కృష్ణమ్మ ఒడికి గోదావరి

14 Jan, 2020 01:25 IST|Sakshi
ప్రగతి భవన్‌లో సోమవారం సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్‌ జగన్‌ మధ్య ఏకాభిప్రాయం 

ప్రగతి భవన్‌లో ఇరువురు సీఎంల సమావేశం 

గోదావరి నీరు తరలింపులో సమయం, ఖర్చు తక్కువ

9, 10వ షెడ్యూళ్లలోని సంస్థల ఆస్తుల విభజనను పూర్తిచేయాలని నిర్ణయం 

త్వరలో భేటీ కావాలని ఇరు రాష్ట్రాల సీఎస్‌లకు సూచన 

కృష్ణా నదిలో నీరు రాక రాయలసీమ, తెలంగాణ రైతులు నష్టపోతున్నారు 

అందుకే గోదావరి నీటిని తరలించి కృష్ణా ఆయకట్టును స్థిరీకరించాలి 

తద్వారా రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు, తెలంగాణలోని పాలమూరు, నల్లగొండ జిల్లాలకు సాగునీరు 

సాక్షి, హైదరాబాద్‌/సాక్షి, అమరావతి: ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా అన్ని అంశాల్లో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకు సాగాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖరరావు, వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నిర్ణయించారు. కృష్ణా నదిలో నీటి లభ్యత విషయంలో ప్రతి సంవత్సరం అనిశ్చిత పరిస్థి తులు నెలకొంటున్నందున గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టుకు అందించే విషయంలో ఇరువురు సీఎంలు ఏకాభిప్రాయానికి వచ్చారు. రాష్ట్ర విభజన చట్టంలోని 9, 10వ షెడ్యూళ్లలో పేర్కొన్న సంస్థల ఆస్తుల విభజనను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌ తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌కు కేసీఆర్‌ ఘన స్వాగతం పలికారు. జగన్‌ ప్రతినిధి బృందంతో కలిసి కేసీఆర్‌ మధ్యాహ్న భోజనం చేశారు. భోజనం అనంతరం ఇద్దరు ముఖ్యమంత్రులు దాదాపు 6 గంటల పాటు రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు, దేశ, స్థానిక రాజకీయ పరిస్థితులపైనా చర్చించారు. ప్రధానంగా గోదా వరి జలాలను కృష్ణా ఆయకట్టుకు తరలించే అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ భేటీ వివరాలను తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రుల కార్యాలయాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి.

సోమవారం ప్రగతిభవన్‌లో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌కు స్వాగతం పలుకుతున్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌. చిత్రంలో ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి 

తదుపరి సమావేశంలో మరింత విస్తృతంగా చర్చ
‘కృష్ణా నదిలో నీటి లభ్యత ప్రతి ఏడాది ఒకే రకంగా ఉండటం లేదు. చాలా సందర్భాల్లో కృష్ణా నది ద్వారా నీరు రావడం లేదు. దీంతో ఈ నది ఆయకట్టు కింద ఉన్న రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల రైతులు, తెలంగాణ రైతులు నష్టపోతున్నారు. అందుకే పుష్కలమైన నీటి లభ్యత ఉన్న గోదావరి నది నీటిని తరలించి, అవసరమైన సందర్భంలో కృష్ణా ఆయకట్టు రైతులకు ఇవ్వడమే వివేకవంతమైన చర్య. దీంతో అటు రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు, ఇటు పాలమూరు, నల్లగొండ జిల్లాల వ్యవసాయ భూములకు కచ్చితంగా నీరు అందుతుంది. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజె క్టులను ఉపయోగించుకుంటూనే గోదావరి జలా లను తరలించడం ద్వారా కృష్ణా ఆయకట్టును స్థిరీకరించుకోవాలి. తక్కువ సమయం, తక్కువ ఖర్చుతో అనుకున్న విధంగా గోదావరి నీటిని తరలించవచ్చు’ అని ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశంలో స్థిర నిర్ణయం కుదిరింది. గోదావరి నీటిని ఎక్కడి నుంచి ఎటు తరలించాలి? ఎలా వినియోగించాలి? దీనికి సంబంధించిన మోడల్‌ ఎలా ఉండాలి? అనే దానిపై తదుపరి సమావే శంలో మరింత విస్తృతంగా చర్చించాలని వైఎస్‌ జగన్, కేసీఆర్‌ నిర్ణయించారు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోశ్‌కుమార్‌ సెల్ఫీ

పరస్పర సహకారం, అవగాహనతో వ్యవహరిస్తే.. 
‘‘విభజన చట్టంలోని 9, 10వ షెడ్యూళ్లలో పేర్కొన్న ప్రభుత్వ రంగ సంస్థల విభజన విషయంలో అనవసర పంచాయితీ ఉంది. దీన్ని త్వరగా పరిష్కరించుకోవాలి. పరస్పర సహకారం, అవగాహనతో వ్యవహరిస్తే దీన్ని పరిష్కరించడం పెద్ద కష్టం ఏమీ కాదు’’ అని ఇద్దరు సీఎంలు అభిప్రాయపడ్డారు. ఈ సమావేశం నుంచే ఇద్దరు సీఎంలు తమ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో(సీఎస్‌లు) ఫోన్‌లో మాట్లాడారు. 9, 10వ షెడ్యూళ్లలోని సంస్థల విభజన అంశాలను పరిష్కరించుకునే దిశగా త్వరలోనే సమావేశం కావాలని సూచించారు. ప్రగతి భవన్‌కు వచ్చిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెంట ఎంపీలు వి.విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మిథున్‌రెడ్డి ఉన్నారు. జగన్‌కు స్వాగతం పలికిన వారిలో తెలంగాణ మంత్రి కేటీఆర్, ఎంపీ జె.సంతోష్‌ కుమార్‌ ఉన్నారు. ప్రగతి భవన్‌లో కేసీఆర్‌తో భేటీ అనంతరం వైఎస్‌ జగన్‌ బేగంపేట విమానాశ్రయం నుంచి విమానంలో కృష్ణా జిల్లా గన్నవరం బయలుదేరి వెళ్లారు.

మరిన్ని వార్తలు