అపనమ్మకం.. అభద్రతా భావం.!

22 Mar, 2019 10:05 IST|Sakshi
రైల్వే స్టేషన్‌ రోడ్డులో చంద్రబాబునాయుడు రోడ్డు షోలో అంతంతమాత్రంగా జనాలు 

ఎన్నికల వేళ నలభై ఏళ్ల అనుభవానికి కలవరం

ప్రజలు వద్దనుకుంటే నమస్కారం పెడతానంటూ వ్యాఖ్య

మూడు రోజుల వ్యవధిలో జిల్లాలో రెండు సార్లు పర్యటన

అప్పుడే ఓటమిని అంగీకరించిన సీఎం    

సాక్షిప్రతినిధి, విజయనగరం: టీడీపీ అధినేతకు విజయంపై నమ్మకం సన్నగిల్లిందా...? పార్టీ విజయావకాశాలపై అభద్రతా భావం వెంటాడుతోందా..? ఇటు జిల్లాలోనూ ఎమ్మెల్యే అభ్యర్థుల విజయావకాశాలపై అపనమ్మకం ఉందా..?  చంద్రబాబు వరుస పర్యటనలు, ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే ఔననే మాట ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. సార్వత్రిక ఎన్నికల నగారా మోగిన అనంతరం ఇప్పటి వరకు రెండు సార్లు జిల్లాలో పర్యటించడం వెనుక ఓటమి భయమే కారణమని స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నెల 17న విజయనగరం పట్టణంలోని అయోధ్య మైదానంలో జరిగిన సభకు హాజరైన ముఖ్యమంత్రి మళ్లీ మూడు రోజుల వ్యవధిలోనే గురువారం విజయనగరం పట్టణంలో రోడ్‌షో ద్వారా ఓటర్లను ఆకర్షించే పని పెట్టుకోవటంపై అధికార పార్టీ నేతలు, కార్యకర్తల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు ఎన్నికలకు ముందు ఒక్కసారి వచ్చి వెళ్లిపోయే వ్యక్తి ఈ ఎన్నికల్లో వరుస పర్యటనలు చేస్తుండటం వెను క పార్టీపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లడమే కారణమని తెలుస్తోంది.


పార్టీ పరిస్థితిపై కలవరం
2019 సార్వత్రిక ఎన్నికల సమరంలో భాగంగా  విజయనగరం అభ్యర్థిగా పి.అశోక్‌గజపతిరాజు కుమార్తె,  అదితి గజపతి పేరు ప్రకటించటంపై నియోజకవర్గంలోని బీసీ నాయకుల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతుండటం చంద్రబాబును కలవరపెడుతోంది. జిల్లాలోనూ భారీ స్థాయిలో అవినీతి, అక్రమాలు చేసిన సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు సీట్లు కేటాయించకూడదనుకున్నా... గత్యంతరం లేక పలువురికి అవకా శం కల్పించినా... విజయనగరం ఎమ్మెల్యే మీ సాల గీతకు మాత్రం మొండి చెయ్యి చూపిం చారు.
 చీపురుపల్లిలో కె.త్రిమూర్తులురాజు, విజయనగరంలో మీసాల గీత బాధ్యతను తాను తీసుకుంటానంటూ బజ్జగించే ప్రయత్నం చేశారు. కానీ చీపురుపల్లి సభకు త్రిమూర్తులురా జు రాలేదు. విజయనగరం సభకు గీత వచ్చినా అన్యమనస్కంగానే కనిపించారు. ఇదిలా ఉండగా విజయనగరం, సాలూరు, చీపురుపల్లి రోడ్‌ షోలో పాల్గొన్న చంద్రబాబు ప్రజా సమస్యలపై  ప్రస్తావించకపోవటం ప్రజలను నిరాశ పరచింది. 

విపక్షనేతపై వ్యక్తిగత విమర్శలు
మూడు సభల్లో ఆయన విపక్ష నేతను టార్గెట్‌ చేసుకున్నారు. తాజాగా జరిగిన సంఘటనలను ఆయనకు ఆపాదించే ప్రయత్నం చేశారు. ఈ రాష్ట్రంలోనూ... హైదరాబాద్‌లోనూ... ఎంతో అభివృద్ధి జరిగిందనీ, దానంతటికీ తానే కారణమంటూ ఎప్పటి మాదిరిగా సొంత డబ్బాకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. 
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని ప్రజలు తనను అనుమానిస్తున్నారేమోనని ఎన్నో చేశానని చెప్పేందుకు తెగ తాపత్రయపడ్డారు. అంతేనా... మొన్న వచ్చినపుడు ఓ వృద్ధురాలి కాలికి నమస్కారం పెట్టడమే గాకుండా... ఈసారి పర్యటనలో ప్రజలకు వంగి... వంగి దండాలు పెట్టడం విశేషం. 

మరిన్ని వార్తలు