ఆమెకు పదవి ఇవ్వడం నా వ్యక్తిగతం: చంద్రబాబు

27 Apr, 2018 19:58 IST|Sakshi

ఉద్యోగాలు రాని వారు నాపై విమర్శలు చేస్తూ.. పుస్తకాలు రాస్తున్నారు

నాకు ప్రజలు రక్షణ కవచంలా ఉండమని చెప్పలేదు

పవన్‌, ఇతర ఎవ్వరిపైనా బురద చల్లే ప్రయత్నం చేయను 

తొలిసారి మూడో ఫ్రంట్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది టీడీపీయే

వచ్చే ఎన్నికల్లో 25 సీట్లు వస్తే ప్రధానిని నిర్ణయించేది మేమే : చంద్రబాబు

సాక్షి, విశాఖపట్నం​ : తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో మహారాష్ట్ర మంత్రి సుధీర్‌ ముంగటివర్‌ సతీమణి సప్నకు సభ్యత్వం ఇవ్వడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. టీటీడీ బోర్డులో బీజేపీ మంత్రికి భార్యకు అవకాశం ఇవ్వడం తన వ్యక్తిగత (పర్సనల్‌) విషయమని అన్నారు. ఆమె వెంకటేశ్వర స్వామి భక్తురాలని, అంతేకాకుండా సదరు మంత్రితో తనకు చాలా ఏళ్లుగా వ్యక్తిగత అనుబంధం ఉందని అందుకే మండలిలో సభ్యత్వం ఇచ్చానని పేర్కొన్నారు. పైగా ఇందులో తప్పేముందని పాత్రికేయులను తిరిగి ప్రశ్నించారు.

రిటైర్‌ అయ్యి ఉద్యోగాలు రాని వారు తనపై విమర్శలు చేస్తూ.. పుస్తకాలు రాస్తున్నారంటూ చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. వాళ్లు తమ పని చూసుకోకుండా ఇలా ప్రవర్తించడం మంచిది కాదంటూ హితవు పలికారు. ఇటీవల తనకు ఏదైనా జరిగితే ప్రజలు రక్షణ కవచంలా ఉండమని చెప్పిన బాబు ఇప్పుడు మాట మార్చారు. తాను అలా చెప్పలేదని తనపై కుట్రలకు పాల్పడుతున్నారని, పోలవరం, ప్రత్యేక హోదా, నిధులపై జరిగే కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించానంటూ చెప్పుకొచ్చారు. తనపై చాలా మంది చాలా కుట్రలు చేస్తున్నారని, కేసులు పెట్టాలని చూసినా ఏమీ చేయలేకపోయారని చంద్రబాబు అన్నారు. 

గవర్నర్‌ వ్యవస్థ వల్ల టీడీపీ చాలా ఇబ్బందులు ఎదుర్కొందని, దీనిపై చాలాసార్లు గవర్నర్‌కు చెప్పామని, కానీ ఇప్పటికీ గవర్నర్‌ అలాగే ప్రవర్తిస్తున్నారంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. తమతో మాట్లాడిన అనంతరం గవర్నర్‌ ఢిల్లీ వెళితే అర్థం ఏంటని ఆయన ప్రశ్నించారు. గవర్నర్లను వాళ్ల పనుల కోసమే పెట్టుకుంటారని విమర్శించారు. తాను పవన్‌పై కానీ, ఇతరులు ఎవ్వరిపైనా బురద చల్లే ప్రయత్నం చేయనని అన్నారు. 2014లో సమన్యాయం కోసం మాట్లాడానని చంద్రబాబు తెలిపారు.

కేంద్రం చాలా నాటకాలు ఆడుతోందని, తమిళనాడులా చేయాలనుకుంటోందని ఆయన మండిపడ్డారు. కొత్త రాష్ట్రం కోసం బీజేపీతో కలిసి నాలుగేళ్లు ఉన్నామని కానీ కేంద్రం తమను పట్టించుకోలేదని అన్నారు. రా​ష్ట్రానికి న్యాయం జరగాలని, అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. కేంద్రంలో తొలిసారి మూడో ఫ్రంట్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది టీడీపీయే అని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో 25 సీట్లు వస్తే తామే ప్రధానిని నిర్ణయిస్తామని వెల్లడించారు.

మరిన్ని వార్తలు