కార్మిక వ్యతిరేకి చంద్రబాబు

19 Apr, 2018 07:05 IST|Sakshi
కలెక్టరేట్‌ ఎదుట బైఠాయించిన ఆశావర్కర్లు

ఆశా కార్యకర్తలతో  వెట్టిచాకిరీ 

అందని అలవెన్సులు.. పారితోషికాలు 

కనీస వేతనానికి  నాయకుల డిమాండ్‌ 

ఆశా కార్యకర్తల కలెక్టరేట్‌ ముట్టడి భగ్నం 

అనంతపురం అర్బన్‌ : ముఖ్యమంత్రి చంద్రబాబు కార్మిక వ్యతిరేకి అని, కార్మికుల సంక్షేమాన్ని, హక్కులను కాలరాస్తున్నారని నాయకులు ధ్వజమెత్తారు. ఆశా వర్కర్ల సమస్యలను ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు. సమస్యల పరిష్కారం కోసం ఆశా వర్కర్ల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన 48 గంటల దీక్ష ముగింపులో భాగంగా బుధవారం చేపట్టిన కలెక్టరేట్‌ ముట్టడిని పోలీసులు భగ్నం చేశారు. అంతకు ముందు ఆశావర్కర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నాగవేణి అధ్యక్షతన జరిగిన ధర్నాలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇ.ఎస్‌.వెకంటేశ్, ఐద్వా జిల్లా కార్యదర్శి వి.సావిత్రి, శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్‌ దిల్షాద్‌ మాట్లాడారు. ముఖ్యమంత్రి కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ కార్మికుల జీవితాలతో చెలగాటం అడుతున్నారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆశా వర్కర్లకు కనీసవేతనం ఇవ్వకుండా వెట్టిచాకిరీ చేయిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం ఇచ్చే పారితోషికాలనూ రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని ఆరోపించారు.

యూనిఫాం అలవెన్స్‌ నెలకు రూ.500 చొప్పున కేంద్రం మంజూరు చేస్తుంటే ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా ఆశావర్కర్లకు ఇవ్వడం లేదన్నారు. ఇలా ఆశా వర్కర్ల డబ్బులను పక్కదారి పట్టిస్తోందని దుమ్మెత్తిపోశారు. టీబీ, లెప్రసీ, క్యాన్సర్, ఎయిడ్స్‌ వంటి వ్యాధిగ్రస్తులకు చేస్తున్న సేవలకు ఇవ్వాల్సిన పారితోషికాలు మూడేళ్లుగా చెల్లించలేదని ధ్వజమెత్తారు. ఆశావర్కర్లకు రూ.6 వేలు వేతనం ఇవ్వాలని, బకాయి పడిన యూనిఫారం అలెవన్స్, పారితోషికాలను తక్షణం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. హెల్త్‌కార్డులు ఇవ్వాలని, అర్హులైన వారిని రెండవ ఏఎన్‌ఎంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఈటె నాగరాజు, ఆశావర్కర్ల సంఘం జిల్లా అధ్యక్షురాలు పద్మావతి, నాయకురాళ్లు పార్వతి, సౌభాగ్య, మంజూల, ఆనందలక్ష్మి, ఇర్ఫానా, సుజాత తదితరులు పాల్గొన్నారు. 
నాయకుల అరెస్ట్‌ 
ధర్నా అనంతరం కలెక్టరేట్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించిన ఆశావర్కర్లను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. నాయకురాళ్లు సావిత్రి, దిల్షాద్, వెంకటేశ్, నాగరాజు, నాగవేణి, పలువురు కార్యకర్తలను అరెస్టు చేసి వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు.

మరిన్ని వార్తలు