యార్థులు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. తమను తల్లి, దండ్రులు, గురువులు ఏవిధంగా ప్రోతంహించారో ముఖ్యమంత్రి సమక్షంలో వెల్లడించారు.

చదివించటమే ప్రణాళికగా పెట్టుకోవాలి, 
తల్లిదండ్రులు తమ పిల్లల్ని చదివించటమే ప్రణాలికగా పెట్టుకోవాలి. ఒక సంవత్సరం ప్రణాళిక అయితే వరి వేయండి, పది సంవత్సరా ప్రణాళిక అయితే ఒక మొక్క నాటండి, జీవితాంతం ప్రణాళిక అయితే పిల్లల్ని విద్యావంతుల్ని చేయండి. ఆడపిల్ల అని కూడా చూడకుండా నా తల్లిదండ్రులు ప్రోత్సహించటం వల్లనే త్రిపుల్‌ ఐటీ చదువుతున్నా. ముఖ్యమంత్రి సమక్షంలో అవార్డు తీసుకుంటానని ఏనాడూ అనుకోలేదు.
ఎం. యామినీ శివ శ్వేత, జె.పంగులూరు

అమ్మాయిలను బాగా చదివించండి, 
అమ్మాయిలని చులకనగా చూడకుండా తల్లి దండ్రులంతా చదివించాలి. ప్రభుత్వం అమ్మాయిల్లో డ్రాప్‌ అవుట్స్‌ ఉన్నారని దానిని అరికట్టటానికి సైకిళ్లు అందిస్తుంది. ఆసక్తి ఉండటం వల్లనే నన్ను చదివిస్తున్నారు. మార్పు కోసం చుదువు చాలా అవసరం.
ఎస్‌.కె.అమీరున్‌బీ, 
టకారిపాలెం, కనిగిరి మండలం

సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి
విద్యార్థులు అడ్వాన్సుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి. విద్యలో సాంకేతికను జోడిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. ప్రభుత్వం అవార్డులు ఇచ్చి ప్రోత్సహిస్తోంది. ఇదే స్ఫూర్తితో చదువులో బాగా రాణిస్తాం. తోటి వారిని కూడా బాగా రాణించే విధంగా ఉత్సాహం నింపుతాం.
రేణుకా సత్యసాయి, శ్రీకాకుళం

మరిన్ని వార్తలు