మత్స్యకారులకు ఇక ఆర్థిక సుస్థిరత

21 Nov, 2019 03:20 IST|Sakshi

నేడు వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పథకం ప్రారంభం 

వేట విరామ సాయం రూ.4 వేల నుంచి రూ.10 వేలకు పెంపు 

డీజిల్‌ రాయితీ రూ.6.03 నుంచి రూ.9కి పెంపు 

1.35 లక్షల మత్స్యకార కుటుంబాలకు లబ్ధి

సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మత్స్యకారుల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలు వారి ఆర్థిక సుస్థిరతను బలోపేతం చేయనున్నాయి. ఏటా ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14 వరకు సముద్రంలో వేట నిషేధం. ఈ సమయంలో మత్స్యకార కుటుంబాలను ఆదుకునేందుకు గత ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ.4 వేలు చెల్లించేది. దీనిని ఇప్పుడు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఏకంగా రూ.10 వేలకు పెంచింది. దీంతో రాష్ట్రంలోని 1.35 లక్షల మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. మౌలిక సదుపాయాలను ప్రాధాన్యతా క్రమంలో కల్పించడానికి బడ్జెట్‌లో మత్స్య శాఖకు రూ.551 కోట్లు కేటాయించింది. 

ముమ్మిడివరంలో ‘మత్స్యకార’ దినోత్సవం 
ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు ముమ్మిడివరం, ఐ.పోలవరం మండలాల్లో బుధవారం మార్కెటింగ్, మత్స్యశాఖా మంత్రి మోపిదేవి వెంకటరమణారావు, సీఎం కార్యక్రమాల కోఆర్డినేటర్‌ తలశిల రఘురామ్, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్, జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి తదితరులు ఏర్పాట్లు పరిశీలించారు. 

వేటకెళ్లే మత్స్యకారులందరికీ వైఎస్సార్‌ మత్స్యకార భరోసా
సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులందరికీ వైఎస్సార్‌ మత్స్యకార భరోసా అందుతుందని ప్రభుత్వం బుధవారం సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. రైతు భరోసా, వాహన మిత్ర, సంక్షేమ పింఛన్లు పొందే వారు చేపల వేట కూడా సాగిస్తుంటే వైఎస్సార్‌ మత్స్యకార భరోసా కింద సాయం అందుకోవచ్చని ప్రభుత్వం 
ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. 

నేడు సీఎం కార్యక్రమాలు ఇలా..
- సీఎం వైఎస్‌ జగన్‌ గురువారం ఉదయం 9 గంటలకు తాడే పల్లి నివాసం నుంచి బయలు దేరి 9.45 గంటలకు ముమ్మడివరం మండలం గాడిలంక చేరుకుంటారు. 
వృద్ధ గౌతమి గోదావరిపై ఐ.పోలవరం మండలం పశువుల్లంక – సలాదివారిపాలెం మధ్య రూ.35 కోట్లతో నిర్మించిన వైఎస్సార్‌ వారధిని ప్రారంభిస్తారు. (ఈ వంతెన నిర్మాణంతో గోదావరి అటు, ఇటు ఉన్న 11 గ్రామాల్లోని 10 వేల మందికి ప్రయోజనం. ఈ వంతెనకు 2009లో దివంగత వైఎస్సార్‌ శంకుస్థాపన చేశారు.) వారధి వద్ద ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ నిలువెత్తు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. 
ముమ్మడివరం మండలం కొమానపల్లిలో జరిగే బహిరంగ సభలో  వైఎస్సార్‌ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. జీఎస్‌పీసీ బకాయిలు అందజేస్తారు. 
ముమ్మిడివరంలో డిగ్రీ కాలేజీ, ఎదుర్లంక వద్ద తీర గ్రామాల పరిరక్షణ కోసం రూ.70 కోట్ల ప్రాజెక్టు, బోటు ప్రమాదాల నివారణ కోసం బోటు కంట్రోల్‌ రూమ్‌లకు శంకుస్థాపన. 
మధ్యాహ్నం యానాం చేరుకుని, పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు నివాసానికి వెళతారు. ఇటీవల తండ్రిని కోల్పోయిన ఆయన్ను పరామర్శించి తాడేపల్లికి బయలుదేరుతారు. 

మత్స్యకారులకు మేలు ఇలా
మర పడవల నిర్వాహకులకు గత ప్రభుత్వం లీటర్‌ డీజిల్‌కు ఇచ్చే రూ.6.03 రాయితీ ఇప్పుడు రూ.9కి పెంపు. మరపడవలకే కాకుండా ఇంజను కలిగిన తెప్పలకూ డీజిల్‌ రాయితీ వర్తింపు. ఒక్కో మర పడవకు నెలకు రూ.27 వేలు, ఇంజను కలిగిన తెప్పలకు రూ.2,700 రాయితీ ఇస్తారు. ఏడాదిలో పది నెలలకు స్మార్డ్‌ కార్డుల ద్వారా రాయితీ అందుతుంది.
సముద్రంలో చేపలు పడుతూ 18 నుంచి 60 ఏళ్లలోపు మత్స్యకారులు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పథకం కింద రూ.10 లక్షల ఆర్థిక సాయం. (ఇప్పటి దాకా రూ.5 లక్షలు మాత్రమే)  
తొమ్మిది కోస్తా తీర జిల్లాల్లో దశల వారీగా ఫిష్‌ లాండింగ్‌ సదుపాయాల కల్పన. మూడు కొత్త ఫిషింగ్‌ హార్బర్లు (నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె, తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ, ప్రకాశం జిల్లా ఓడరేవులో) ఏర్పాటు. మచిలీపట్నం, నిజాంపట్నం హార్బర్‌ల పటిష్టానికి చర్యలు.
2012లో సముద్రంలో చమురు, సహజ వాయువుల నిక్షేపాల అన్వేషణకు జరిపిన తవ్వకాల్లో ముమ్మిడివరం ప్రాంతంలో జీవన భృతి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు రూ.78.24 కోట్ల పరిహారం (జీఎస్‌పీసీ బకాయిలు) అందించనుంది. దీని ద్వారా 16,559 మత్స్యకార కుటుంబాలు లబ్ధిపొందనున్నాయి. ఓఎన్‌జీసీ చెల్లించ వలసిన ఈ పరిహారాన్ని ప్రభుత్వం ముందుగానే చెల్లిస్తోంది. 

మరిన్ని వార్తలు