కనీస జ్ఞానం లేకుండా రాస్తే ఎలా?

10 Nov, 2023 03:24 IST|Sakshi

సీఎంవో పేరు ఎవరైనా చెబుతారా

రాజకీయంగా బురద జల్లేందుకే ఇసుకపై ‘ఈనాడు’ అసత్య కథనాలు

దానిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం గనులశాఖ సంచాలకులు వీజీ వెంకటరెడ్డి

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పారదర్శకంగా నిర్వహిస్తున్న ఇసుక గనులపై దురుద్దేశ్యంతో ప్రభుత్వంపై బురద జల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్న ఈనాడు దిన­పత్రికపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు రాష్ట్ర గను­ల­శాఖ సంచాలకులు వీజీ వెంకటరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్‌పై ఆ పత్రిక ‘‘ఇసుకకు టెండరు పెట్టింది సీఎంఓనా?’’ అంటూ ప్రచురించిన కథనం పూర్తిగా అవాస్త­వ­మని గురువారం ఒక ప్రకటనలో ఆయన ఖండించారు.

అనుమతుల్లేకుండానే పలు జిల్లాల్లో అక్రమ దందా అంటూ అర్థంలేని రాతలు రాయడంపై ఆయన మండిప­డ్డారు. నిజానికి.. ఇసుకపై రాష్ట్ర ప్రభుత్వం ఒక పారదర్శక విధా­నాన్ని అమలుచేస్తోందని, దానిపై అపోహలు కలిగించేలా ఇసుక తవ్వకాలు చేసే వారు సీఎంఓ పేరు చెబుతు­న్నారంటూ పొంతనలేని అంశాలతో అసత్య కథనాన్ని వండివార్చడంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. 

మళ్లీ టెండర్లు అయ్యేవరకూ జేపీనే..
గతంలో రాష్ట్రవ్యాప్తంగా మూడు ప్యాకేజీల్లో ఇసుకకు టెండర్లు నిర్వహించామని.. ఈ టెండర్లలో జేపీ సంస్థ సక్సెస్‌­ఫుల్‌ బిడ్డర్‌గా ఎంపికైన విషయాన్ని వెంకటరెడ్డి గుర్తుచే­శారు. ఈ సంస్థ ఆధ్వర్యంలోనే గత రెండేళ్లుగా ఇసుక తవ్వ­కాలు జరుగుతున్నాయని, తిరిగి టెండర్లు నిర్వహించే వరకు ఇదే సంస్థ రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్‌ నిర్వహిస్తుంద­న్నారు.

మరోవైపు.. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎంఎస్‌­టీసీ ద్వారా ఇసుక ఆపరేషన్స్‌ కోసం మరోసారి టెండర్ల ప్రక్రియ జరుగుతోందని, అప్పటివరకు పాత కాంట్రాక్టింగ్‌ ఏజెన్సీ ద్వారానే ఇసుక ఆపరేషన్స్‌ జరుగుతా­యని, గత­ంలోనూ ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పినా అవే తప్పుడు కథనాలను ప్రచురించడం ఈనాడు దురుద్దేశ్యాన్ని తెలియజేస్తోందని వెంకటరెడ్డి పేర్కొన్నారు. 

అభూతకల్పనలతో రాయొచ్చా?..
ఇక వర్షాకాలంలో ఇసుక ఆపరేషన్స్‌ నిలిచిపోయినందున ఎండాకాలంలో జేపి సంస్థ ద్వారా తవ్వి, స్టాక్‌ యార్డ్‌లలో నిల్వచేసిన ఇసుక విక్రయాలు కొనసాగుతున్నాయన్నారు. అలాగే, తిరిగి ఇసుక తవ్వకాలు చేసేందుకు వీలుగా అను­మతి ఉన్న రీచ్‌లలో ఇసుక తవ్వకాలకు పాత కాంట్రాక్టింగ్‌ ఏజెన్సీ సిద్ధమవుతోందని, దీన్ని వక్రీకరిస్తూ బయటి వ్యక్తులు ఎవరో ఇసుక తవ్వ­కాలు జరుపుతున్నారని, సీఎంఓ నుంచి తమకు అనుమతి ఉందని వారు చెబు­తు­న్నా­రంటూ ఈనాడు అభూత కల్పనలతో కథనాన్ని ప్రచు­రించడం ఎంతవరకు సమంజసమంటూ ఆయన ప్రశ్నించారు.

ఇసుక ఆపరేషన్స్‌కు గనుల శాఖ నుంచి అనుమ­తులు మంజూరవుతాయని.. మైనింగ్‌ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఇది తెలుసునన్నారు. అటువంటిది సీఎంఓ అనుమతితో ఇసుక తవ్వుతు­న్నామని ఎవరైనా ఎలా చెబుతారని, ఒక్క ఈనాడుకు మాత్రమే ఇలా చెబు­తు­న్నారా? అంటూ ఆయన ప్రశ్నించారు. ఒక అంశంపై రాసే సందర్భంలో కనీస పరిజ్ఞానం కూడా లేకుండా అసత్య కథనాలను ప్రచురించడాన్ని ఆయన తప్పుబట్టారు.

గతంలోని అక్రమాలు ఈనాడుకు కనిపించలేదా?
గతంలో ఉచిత ఇసుక విధానం పేరుతో పెద్దఎత్తున ఇసుక మాఫియా జేబులు నింపుకున్న రోజుల్లో ఈనాడుకు ఆ అక్ర­మాలు కనిపించలేదా అంటూ వెంకటరెడ్డి ప్రశ్నించారు. సీఎం జగన్‌ అత్యంత పార­­దర్శకంగా ఇసుక విధా­నాన్ని తీసుకొచ్చి, ప్రజలకు అందుబాటు ధరలో, వర్షాకా­లంలోనూ ఇసుక కొరతలే­కు­ండా ఇసుకను అందిస్తుంటే ఈనాడు తట్టుకోలేక తప్పుడు వార్తలను వండివారుస్తోందన్నారు.

నిజానికి.. ఎలాంటి విమర్శలకు అవకాశంలేకుండా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ, మినీరత్నగా గుర్తింపు పొందిన ఎంఎస్‌టీసీ ద్వారా ఇసుక టెండర్లు నిర్వహి­స్తు­న్నామని.. ఆసక్తి ఉన్న ఎవరైనా ఈ టెండర్లలో పాల్గొనేందుకు అవకాశముందని ఆయన పేర్కొన్నారు.

వాస్తవా­లిలా ఉంటే.. జిల్లాల్లో అక్రమ ఇసుక దందా జరుగుతోందని, పులివెందుల నేత సోదరుల ఆధ్వర్యంలో తవ్వకాలు జరుగుతున్నాయని.. జిల్లాకో ఇన్‌చార్జిని నియమించారంటూ ఈనాడు అబద్ధాలను పోగేసి అవాస్తవాలతో కూడిన కథనాన్ని ప్రచురించిందన్నారు. ఇకనైనా ఇటువంటి తప్పుడు కథనాలను మానుకోకపోతే ఈనాడుపై చట్టప­ర­మైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

మరిన్ని వార్తలు